కట్నం కోసం భర్త వేధింపులు..యువతి ఆత్మహత్య

  • కట్నం కోసం భర్త వేధించడమే కారణమంటూ సెల్ఫీ వీడియో

జ్యోతినగర్, వెలుగు : వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీకి చెందిన దేవరకొండ  దీప్తి (28), అన్నపూర్ణ కాలనీకి చెందిన నరేందర్ 2001లో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి రెండేండ్ల బాబు ఉన్నారు. కట్నం తీసుకురావాలని నరేందర్‌‌‌‌‌‌‌‌ దీప్తిని తరచూ వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి శనివారం రాత్రి ‘అమ్మా నాన్న.. నా కొడుకు జాగ్రత్త, అతడిని మీరే పెంచండి, నా చావుకు నా భర్తే కారణం’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. 

అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గోదావరిఖనిలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో దీప్తి ఆత్మహత్యకు కారణమైన వారిని తమకు అప్పగించాలని, వారికి కఠిన శిక్ష విధించాలని యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీప్తి తండ్రి దివాకర్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌‌‌‌‌‌‌‌కిరణ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.