స్టార్టప్ : కోడి ఈకలతో కోట్ల సంపాదన!

ఓ కాలేజీ స్టూడెంట్‌‌‌‌. చదువుకునే రోజుల్లో ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్‌‌‌‌ చేస్తే.. ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. అతనికి లాభాలు వస్తాయి. అంతేనా పర్యావరణానికి మేలు జరుగుతుంది. కానీ.. ఆ ఐడియాని ఆచరణలో పెట్టేందుకు కావాల్సిన వనరులు అతని దగ్గర లేవు. అందుకే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు దాదాపు పదేండ్లు ఎదురుచూశాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరికి స్టార్టప్‌‌‌‌ పెట్టాడు. కట్‌‌‌‌ చేస్తే.. నాలుగైదేండ్లు కాకముందే ఆ స్టార్టప్​ కోట్లలో వ్యాపారం చేసేలా డెవలప్​ అయింది. 1200 మంది మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండాఎన్నో నేషనల్‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌ అవార్డులు కూడా దక్కాయి. 

రాధేష్ అగ్రహరికి వచ్చిన ఒక ఐడియా అతనితో పాటు మరెంతోమంది జీవితాలను మార్చేసింది. ఉత్తరప్రదేశ్​లోని ఫతేపూర్‌‌‌‌లో పుట్టి, పెరిగాడు. వాళ్ల ఫ్యామిలీలో ఎక్కువమంది డాక్టర్లే. అందుకే రాధేష్​ని కూడా డాక్టర్​ చేయాలి అనుకున్నారు. కానీ.. అతనికి చిన్నప్పటినుంచి డిజైన్ అండ్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌ మీద మక్కువ ఎక్కువ. దాంతో.. మొహాలిలోని ‘టెక్స్‌‌‌‌టైల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో అండర్ గ్రాడ్యుయేషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐఐఎఫ్​టీ) చేశాడు. తర్వాత ‘ఇండియన్​ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్’ (ఐఐసీడీ) జైపూర్‌‌‌‌‌‌‌‌ నుండి టెక్స్‌‌‌‌టైల్ డిజైనింగ్‌‌‌‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌‌‌‌ చేశాడు. అక్కడినుంచే చికెన్ వ్యర్థాల నుంచి ఫైబర్​ తయారుచేసేందుకు ట్రై చేశాడు.
పోస్ట్​ గ్రాడ్యుయేషన్​లో రాధేష్​ తీసుకున్న కోర్సు చదివే స్టూడెంట్స్‌‌‌‌ వాళ్లకు నచ్చిన వేస్ట్ మెటీరియల్స్‌‌‌‌పై రీసెర్చ్‌‌‌‌ చేస్తుంటారు. ఆ కోర్సులో చేరిన మరుసటి రోజు క్లాస్​కి లేట్​గా వెళ్లాడు.

అప్పటికే తన క్లాస్‌‌‌‌మేట్స్ అందరూ రీసెర్చ్​ కోసం ప్లాస్టిక్, శానిటరీ న్యాప్‌‌‌‌కిన్‌‌‌‌ల నుండి థర్మాకోల్ వరకు అన్ని ఇంపార్టెంట్‌‌‌‌ టాపిక్స్​ సెలక్ట్​ చేసుకున్నారు. దాంతో రాధేష్​ సెలక్ట్​ చేసుకునేందుకు ఏ టాపిక్​ మిగల్లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బాగా అప్‌‌‌‌సెట్‌‌‌‌ అయ్యాడు. ఆ మూడ్‌‌‌‌ నుంచి బయటికి వచ్చేందుకు ఏదైనా రుచికరంగా వండుకుని తినాలి అనుకున్నాడు. వెంటనే పక్కనే ఉన్న చికెన్ సెంటర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. ఒక కిలో చికెన్‌‌‌‌ ప్యాక్‌‌‌‌ చేయమని షాప్ అతనికి చెప్పాడు. కానీ.. అతను ఇచ్చిన ప్యాకెట్ బరువు 650 గ్రాములు మాత్రమే ఉంది. డబ్బు మాత్రం కిలో చికెన్‌‌‌‌కి తీసుకున్నాడు. మిగిలిన 350 గ్రాముల గురించి అడిగితే.. ‘అదంతా వేస్ట్’ అని సమాధానం ఇచ్చాడు షాపు అతను. ఆ మాటలు విన్న రాధేష్​కి వెంటనే ‘ఆ వేస్ట్‌‌‌‌ నుంచి పనికొచ్చేది ఏదైనా తయారుచేయొచ్చా?’ అనే ఆలోచన వచ్చింది. అలా అనిపించడం ఆలస్యం షాప్‌‌‌‌ అతన్ని ‘చికెన్​ వేస్ట్‌‌‌‌ని కూడా విడిగా ప్యాక్‌‌‌‌ చేసి ఇవ్వమ’ని అడిగాడు. 

చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌తో కాలేజీకి 

మరుసటి రోజు కాలేజీకి చికెన్​ వేస్ట్‌‌‌‌ బ్యాగ్‌‌‌‌ని పట్టుకుని వెళ్లాడు. ఆ బ్యాగ్​ తెరవగానే క్లాస్​రూం అంతా దుర్వాసన వచ్చింది. అంతా ముక్కు మూసుకున్నారు. క్లాస్​మేట్స్​ అంతా కలిసి రాధేష్​ను క్లాసు నుంచి బయటికి పంపించారు. కానీ.. లెక్చరర్స్‌‌‌‌ మాత్రం అతని ఆలోచనను మెచ్చుకున్నారు. ‘చికెన్ వేస్ట్‌‌‌‌తో ఏం చేయగలవో ఆలోచించు. ఆ ఐడియా ప్రజెంట్ చెయ్యమని’ చెప్పారు. అలా చికెన్ వేస్ట్‌‌‌‌ మీద రీసెర్చ్ మొదలైంది. ఒక ఐడియా జనరేట్‌‌‌‌ చేసి, ప్రాసెస్‌‌‌‌ చేసి, మార్కెట్‌‌‌‌లోకి తెచ్చి సక్సెస్‌‌‌‌ కావడానికి దాదాపు పదేండ్లకు పైనే పట్టింది. ‘కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలి’ అన్నట్టు ఒకేసారి పెద్ద సక్సెస్‌‌‌‌తో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రాధేష్​. 

జర్నీలో ఎన్నో అడ్డంకులు 

రాధేష్​కు ఆలోచన వచ్చినప్పటినుంచి కంపెనీ పెట్టేవరకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. సాధారణంగా ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్‌‌‌‌’లో బాగా డబ్బున్న వాళ్ల పిల్లలే ఎక్కువగా చేరతారు. వాళ్లంతా డిజైన్, ఫ్యాషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ.. రాధేష్​ వాళ్లందరిలో భిన్నంగా ఆలోచించేవాడు. రాధేష్​ తన రీసెర్చ్ కోసం రోజంతా చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌తో పనిచేసేవాడు. అలా చేయడం వల్ల అప్పుడప్పుడు అతని దగ్గర కూడా వాసన వచ్చేది. దాంతో కాలేజీలో చాలామంది అతని దగ్గర నిలబడేందుకు కూడా ఇష్టపడేవాళ్లు కాదు. అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన రీసెర్చ్ మాత్రం ఆపలేదు రాధేష్. 

స్టార్టప్‌‌‌‌ పెట్టి.. 

కాలేజీ నుంచి బయటికి వచ్చాక రాధేష్​ చాలా రోజులు ‘ట్రైఫెడ్ ఇండియా’ అనే సంస్థతో కలిసి పనిచేశాడు. అందులో భాగంగా రెండువేల మందికి పైగా గిరిజన మహిళలకు క్రాఫ్ట్స్ ట్రైనింగ్ ఇచ్చాడు. అతనివల్ల పరోక్షంగా కూడా చాలామందికి ఉపాధి దొరికింది. ఆ తర్వాత చికెన్‌‌‌‌ వేస్ట్ స్టార్టప్‌‌‌‌ పెడతానంటే.. ముందు వాళ్ల కుటుంబమే ఒప్పుకోలేదు. ఎందుకంటే రాధేష్ ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శాఖాహారం తినేవాళ్లే. అందుకే చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ వద్దన్నారు. అయినా కూడా వాళ్ల మాటలు వినకుండా రంగంలోకి దిగాడు. దానివల్ల కుటుంబీకుల్లో కొందరు కనీసం సాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. దాంతో.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

ఇందులోకి ఎందుకు ?

రాధేష్​ చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ని ప్రాజెక్ట్‌‌‌‌గా ఎంచుకోవాడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ వల్ల చాలా పొల్యూషన్‌‌‌‌ జరుగుతోంది. అందుకే తనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో దీనిమీద రీసెర్చ్‌‌‌‌ చేశాడు. చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచంలో తడిచెత్తను ఉత్పత్తి చేసే రంగంలో ‘మీట్‌‌‌‌ ఇండస్ట్రీ’ది మూడో స్థానం. నదీ జలాల ప్రధాన కాలుష్య కారణాల్లో చికెన్​ వేస్ట్​ కూడా ఒకటి. గంగ, యమున లాంటి నదుల్లోని మొత్తం వ్యర్థాల్లో 32.17 శాతం మీట్‌‌‌‌ వేస్ట్ నుంచి వచ్చేదే. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌‌‌‌మెంట్ ఎడ్యుకేషన్ (సీఈఈ) నివేదిక ప్రకారం..

బ్రాయిలర్ మీట్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌లో అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, చైనా తర్వాత మన దేశం ఐదో స్థానంలో ఉంది. మనదేశంలో ఏడాదికి సుమారు 4.6 మిలియన్ మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. దాంతోపాటు కాలుష్యం కూడా బాగానే జరుగుతోంది. అందుకే సీఈఈ ఇలాంటి వేస్ట్ విషయంలో అందరూ శ్రద్ధ తీసుకోవాలని చెప్తోంది. అహ్మదాబాద్ సిటీలోనే రోజుకు దాదాపు 20 టన్నుల చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ వస్తోందనేది ఒక అంచనా. అందులో కొంతవరకు అంటే కొన్ని శరీర భాగాలను ప్రాసెస్‌‌‌‌ చేసి చేపల మేత, ఎరువులుగా వాడుతున్నారు. మిగతాది మునిసిపల్ డంపింగ్ యార్డ్‌‌‌‌లకు చేరుతోంది. 

ఎనిమిదేండ్లకు.. 

చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌తో ప్రొడక్ట్స్‌‌‌‌ తయారీ ఆలోచన పుట్టిన దాదాపు పదేండ్లకు అంటే... 2018లో అది కార్యరూపం దాల్చింది. అప్పటివరకు కోడి ఈకలతో బట్టలను ఎవరూ  తయారు చేయలేదు. కాబట్టి ఆ బిజినెస్‌‌‌‌ ఎలా ఉంటుందో తెలియదు. అలా తయారుచేసే పద్ధతుల గురించి ఎక్కడా సమాచారం దొరకలేదు. అయినా.. కొన్నాళ్లు రీసెర్చ్‌‌‌‌ చేసి కొత్తగా ఒక ప్రాసెసింగ్‌‌‌‌ పద్ధతిని కనిపెట్టాడు. చివరగా 2018లో ‘గోల్డెన్ ఫెదర్స్’ అనే యూనిట్‌‌‌‌ పెట్టాడు. తాను కనిపెట్టిన పద్ధతిలోనే ఈకలను బట్టలుగా మార్చి 2019లో అమ్మకాలు మొదలుపెట్టాడు. 

శాలువాలతో మొదలు

మొదట కబేళాల నుండి వ్యర్థాలను సేకరించి వాటిలో ఉండే పురుగులను చంపడానికి 100 డిగ్రీల టెంపరేచర్‌‌‌‌‌‌‌‌తో స్ట్రీమ్‌‌‌‌ చేస్తారు. ఇంకా మిగిలి ఉన్న క్రిములను చంపేందుకు హైజినిక్‌‌‌‌ పద్ధతుల్లో శానిటైజ్ చేస్తారు. తమదైన పేటెంట్ టెక్నాలజీ, నేచురల్‌‌‌‌ ఇంగ్రెడియెంట్స్‌‌‌‌ని వాడి కోడి ఈకలను ఉన్ని లాంటి ఒక రకమైన ఫైబర్‌‌‌‌గా ప్రాసెస్ చేస్తారు. ఈకలు చాలా తేలికగా ఉంటాయి. అందుకే ప్రాసెస్‌‌‌‌ చేస్తే వచ్చే ఫైబర్‌‌‌‌‌‌‌‌ పత్తి, జనపనార, ఉన్నికి దగ్గరగా ఉంటుంది.

మృదువుగా, వెచ్చగా, మన్నికగా ఉంటుంది. ఈకలను ఉన్నిలా మార్చేందుకు రాజస్తాన్‌‌‌‌లో 1,200 మంది గిరిజన మహిళలకు ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చాడు. మొదట్లో ఎక్కువగా శాలువాలు తయారుచేశారు. వాటికి గిరాకి బాగా ఉండడంతో మరిన్ని ప్రొడక్ట్స్ తయారుచేశాడు. స్పిన్నింగ్‌‌‌‌కు పనికిరాని ఈకలతో హ్యాండ్‌‌‌‌ మేడ్‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌, క్విల్ట్‌‌‌‌, జాకెట్లు, దిండ్ల ఫిల్లర్లు చేస్తున్నారు. మీట్ వేస్ట్‌‌‌‌తో కంపోస్ట్, చేపల మేత తయారవుతోంది.

కోట్లలో ఆదాయం

ప్రస్తుతం కంపెనీకి జైపూర్, పూణేల్లో యూనిట్లు  ఉన్నాయి. బి 2 బి పద్ధతిలో ప్రొడక్ట్స్‌‌‌‌ని అమ్ముతున్నాడు. ఉత్పత్తుల ద్వారా ఏడాదికి 1.5 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు ఏడు కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అంతేకాదు.. లాభంలో 25 శాతం వరకు గిరిజన సంక్షేమం, పిల్లల విద్య, ఆరోగ్యం, వరదలు, కరువుల సమయంలో ఆదుకోవడానికి వాడుతున్నాడు. ఇప్పటివరకు 73 లక్షల కిలోల చికెన్ వేస్ట్‌‌‌‌ని ప్రాసెస్‌‌‌‌ చేశారు. అందుకే రాధేష్ కృషిని మెచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు 25 వరకు వచ్చాయి. అందులో ‘జర్మన్ డిజైన్ అవార్డు, లెక్సస్ డిజైన్ అవార్డు, స్వచ్ఛతా స్టార్టప్ అవార్డు’ లాంటి ప్రతిష్టాత్మకమైనవి కూడా ఉన్నాయి. 

డిజైనర్ నుండి ఇన్నొవేటర్ 

డిజైనర్ నుండి ఇన్నొవేటర్‌‌‌‌‌‌‌‌గా మారేవరకు అతని ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. తను నమ్మినదానికోసం పనిచేశాడు. సక్సెస్‌‌‌‌ అయ్యాడు రాధేష్‌‌‌‌. మొదట్లో చిన్నగా మొదలైన వ్యాపారం ఇప్పుడు విదేశాలకు ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేసే స్థాయికి ఎదిగింది. కోడి ఈకలతో చేసిన ప్రొడక్ట్స్‌‌‌‌కి ఇక్కడ కంటే విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ ఉత్పత్తులు భారతదేశంలోని వివిధ రిటైల్ దుకాణాలు, గవర్నమెంట్‌‌‌‌ హ్యాండీ క్రాఫ్ట్‌‌‌‌ హౌజ్‌‌‌‌లు, ఖాదీ–భండార్లు, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లలో అమ్ముతున్నారు. 

నదులు.. తల్లులు

‘‘ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ రీసైక్లింగ్ మీద పని చేస్తోంది. కానీ... చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. నదులను తల్లులుగా పూజించే మన దేశంలో పేగులు, రక్తం, చర్మం, ఈకలతో కూడిన చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ని నదుల్లో పారేయడం చూసి చాలా బాధేసింది. వాటివల్ల అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. పెద్ద జంతువుల నుండి వచ్చే వ్యర్థాలను లెదర్‌‌‌‌‌‌‌‌లాంటివి చేయడానికి, పెట్స్‌‌‌‌ ఫుడ్‌‌‌‌గా వాడతారు. కానీ.. చికెన్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ని మాత్రం ఎక్కడపడితే అక్కడే పారేస్తున్నారు. దానివల్ల భారీ మొత్తంలో కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. అందుకే దీనికి ఒక పరిష్కార మార్గం వెతకాలని ప్రయత్నం మొదలుపెట్టా. అందులో భాగంగా పుట్టిందే ఈ ఐడియా” అన్నాడు  రాధేష్‌‌‌‌.