కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెక్నికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయండి : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రగతికి దోహదం చేసేలా టెక్నికల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం కోరారు. పీఎం శ్రీ పథకం కింద కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన 24 ప్రభుత్వ స్కూళ్లు, సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 16 స్కూళ్లకు రూ.40 లక్షల చొప్పున నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.‌‌‌‌‌‌‌‌ 

మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సింహారావు జన్మించిన హనుమకొండ జిల్లా వంగర గ్రామంతోపాటు సిరిసిల్లలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో హనుమకొండ జిల్లా ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకురాగా ఈమేరకు ఆయన వంగరలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రదాన్ ఈమేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.