ట్రాన్స్ కో పొలం బాట.. వ్యవసాయ లైన్ల ఇబ్బందులపై ఫోకస్

కామారెడ్డి, వెలుగు : వ్యవసాయానికి మెరుగైన కరెంట్ సప్లయ్ చేయాలని తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ర్టిబ్యూషన్ కంపెనీ(టీజీ ఎన్డీపీసీఎల్) పరిధిలో విద్యుత్తు శాఖ - రైతు పొలం బాట ప్రోగ్రాం చేపట్టింది.   క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కరెంట్ ఆఫీసర్లు గ్రామాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ లైన్లకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయనున్నారు.

కరెంట్  సప్లయ్ విషయంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉండటంతో వీటిని సరి చేయాలని  రైతులు పలుమార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సప్లయ్​ లో అంతరాయం తలెత్తడం, ట్రాన్స్‌ ఫార్మర్లు కాలిపోవటంతో పాటు కొన్ని సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఈ లోపాలను సరిదిద్దేందుకు ట్రాన్స్‌‌ కో పొలం బాట పట్టింది. కామారెడ్డి జిల్లాలో విద్యుత్తు శాఖ- రైతు పొలం బాట ప్రోగ్రాం 3 రోజుల క్రితం ప్రారంభమైంది.  జిల్లాలో పంటల సాగు ఎక్కువ భాగం బోర్ల కిందనే ఉంది. లక్షా 10 వేల అగ్రికల్చర్ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి.

అన్ని విభాగాలకు కలిపి 35 వేల ట్రాన్స్‌‌ఫార్మర్లు  ఉండగా.. 3 డివిజన్లలో31 సెక్షన్లు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులతో కరెంట్ సప్లై లో అంతరాయం కలుగుతోంది. లూజ్ లైన్లు, వైర్లు కిందకు వేలాడి ప్రజలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 

సమస్యలు పరిష్కరించేలా..

వ్యవసాయ లైన్లు లూజు ఉండటం, కిందకు వేలాడటం, పోల్స్ వంగిపోవటం, ట్రాన్స్‌ ఫార్మర్ వద్ద ఏర్తింగ్ సమస్య,. ఫ్యూజులు సరిగ్గా లేకపోవటం, లో వోల్టేజ్ లాంటి సమస్యలు ప్రధానమైనవి.  ఈ సమస్యలను సరిదిద్ది అగ్రికల్చర్ కు నాణ్యమైన కరెంట్ సప్లై చేయడంపై నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ దృష్టి పెట్టింది.  సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎండీ వరుణ్ రెడ్డి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశించారు.  

ప్రతి సోమవారం ఏఈ స్థాయి అధికారి నుంచి ఎస్ఈ స్థాయి అధికారి వరకు తమ ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో ఉండే సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎక్కువగా లైన్ సప్లై లో సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంట్ సప్లై చేయటంపై ఫోకస్ చేయాలని సీఎండీ ఆదేశించారు.  ట్రాన్స్‌‌ పార్మర్ల వద్దకు వెళ్లి స్థానిక రైతులతో మాట్లాడి అక్కడికి సమస్యలను తెలుసుకుంటున్నారు. లూజు లైన్లు , పడిపోయిన లైన్లు ఉంటే సరిచేస్తున్నారు.

ట్రాన్స్‌‌ ఫార్మర్  వద్ద లోపాలను బాగు చేస్తున్నారు. చిన్నపాటి సమస్యలను వెంటనే పరిష్కరించి, పెద్ద సమస్యలు ఉంటే వాటిని వివరాలు తీసుకుని వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని కామారెడ్డి బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్‌‌లో  క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నాలుగు రోజుల్లో 37 చిన్నపాటి సమస్యలను సరిదిద్దారు. వంగిన పోల్స్ ను మార్చడం, లూజు లైన్లు పైకి చేయడం చేశారు. కెపాసిటీ మీటర్లు బిగించుకోవడం ద్వారా లో వోల్టేజ్ సమస్య ఉండదని రైతులకు అధికారులు తెలుపుతున్నారు. 8 నెలల కాలంలో జిల్లాలో కొత్తగా 3,560 అగ్రికల్చర్ కనెక్షన్లు 
ఇచ్చారు. 

వ్యవసాయానికి మెరుగైన కరెంట్​ సప్లై..

వ్యవసాయానికి మెరుగైన కరెంట్ సప్లై చేసే లక్ష్యంతో విద్యుత్తు శాఖ - రైతు పొలం బాట ప్రోగ్రాం చేపట్టింది.  కింది స్థాయి లో పనిచేసే సిబ్బందితో పాటు జిల్లా స్థాయి అధికారులు ఫీల్డ్ కు వెళ్లి లైన్లలో ఉండే సమస్యలు తెలుసుకుంటున్నాం. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నాం.  లో వో ల్టేజ్ సమస్య లేకుండా చూస్తున్నాం. వ్యవసాయ కనెక్షన్ల వివరాలు ఆన్‌లైన్ చేశాం. అప్లికేషన్ ఏ దశలో ఉందనేది తెలుస్తుంది. ‌‌‌‌ - 

రమేశ్ బాబు, ఎస్‌‌ఈ, ఎన్‌‌పీడీసీఎల్ కామారెడ్డి జిల్లా