స్పీడందుకున్న ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్​

  • అప్లికేషన్ల​ పరిశీలనకు కమిటీ 

నాగర్​కర్నూల్/వనపర్తి​.వెలుగు: అనుమతులు లేని వెంచర్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ(ఎల్ఆర్ఎస్​) స్పీడందుకుంది. నాలుగేండ్ల కింద పర్మిషన్లు లేని లేఔట్లకు షరతులకు లోబడి అనుమతి ఇస్తామని ఒక్కో అప్లికేషన్​కు రూ.1000 వరకు కట్టించుకున్న బీఆర్ఎస్​ సర్కార్..​ 2023  జులైలో మరో జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం ఎల్ఆర్ఎస్​కు పరిష్కారం చూపిస్తామని ప్రకటించింది.

 2020 అక్టోబర్​కు ముందు దరఖాస్తు చేసిన ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను మాత్రమే పరిశీలిస్తామని తాజాగా  ప్రకటించింది. వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 47,846 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల పరిధిలోని వెంచర్లు కలుపుకుంటే వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్​కు ప్రభుత్వం గ్రీన్  సిగ్నల్​ ఇవ్వడంతో నాగర్​కర్నూల్​ జిల్లాలోని మున్సిపల్, గ్రామపంచాయతీల పరిధిలోని 67,603 అప్లికేషన్ల పరిశీలనపై అధికారులు దృష్టి పెట్టారు.

భారీగా దరఖాస్తులు..

నియోజకవర్గాలు, జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్లు మొదలుకొని పల్లెటూర్లలోని వ్యవసాయ భూముల్లో సైతం వెంచర్లు వెలిసాయి. భూమిని చదును చేసి ప్లాట్లుగా మార్చి, ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముకున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే రైతులు మొదలుకుని కులవృత్తుల మీద ఆధారపడిన వారు, చిరు ఉద్యోగులు, వ్యాపారులు, మధ్య తరగతి వారు ఎక్కువగా ప్లాట్లు కొన్నారు. పట్టాదారుల పేరు మీద వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముకున్న రియల్టర్లు పక్కకు జరిగారు.

 నాగర్​కర్నూల్​ జిల్లాలోని కల్వకుర్తి, వెల్డండ, వంగూరు, నాగర్​ కర్నూల్, బిజినేపల్లి, తాడూరు,పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, తెల్కపల్లి, అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల మండల కేంద్రాలలో మెయిన్​ రోడ్ల సమీపంలోని గ్రామ పంచాయతీల్లో వెంచర్ల దందా అడ్డు అదుపు లేకుండా సాగింది. పర్మిషన్లు లేకుండా ప్లాట్లు చేసి అమ్ముకోగా, మాజీ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు వారికి సహకరించారు. 

మున్సిపాలిటీల పరిధిలోనూ ఇలాగే దందా కొనసాగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు,462 గ్రామపంచాయతీల్లో అనుమతులు లేని 67.603 వెంచర్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 43,994 వెంచర్లు, గ్రామ పంచాయతీల పరిధిలో 23,609 వెంచర్లు ఉన్నాయి. చాలాచోట్ల మైనర్​ ఇరిగేషన్​ కుంటలు, శిఖం భూములు, గైరాన్​ భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లు అమ్ముకుని ఉడాయించారు. వెంచర్లలో రోడ్లు,10 శాతం సామాజిక అవసరాలకు భూములు ఇవ్వకుండానే వాటిని ప్లాట్లు చేసి అమ్ముకున్నట్లు ప్రచారం జరుగుతోంది.   

ALSO READ : గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలి

పరిశీలనకు త్రీ టైర్​ సిస్టం..

జిల్లాలోని అక్రమ వెంచర్లు, అనుమతులు లేని లేఔట్ల క్రమబద్దీకరణ కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించడానికి మూడు అంచెల్లో పరిశీలించి ఫిల్టర్​ చేస్తారు. గ్రామాల సర్వే నెంబర్ల ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి  క్లస్టర్​కు ప్రత్యేకంగా నంబర్​ అలాట్​ చేస్తారు. వెంచర్లు, ప్లాట్లు నిషేధిత భూముల జాబితాలో ఉంటే అప్లికేషన్లను రిజెక్ట్  చేస్తారు. లే ఔట్లను పరిశీలించేందుకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్​ శాఖల సిబ్బంది వెళ్తారు. సదరు వెంచర్లకు నాలా పర్మిషన్, ఇనాం, అసైన్డ్, గైరాన్​, శిఖం, వక్ఫ్, ఎండోమెంట్. 

నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయా అనేది పరిశీలిస్తారు. లే ఔట్​ మాస్టర్​ ప్లాన్​ నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? పరిశీలించిన తర్వాత అన్నీ సక్రమంగా ఉంటే క్రమబద్దీకరణకు చెల్లించాల్సిన ఫీజు వివరాలు అందజేస్తారు. నిబంధనలకు లోబడి ఉన్న లే ఔట్​ వెంచర్లకు సంబంధించిన అప్లికేషన్లను మున్సిపల్​ కమిషనర్లు, అడిషనల్​ కలెక్టర్​ ఫైనల్​ చేస్తారు. ఇదిలాఉంటే సరైన డాక్యుమెంట్లు, వివరాలు ఇవ్వని వారు మరోసారి సవరించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.