జమిలికి సై: ఈ పార్లమెంట్ సమవేశాల్లోనే బిల్లు

  • కేంద్ర కేబినెట్ఆమోదం
  • 30కి పైగా పార్టీల మద్దతు.. 15 పార్టీలు వ్యతిరేకం
  • సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌
  • అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు
  • ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టుకునే పనిలో బీజేపీ
  • పార్లమెంట్​కు హాజరుకావాలని ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ

న్యూఢిల్లీ: ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతున్నదని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది.

టైమ్​తో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అవి పూర్తైన వంద రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే.. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కోసం రాజ్యాంగంలోని కనీసం ఆరు ఆర్టికల్స్​ను సవరించాల్సి ఉంటుంది. కానీ, పార్లమెంట్​లో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా, ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లు లోక్​సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14వ తేదీల్లో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. అదేవిధంగా, రాష్ట్రాల వారీగా లోక్​సభ సీట్ల కేటాయింపు, జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ బిల్లుకు కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, దీని కోసం 50 శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు.జమిలి ఎన్నికల ప్రతిపాదనలను 30కిపైగా పార్టీ లు సమర్థించగా.. కాంగ్రెస్‌‌‌‌ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్‌‌‌‌ వాదిస్తున్నది. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. సంప్రదింపుల కోసం జాయింట్‌‌‌‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

సవరించాల్సిన ఆరు ఆర్టికల్స్ ఇవే..

  • దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరు తెన్నులు, మార్గదర్శకాలకు సంబంధించి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి..లోక్‌‌‌‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ. రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేండ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించడం.
  • అత్యయిక పరిస్థితుల సమయంలో సభా కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించాలి.    
  • రాష్ట్రపతికి లోక్‌‌‌‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85 (2) (బి‌‌‌‌)ని కూడా సవరించాల్సి ఉంటది.    
  • రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌‌‌‌కు దాఖలు పర్చే ఆర్టికల్ 174 (2) (బి‌‌‌‌)ని సవరించాలి.    
  • రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణలు కూడా చేయాలి.    
  • ఎన్నికల కమిషన్‌‌‌‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాల్సి ఉంటది.

బిల్లు ఆమోదానికి ఎన్ని ఓట్లు అవసరం? 

ఈ నెల 13, 14వ తేదీల్లో లోక్‌‌‌‌సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో.. రాజ్యాంగ సవరణలతో కూడిన ఈ బిల్లు.. ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే 67 శాతం సానుకూలంగా ఓట్లు పడాలి. ఎన్నికల అంశం.. ఉమ్మడి జాబితాలో ఉండటంతో దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే.. 543 స్థానాలున్న లోక్‌‌‌‌సభలో కనీసం 67 శాతం అంటే.. 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలి.

అటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అంటే... 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది. అయితే, ఈ బిల్లును ఆమోదించుకోవాలంటే ఇతర పార్టీల ఎంపీల మద్దతును కూడా బీజేపీ కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. 

ఇందిర హయాంలోనే చర్చ

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951, 1962, 1967లో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. 1983లో భారత ఎన్నికల సంఘం అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన ముందుంచింది. అయితే, ఇందిరా గాంధీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1999లో లా కమిషన్ సూచించింది. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తుతున్నది. 2014 మేనిఫెస్టోలో కూడా దీని గురించి ప్రస్తావించింది. 2016లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని లేవనెత్తారు. మరుసటి ఏడాది నీతి ఆయోగ్ ఒక నివేదిక సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని 2018లో లా కమిషన్ చెప్పింది. 2019లో మోదీ నేతృత్వంలోని బీజేపీ మళ్లీ గెలిచినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ప్రతిపక్షాలు బహిష్కరించాయి.

కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులేంటి?

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ స్టడీ చేసింది. 18,629 పేజీల నివేదికను మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. జమిలి ఎన్నికలకు కమిటీ.. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత లోక్‌‌‌‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌‌‌‌ నిర్వహించాలని పేర్కొన్నది.

ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌‌‌‌ను సవరించాలని కమిటీ సూచించింది. ఇక, మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని తెలిపింది.

జమిలి ఎన్నికలను ఎంత మంది సమర్థించిన్రు?

కోవింద్ నేతృత్వంలోని కమిటీ.. సుమారు 190 రోజుల పాటు ఈ అంశంపై స్టడీ చేసింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో 32 జమిలికి మద్దతిచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా.. 21,558 అభిప్రాయాలు వచ్చాయి. వీరిలో 81శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదిక రూపొందించింది.

ఎన్ని ఈవీఎంలు అవసరం కావొచ్చు?

ఎన్నికల సంఘం ప్రకారం.. లోక్‌‌‌‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే, కొత్త ఈవీఎంలు కొనేందుకు ప్రతి 15 ఏండ్లకోసారి రూ.10వేల కోట్లు అవసరం అవుతాయి. ఎందుకంటే.. 15 ఏండ్లకోసారి కచ్చితంగా ఈవీఎంలను మార్చాల్సి ఉంటది. ఈవీఎం యంత్రాలతో పాటు వంద శాతం వీవీప్యాట్స్‌‌‌‌ అందుబాటులో ఉంచాలి. ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ సెటప్​ను ఒక ఈవీఎం అంటరు.

గతేడాది ఫిబ్రవరిలో లా మినిస్ట్రీ లెక్క ప్రకారం.. జమిలి ఎన్నికల కోసం 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్​లు అవసరం. కానీ.. ఏడాది కాలంలో ఓటర్ల సంఖ్య పెరగడంతో.. పోలింగ్ కేంద్రాలు కూడా పెంచాల్సి ఉంటది. దీంతో ఈవీఎంల సంఖ్య మరింత పెరుగుతది. 2023 ప్రారంభంలో ఒక బ్యాలెట్ యూనిట్ కాస్ట్ రూ.7,900, కంట్రోల్ యూనిట్ కాస్ట్ రూ.9,800, వీవీ ప్యాట్ ఖరీదు రూ.16,000. అయితే.. 2029 నాటికి ధరలు మరింత పెరుగుతాయి. 

ఎప్పటి నుంచి  అమల్లోకొచ్చే చాన్స్?

ప్రస్తుత లోక్‌‌‌‌‌‌‌‌సభ గడువు 2029 వరకు ఉంది. కానీ.. ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం, తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2026లో ఐదు రాష్ట్రాల్లో, 2027లో గోవా, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌, మణిపూర్‌‌‌‌‌‌‌‌, యూపీ, హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌, గుజరాత్​లో ఎన్నికలు ఉంటాయి.

ఈ స్టేట్స్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌‌‌‌‌‌‌, కర్నాటక, మిజోరాం, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2029లో అరుణాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతాయి. 

జమిలి ఎన్నికలతో ఏం లాభం?

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’.. అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ వంటి అడ్డంకులుండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధుల విడుదల, కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్‌‌‌‌‌‌‌‌ శాతం పెరుగుతుంది. ఒకేసారి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరుచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఏం నష్టం?

ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదనేది మరికొందరి వాదన.

ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యతాంశా లుగా మారుతాయని అంటున్నారు. జమిలి నిర్వహణకు భారీగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు కొనాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల, రక్షణ సిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి. ఎన్నికల సామగ్రిని భద్రపర్చడానికి తగినన్ని గోడౌన్లు లేకపోవడం కూడా సమస్యే.