నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు

  • మిల్లులో పేరుకుపోయిన పాత స్టాక్
  • అకాల వర్షాలతో రైతుల ఆందోళన 

కామారెడ్డి,  వెలుగు : కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై అకాల వర్షం ప్రభావం చూపుతోంది.  జిల్లాలో ఈ యాసంగి సీజన్​లో అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి.  వరి పంట చివరి దశలో ఉన్నప్పుడు అకాల వర్షం కురియగా పంటలు దెబ్బతిన్నాయి.  వడ్లు అమ్ముకునే దశలో వరుసగా కురుస్తున్నా..వాన రైతులను మరింత కుంగదీస్తోంది. సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దవుతున్నాయి.  మరో వైపు కొనుగోలు చేసిన వడ్ల లిఫ్టింగ్​ సమస్య మిల్లుల్లో స్టోరేజీ ఇబ్బందులు కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది.  యాసంగి సీజన్​లో 3.50 లక్షల మెట్రిక్​ టన్నుల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.

 జిల్లాలో వడ్ల కొనుగోలుకు 334 సెంటర్లను ఏర్పాటు చేశారు.  ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుంచి 2.38 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు.  వీటి విలువ రూ. 552 కోట్లుగా ఉండగా..  ఇప్పటివరకు రైతులకు రూ.441 కోట్లు చెల్లించారు.  సకాలంలో అక్కడక్కడ కాంటాలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

స్టోరేజీ ఇబ్బందులు...

కొనుగోలు చేసిన వడ్లను సెంటర్ల నుంచి మిల్లులకు లిఫ్ట్ చేస్తున్నారు.  ఇక్కడ నిల్వ చేయడం ఇబ్బందిగా మారడంతో సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను వెంటనే నింపుకోకపోవడంతో కాంటాలపై ప్రభావం చూపుతోంది.  మిల్లుల్లో  పోయిన యాసంగితో పాటు వానాకాలం సీజన్ వడ్లు నిల్వ ఉన్నాయని మిల్లర్లు పేర్కొంటున్నారు.  సకాలంలో కొనుగోలు చేయడం లేదని నిజాంసాగర్​ మండలంలో  రెండు రోజుల క్రితం రైతులు రోడ్డెక్కారు.  మరో వైపు  సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  

అకాల వర్షానికి వడ్లు తడిసి పోతున్నాయి. దీంతో ఎక్కువ మంది రైతులు టార్పాలిన్లను కిరాయికి తెచ్చుకుంటున్నారు. టార్పాలిన్లు లేక వడ్లు తడిసి పోతున్నాయని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలంటూ.. ఇటీవల కామారెడ్డిలో రైతులు ఆందోళన చేశారు. జిల్లాలో 200 రైస్​ మిల్లులు ఉన్నాయి.  సెంటర్లలో కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు  కేటాయిస్తున్నారు.  యాసంగి సీజన్​లో మాత్రం బాయిల్డ్​ రైస్​మిల్లులు 35 బాయిల్డ్​ రైస్​ మిల్లులకు  మాత్రమే కేటాయించనున్నారు.  జిల్లాలో ఏదో ఒక చోట వర్షం పడడం, వడ్లు తడవడం, వాన నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.