పత్తి రైతుకు దక్కని మద్దతు

  •     మార్కెట్‌ వేలంలో ఓ రేటు.. మిల్లుకు తీసుకొచ్చాక మరో రేటు
  •     పత్తి క్వింటాల్‌కు రూ. 7,521 మద్దతు ధర నిర్ణయించిన కేంద్రం
  •     రూ. 6,800 మించి ఇవ్వని ప్రైవేట్‌ వ్యాపారులు
  •     మిల్లుకు తీసుకెళ్లాక తేమ, రంగు పేరుతో మరో రూ. 300 కోత
  •     సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో మార్కెట్లకు పత్తి రావడం మొదలైనా ఇంకా సీసీఐ కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో వ్యాపారులు, దళారులు వేలం ద్వారా ఇష్టారీతిన రేటు నిర్ణయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వేలం పూర్తైన పత్తిని మిల్లులకు తీసుకెళ్తే అక్కడ కూడా కొర్రీలు పెడుతూ రేటును మరికొంత తగ్గిస్తున్నారు. కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.

బహిరంగ వేలం ద్వారా రేటు

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం ప్రైవేట్‌ వ్యాపారులకు కలిసొచ్చింది. పత్తి ఏరిన రైతులు అత్యవసరంగా అప్పులు తీర్చాల్సి ఉండడం, ఇతర ఆర్థిక అవసరాల కోసం పత్తిని వెంటనే మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు సిండికేట్‌గా మారి బహిరంగ వేలం ద్వారా పత్తికి రేటు నిర్ణయిస్తున్నారు. పత్తికి కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ఉంటే.. మార్కెట్‌లో వ్యాపారులు మాత్రం రూ.6,800 మించి ఇవ్వడం లేదు. ఒకటి, రెండు బస్తాలకు ఈ రేటు వేసి మిగతా పత్తి మొత్తాన్ని రూ.6 వేలు, రూ.6,400కే కొనుగోలు చేస్తున్నారు.

మిల్లుల్లో మరో సారి కోత

బహిరంగ వేలం ద్వారా పత్తిని దక్కించుకుంటున్న వ్యాపారులు.. మిల్లుల్లో మరోసారి కోత పెడుతున్నారు. పత్తి నల్లగా మారిందని, తేమ శాతం ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతూ క్వింటాల్‌ ధరలో మరో రూ. 200 నుంచి రూ. 300 వరకు కోత విధిస్తున్నారు. అప్పటికే అనేక కష్టాలు పడి పత్తిని మిల్లులకు తీసుకొచ్చిన రైతులు తిరిగి తీసుకెళ్లలేక, తమ ఆర్థిక అవసరాల రీత్యా వ్యాపారులు పెట్టిన కోతలకు అంగీకరిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాల్‌ పత్తికి రూ. వెయ్యికి పైగా నష్టపోతున్నారు.

ఇప్పటికే అవసరమైన టైంలో వానలు పడకపోవడం, అకాల వర్షాల కారణంగా దిగుబడి తగ్గడంతో నష్టపోయిన రైతులను ధరలు మరింత కుంగదీస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్కెట్లలోనూ ఇదే తంతు కొనసాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సాగు తగ్గినా పెరగని ధర

రాష్ట్రంలో గతంతో పోలిస్తే ఈ వానాకాలంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం సుమారు 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగాల్సి ఉండగా, ఈ సారి 43.76 లక్షల ఎకరాల్లోనే సాగైంది. సాగుతో పాటు పంట దిగుబడి సైతం తగ్గడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని రైతులు భావించారు. కానీ ధర పెరగకపోగా.. కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆఫీసర్లు స్పందించి సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని, లేకపోతే వ్యాపారుల చేతుల్లో మరింత దోపిడీకి గురవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గిట్టుబాటు ధర వస్తలే...

పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. జమ్మికుంటలో ఇంకా సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదు. దీంతో జమ్మికుంట మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తికి వేలం ద్వారా రేటు నిర్ణయిస్తున్నారు. క్వింటాల్‌ పత్తికి రూ.6,800లకు మించి ఇవ్వడం లేదు. వేలం అయిపోయాక మిల్లులకు తీసుకెళ్తే అక్కడ మళ్లీ రేటు తగ్గిస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించి క్వింటాల్‌ పత్తికి రూ.7,521 చొప్పున చెల్లించాలి.

- శ్రీనివాస్‌రెడ్డి, పోతిరెడ్డిపల్లి, వీణవంక