సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగింది. గాలివానకు గ్రామాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, ఇంటి పైకప్పులు లేచిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఆత్మకూరు(ఎస్) మండలం దంతాలపల్లిలో రోడ్డుపై భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు పాతర్లపాడు స్టేషన్ వద్ద పలు ఇండ్లపై రేకులు లేచిపోయాయి. రేకుల షెడ్డు లేసిపోవడంతో గోడకూలి చేనేత మగ్గానికి సంబంధించిన యంత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మండలంలో 7 ఎకరాల మక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది.
పంట నష్టం ..
అకాల వర్షాలతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి టి.నాగయ్య తెలిపారు. సోమవారం సూర్యాపేట, ఆత్మకూరు(ఎస్) మండలంలోని మామిడి తోటలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1429 ఎకరాల మామిడి, 17.05 ఎకరాల అరటి తోటకు నష్టం జరిగిందని తెలిపారు.