70 ఏండ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం : కేంద్ర ప్రభుత్వం

  • ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇవ్వాలి 
  • రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ
  • ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 70 ఏండ్లు పైబడిన వారందరినీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద లబ్ధిదారులుగా గుర్తించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా లేఖ రాసింది. లబ్ధిదారుల గుర్తింపునకు 70 ఏండ్ల వయసు ఉన్నారా లేదా అనే అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, ఇంకెలాంటి కండీషన్లు లేవని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.

 ఇతర స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కింద ఉచిత వైద్యం పొందుతున్న వృద్ధులకు కూడా స్కీమ్ అప్లికేబుల్ అవుతుందని పేర్కొంది. ఇప్పటికే ఆయుష్మాన్ పరిధిలో ఉన్న వృద్ధులకు, అదనంగా మరో రూ.5 లక్షల వరకు ఉచిత కవరేజ్ వర్తిస్తుందని పేర్కొంది. 70 ఏండ్లు దాటిన వారందరితో ఆయుష్మాన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేయించాలని, ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 70 ఏండ్లు దాటిన వాళ్లందరికీ ప్రత్యేకమైన ఆయుష్మాన్ కార్డులు అందజేస్తామని తెలిపింది. 

కాగా, తెలంగాణలో ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కలిపి అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ స్కీమ్ కింద సుమారు 26.11 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా, ఆరోగ్యశ్రీ పరిధిలో 77.19 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఆయుష్మాన్ లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.190 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలో సుమారు 5 లక్షల మంది 70 ఏండ్లు దాటిన వాళ్లు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీళ్లందరితో ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా, ఆరోగ్యశ్రీ కింద కొంత భారం తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.