పత్తి ముంచిందని.. మొక్కజొన్న వైపు రైతుల చూపు

  • అకాల వర్షాలతో తగ్గిన పత్తి పంట దిగుబడి 
  • మార్కెట్ లో  క్వింటాల్ కు రూ. 6 వేల లోపే ధర 
  • అప్పులు కూడా తీరట్లేదని రైతుల ఆవేదన    
  • యాసంగిలో మొక్కజొన్న వేసేందుకు ఆసక్తి 
  • దీనిపైనే ఆశలు పెట్టుకున్న అన్నదాతలు  

జయశంకర్‌ ‌భూపాలపల్లి, వెలుగు : అకాల వర్షాలు పత్తి  రైతులను నిండా ముంచాయి.. మరోవైపు గులాబీ రంగు పురుగు బెడద కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఇంకోవైపు పంట తొలిదశలోనే ఎడతెరపి లేని వానలతో పంటలో ఎదుగుదల లేదు.  గడ్డి పెరిగి పూత, కాత తగ్గింది. తద్వారా దిగుబడి కాస్త 50 శాతానికిపైగా పడిపోయింది. ఎకరానికి12 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం 4 – 6 క్వింటాళ్లునే వస్తుంది. మార్కెట్‌‌లో అమ్ముదామంటే ధర తగ్గింది. చివరకు సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చేంత కూడా రావడంలేదు. దీంతో రైతులకు కన్నీరే మిగిలింది. ఇక పత్తి పంటను తొలగించి రబీలో మొక్కజొన్న సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ఎకరానికి రూ. 25 వేలకు పైగా ఖర్చు

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. మొత్తం సాగుభూమిలో ఈ పంటదే 50 శాతం.  రైతులు ఎకరానికి రూ.25 వేలకుపైగా పెట్టుబడి పెట్టారు. ప్రైవేట్‌‌వడ్డీ వ్యాపారుల వద్ద రూ.2 నుంచి రూ.4 చొప్పున అప్పులు తెచ్చి సాగు చేశారు. ఇలా ఒక్కో రైతు రూ.లక్షల్లో అప్పులు పాలయ్యారు. 

సగానికి తగ్గిన దిగుబడి

పత్తి పంట తొలిదశలో 10 రోజులకు పైగా ఎడతెరపి లేని వానలతో మొక్కలు ఎదుగుదల లేదు.  గడ్డి పెరిగిపోవడంతో మందులు కొట్టి.. కాపాడుకున్న పంటను అకాల వర్షాలు దెబ్బతీశాయి. గత సెప్టెంబర్‌‌, అక్టోబర్‌‌ ‌నెలల్లో కురిసిన భారీ వర్షాలతో పూత, కాత రాలిపోయింది. కాయలు మురిగిపోవడం.. నల్లగా మారిపోవడంతో దిగుబడి సరిగా రాలేదు. ఎకరానికి 6 క్వింటాళ్లకు మించి పంట రావడంలేదు. చెలక భూముల్లో 4 క్వింటాళ్ల మాత్రమే వస్తుంది.  

మొక్కజొన్న సాగు వైపు..

ఏడాది పంట అయిన పత్తి.. ఈసారి ఆశించిన మేర దిగుబడి రాలేదు. రైతులు పత్తిని తొలగించి మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యారు. మొక్కజొన్న క్వింటాల్‌‌కు రూ.2 వేలకుపైగా ధర పలుకుతుంది. యాసంగిలో మరో వంద, రెండు వందలు ధర పెరిగే చాన్స్ ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినా పెట్టుబడి ఖర్చులు పోనూ 20 వేల నుంచి 30 వేలు మిగులుతాయని పేర్కొంటున్నారు.

 ఈ ఏడాది వానలతో చెరువులు, బావుల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. ఎస్సారెస్పీ ద్వారా కూడా కాల్వల్లో నీళ్లు వచ్చే పరిస్థితి కన్పిస్తుండగా మొక్కజొన్న సాగు వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అప్పులు తీర్చాలంటే మొక్కజొన్న సాగే పరిష్కారమంటున్నారు. వచ్చే15,20 రోజుల్లో పత్తి పంటను తొలగించి మొక్కజొన్న విత్తనాలు నాటుతారని వ్యవసాయ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. 

క్వింటాల్‌ కు రూ.7 వేల లోపే 

మార్కెట్‌‌లో మొన్నటిదాకా క్వింటాల్‌‌ కు రూ.8 వేలు పలికింది. ఇప్పుడు కేవలం రూ.6 వేల నుంచి రూ.7 వేల లోపే ధర ఉంది.  సీసీఐలో మేలు రకం పత్తి క్వింటాల్‌‌కు రూ.7,500 వరకు ఉంది.  కానీ సీసీఐ కేంద్రాలను సరిగా తెరవకపోగా రైతులకు అందుబాటులో లేవు. మొన్నటి వరకు ఒకటి, రెండు రోజులు తెరిచి మళ్లీ బంద్‌‌ చేశారు. దీంతో రైతులు స్థానిక వ్యవసాయ మార్కెట్‌‌కు తీసుకెళ్తే  ప్రైవేట్ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారు. ఎకరంలో పండిన పంటకు రూ.40 వేలకు మించి రావడంలేదు. ఏడాది పొడవునా చేసిన రెక్కల కష్టం కూడా దక్కడంలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కూలీలకు కూడా సరిపోవట్లేదు 

ఈ ఏడాది మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశా. రూ.90 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాలతో దిగుబడి తగ్గింది. రెక్కల కష్టం పోను పెట్టిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మూడు, నాలుగు సార్లు పత్తి ఏరితే కూలీల ఖర్చు ఎక్కువగా అవుతుంది. మార్కెట్ లో పత్తికి ధర తక్కువ ఇస్తున్నారు. అమ్మిన డబ్బులు ఏరిన కూలీలకు సరిపోవడం లేదు.

లెంకల రాఘవరెడ్డి, జూబ్లీనగర్ రైతు, భూపాలపల్లి జిల్లా

పెట్టుబడి ఖర్చులు ఎక్కువ.. ధర తక్కువ  

ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గింది. అకాల వర్షాలు, ఎడతెరపిలేని వానలకు పంట ఉత్పత్తి సగానికి సగం తగ్గింది. దీంతో పాటు చీడ పురుగుల నివారణ, గడ్డి మందులకు రైతులు ఎక్కువ పెట్టుబడి ఖర్చులు చేశారు. మరోవైపు పత్తికి ధర పడిపోవడంతో అప్పులు తీర్చలేక రెండో పంటగా మొక్కజొన్న వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

ఎన్‌‌రెడ్డి హంసరెడ్డి, రైతు సంఘం నేత, హనుమకొండ జిల్లా