వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య

నిజామాబాద్‌‌ రూరల్‌‌, వెలుగు : కుటుంబ కలహాలు, వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్‌‌ మండలం కులాస్‌‌పూర్‌‌లో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సాయిరెడ్డికి (54) ముప్పై ఏళ్ల క్రితం రాధతో వివాహం అయింది. వీరికి ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. పెద్ద కూతురు శృతి భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ విషయంలో కుటుంబంలో తరచూ గొడలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాయిరెడ్డి రాధతో పాటు, కూతురు శృతిని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. వేధింపులు తట్టుకోలేక గురువారం రాత్రి రాత్రి సాయిరెడ్డి గొంతు నులిమి హత్య చేసింది. మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.