హైదరాబాద్​లో హైడ్రాకు హై రెస్పాన్స్

  • ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన
  • పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్
  • సోషల్​ మీడియాలో  ట్రెండింగ్​
  • ‘కీప్​ గోయింగ్’​ అంటూ నెటిజన్ల పోస్టులు
  • సీఎం రేవంత్​కు అభినందనలు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​లో చెరువులు, కుంటలను ఆక్రమించి.. ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అంతకంతకూ మద్దతు పెరుగుతున్నది. ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. పలువురు ప్రతిపక్ష నేతలూ హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తున్నారు. సోషల్​ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్​లో ఉన్నది. రిప్లై బాక్సులన్నీ  ‘కీప్​ గోయింగ్’ కామెంట్స్​తో నిండిపోతున్నాయి. 

ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రాపైనా, రేవంత్​ సారథ్యంలోని సర్కారుపైనా జనాల్లో నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందని పొలిటికల్​ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తాము  కూల్చివేతలను వ్యతిరేకిస్తే ఎక్కడ జనాదరణ కోల్పోతామేమో అనే భయం అపోజిషన్​ పార్టీల్లో కనిపిస్తున్నది. అందుకే హైడ్రాపై కేటీఆర్​లాంటి నేతలు సైతం ఆచితూచి మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అంతటా పాజిటివ్​ టాక్​..

ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాకు, రేవంత్​ సర్కారుకు పార్టీలకతీతంగా ప్రజలు, ప్రతిపక్ష నేతలు సైతం మద్దతు పలుకుతున్నారు. వారం, పదిరోజుల క్రితమే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలైనా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

Also Read:-డ్రగ్స్ ​వెనుక ఇంటర్నేషనల్​ మాఫియా

పైగా సామాన్యుల ఇండ్లే కూల్చుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఈర్ల చెరువులో రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల విల్లాలు, స్పోర్ట్స్​క్లబ్​ల కూల్చివేతలతో హైడ్రాపై అటెన్షన్​ మొదలైంది. ఆ తర్వాత శనివారం సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్​కన్వెన్షన్​ కూల్చివేత తర్వాత ఒక్కసారి హైడ్రా పేరు మార్మోగింది.  సోషల్​మీడియాలో ఇదే ట్రెండింగ్​అంశమైంది. ఈ క్రమంలో హైడ్రాకు మద్దతుగా జనాల ర్యాలీలు మొదలయ్యాయి. 

ఆదివారం ‘గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో హైడ్రాకు మద్దతుగా గండిపేట చెరువు వద్ద  హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారంటే జనంలో ఎలాంటి స్పందన ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ‘సేవ్ లేక్స్ –సేవ్ లైఫ్’, ‘హైదరాబాద్ మనది– హైడ్రా మనందరిదీ.. ’ అనే నినాదాలు మార్మోగాయి.  మాకూ హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటుచేయాలని వరంగల్​, కరీంనగర్​, నిర్మల్​లాంటి జిల్లాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. 

రాజకీయనేతలు సైతం హైడ్రా విషయంలో ఏమైనా తప్పుగా మాట్లాడితే పొలిటికల్​ డ్యామేజ్​అయ్యే పరిస్థితి ఉందని భయపడుతున్నారు. వాస్తవానికి హైడ్రా ఏర్పాటు, కూల్చివేతల సందర్భంగా అధికార పార్టీలో మంత్రుల నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కానీ ఇందుకు భిన్నంగా హైడ్రాలాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తారించాలని సీఎం రేవంత్​ రెడ్డికి ఎమ్మెల్యేల నుంచి కూడా  విజ్ఞప్తులు అందుతున్నాయి. అన్నీ చట్టానికి లోబడే చేస్తున్నామని, ఎవరినీ వదిలేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు. 

ప్రభుత్వంలో ఉన్నోళ్లవి కూడా ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్లలో నిర్మాణాలు ఉన్నాయని వార్తలు వస్తుండగా.. అలాంటివేమైనా ఉంటే బాజాప్త కూల్చేవేయవచ్చని వాళ్లు ప్రకటిస్తున్నారు. అధికారులను వెంట పెట్టుకుని వచ్చి కూల్చివేసుకోవచ్చునని తన ఇంటి నిర్మాణంపై వచ్చిన  ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సవాల్​ చేశారు. ఇక ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గత పదేండ్లలో ఆక్రమణకు గురైన చెరువులు, వాటిలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లెటర్లు రాశారు. జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థ కూడా రావాలాని ఆయా జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

బీజేపీ ఎంపీలు రైట్.. రైట్..

హైడ్రా కూల్చివేతలను బీజేపీలోని కొందరు పెద్దలీడర్లు సైతం సమర్థిస్తున్నారు.  ఈ విషయంలో ఆ పార్టీ ఎంపీలు  ప్రభుత్వానికి  అండగా నిలిచారు. ఎన్​ కన్వెన్షన్​ కూల్చివేత తర్వాత మెదక్​ఎంపీ రఘునందన్​ రావు హైడ్రాను అభినందించారు. ఇక  అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ధనికులు, సామాన్యులు అనే తేడా లేకుండా సినిమా స్టార్ల అక్రమ కట్టడాలు సైతం కూల్చివేస్తూ హైడ్రా పర్యావరణాన్ని రక్షిస్తున్నదని ఎంపీ ఈటల రాజేందర్,  ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ప్రశంసించారు. బీఆర్ఎస్​ పార్టీలోని ప్రజాప్రతినిధులు కొందరు చెరువులు, కుంటలను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని పోలీసులకు, హైడ్రాకు కంప్లయింట్స్​ అందాయి. 

ఇందులో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్​రెడ్డి, మల్లారెడ్డి ఉన్నారు. వీరు హైడ్రా విషయంలో బహిరంగంగా ఏం మాట్లాడాలో తెలియక కోర్టు తలుపులు తట్టినట్టు తెలుస్తున్నది.  మరోవైపు జన్వాడలో ఉన్న కేటీఆర్​ ఫామ్​హౌస్​నూ కూల్చివేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయమై ఆ పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్లి తలంటించుకున్నారు. ఇక అక్రమనిర్మాణాల కూల్చివేతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. భూముల కబ్జాపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

హైడ్రా ముందుకు సాగాలి

ఎన్​ కన్వెన్షన్​ను గత ప్రభుత్వమే కూల్చే యాల్సి ఉంది.  హైకోర్టు ఆర్డర్స్​ వచ్చినా..  ఎవరితో లాలూచీ పడి ఆపేసిందో. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి తరతమ భేదాలు లేకుండా.. హైడ్రా  ముం దుకు సాగాలి. హైడ్రా వేసింది మంచి ఉద్దే శంతో.. ఏం ఆలోచించొద్దు.  బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కట్టడాలు కూల్చివేయాలి. చెరువుల్లో నిర్మాణాలు కడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.     

- రఘునందన్​ రావు, మెదక్ ఎంపీ (బీజేపీ)

హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం

నేను నిర్వహించిన సర్వేలో హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాతం మంది సమర్థిస్తే కేవలం 22 శాతం మందే తప్పుపట్టారు. హైడ్రా కూల్చివేతల వెనుక సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవు. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం. అందుకే బీజేపీలో ఉన్నా మేం మద్దతిస్తున్నం. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసింది. స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి, వాటి శిథిలాల తొలగింపునకు అయ్యే ఖర్చును వారి నుంచే వసూలు చేయాలి.
 
- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ (బీజేపీ)