విదేశాల్లో జాబ్స్ పేరుతో మోసం


ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసిన సీఐడీ పోలీసులు
కేపీహెచ్‌బీలో అబ్రాడ్‌ స్టడీ ప్లాన్ ఓవర్‌‌సీస్  కన్సల్టెన్సీ పేరుతో దగా

హైదరాబాద్‌, వెలుగు: అబ్రాడ్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్  చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు వివరాలను సీఐడీ చీఫ్  శిఖాగోయల్  వెల్లడించారు. హైదరాబాద్​ కూకట్‌పల్లి, బాచుపల్లికి చెందిన గంట సునీల్‌కుమార్‌‌(28), చీకటి నవ్యశ్రీ(25) కేపీహెచ్‌బీలో అబ్రాడ్‌ స్టడీ ప్లాన్ ఓవర్‌‌సీస్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. కొట్టు సాయిరవి తేజ, కొట్టు సాయి మనోజ్‌, శుభం, వంశీ సహా మరికొంత మందితో కలిసి విజయవాడ, ఢిల్లీలో కన్సల్టెన్సీని ఆపరేట్  చేస్తున్నారు. విదేశాల్లో చదువుతో పాటు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను ట్రాప్‌ చేశారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా మోసం చేశారు. ఇందుకు గాను ఒక్కో వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వసూలు చేసేవారు. ఆ తరువాత అబ్రాడ్‌కి పంపించేవారు. అయితే అక్కడికి వెళ్లిన తరువాత బాధితులు మోసపోయామని గుర్తించేవారు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు ఎదుర్కొని తిరిగి వచ్చేవారు.

కరీంనగర్‌‌ బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు.. 

కరీంనగర్‌‌కు చెందిన సీహెచ్‌ కమలాకర్‌తో పాటు అతని స్నేహితుని వద్ద రూ.8 లక్షలు వీరు వసూలు చేశారు.ఫేక్  డాక్యుమెంట్స్‌తో మల్టాకు పంపించాడు. వీరికి అక్కడ ఎలాంటి జాబ్  లభించలేదు. దీంతో ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ ఏడాది మార్చి 14న కరీంనగర్‌‌ వన్​టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు సీఐడీలోని ఎకానిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ కాగా, సీఐడీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేపీహెచ్‌బీ, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌‌లో కూడా కేసులు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. నిందితులు గంటా సునీల్‌కుమార్‌‌, చీకటి నవ్యశ్రీలను మంగళవారం బాచుపల్లిలో అరెస్ట్ చేశారు.