వారంలో మారనున్న అమీర్​పేట జంక్షన్ లుక్

  • ట్రాఫిక్​ సమస్యకు చెక్​ పెట్టేందుకు ఉమ్టా ప్లాన్
  • ఇప్పటికే మెట్రో స్టేషన్​కిందికి బస్టాప్​మార్పు ​
  • బేగంపేట రూట్​లో కొత్తగా ఐలాండ్, ట్రాఫిక్​సిగ్నల్స్ 
  • వారంలో రోజుల్లో ఫుట్ పాత్ లపై వ్యాపారాలు తొలగింపు 
  • సత్యం థియేటర్, ఇతర ప్రాంతాలకు మార్చాలని నిర్ణయం

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: సిటీలో ట్రాఫిక్​సమస్యకు చెక్ పెట్టేందుకు యునిఫైడ్​ మెట్రో పాలిటన్​ ట్రాన్స్​పోర్ట్​ అథారిటీ(ఉమ్టా) చర్యలు తీసుకుంటోంది. ప్రజా రవాణాను పెంచి, పాదచారుల రాకపోకలను ఈజీ చేసేందుకు రోడ్లపై మార్పులు చేస్తోంది. రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్ల విస్తరణకు ప్లాన్లు రెడీ చేసింది. ట్రాఫిక్​, ఆర్టీసీ, మెట్రో విభాగాల మధ్య సమన్వయంతో జంక్షన్లు, ఫుట్​పాత్​లు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులు ఒక ట్రాన్స్​పోర్ట్​ మోడ్​ నుంచి మరో ట్రాన్స్​పోర్ట్​ మోడ్​లోకి తేలిగ్గా మారి తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకోవడానికి వీలుగా ప్లాన్స్​చేస్తోంది.  

ముందుగా అమీర్​పేటలో.. 

అమీర్​పేట జంక్షన్​లోని మైత్రీవనం ట్రాఫిక్​సిగ్నల్స్​వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. పేరు మోసిన షాపింగ్​మాల్స్, ఇతర వ్యాపార సముదాయాలు, సాఫ్ట్​వేర్​కోచింగ్​సెంటర్లు, విద్యా సంస్థలు, హాస్టల్స్​అన్నీ ఈ జంక్షన్​చుట్టుపక్కలే ఉన్నాయి. అలాగే ఇక్కడి మెట్రో స్టేషన్ ఇంటర్​ ఛేంజ్​ స్టేషన్. ఎల్బీనగర్​నుంచి రాయదుర్గం, మియాపూర్​నుంచి రాయదుర్గం వెళ్లేవారు ఇక్కడ రైలు మారాల్సి ఉంటుంది. వీటితోపాటు కూకట్​పల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బేగంపేట వైపు వెళ్లే వాహనాలతో అమీర్​పేట జంక్షన్​ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

అమీర్​పేట జంక్షన్​లో మెట్రో దిగిన ప్రయాణికులు కిందికి దిగి వేరే ప్రాంతాలకు వెళ్లడానికి బస్టాప్​కోసం వెతకాల్సి వస్తోంది. మొన్నటి దాకా పటాన్​చెరు, కూకట్​పల్లి వైపు నుంచి వచ్చే బస్సులు స్వర్ణజయంతి కాంప్లెక్స్​ వద్ద ఆపారు. ఇక్కడ బస్​ దిగిన వారు మెట్రో ఎక్కడానికి కొంత దూరం నడవాల్సి వచ్చేది. తాజాగా ఉమ్టా అధికారులు స్వర్ణజయంతి కాంప్లెక్స్​ వద్ద ఉన్న బస్టాపును మెట్రోస్టేషన్ కిందికి మార్చారు. బస్సు దిగి మెట్రో ఎక్కాలనుకునే వారికి వీలుగా ఏర్పాటు చేశారు.

ఇక నుంచి ట్రాఫిక్​సిగ్నల్స్​వద్ద బస్సుల రద్దీ ఉండదు. అలాగే అమీర్​పేట మెట్రో స్టేషన్​నుంచి పంజాగుట్ట మెట్రో స్టేషన్​దగ్గర్లోని స్మార్ట్​బజార్​వరకు ఫుట్​పాత్​లపై స్ట్రీట్​షాపింగ్​నడుస్తుండడంతో పాదచారులకు ఇబ్బందిగా ఉంటోంది. అంతా రోడ్లపైనే నడుస్తుండడంతో ట్రాఫిక్​సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫుట్​పాత్​ఆక్రమణలను తొలగించడానికి ఉమ్టా ప్లాన్​చేసింది. 

స్ట్రీట్​షాపింగ్​సత్యం థియేటర్​వైపు..

సత్యం థియేటర్​నుంచి అమీర్​పేట మెట్రో స్టేషన్​మీదుగా పంజాగుట్ట వెళ్లే వాహనాలు, సారథి స్టూడియో నుంచి అమీర్​పేట మెట్రో స్టేషన్​మీదుగా పంజాగుట్ట వెళ్లే వాహనాలు, కూకట్​పల్లి నుంచి అమీర్​పేట వైపు వచ్చే వాహనాలను నియంత్రించేందుకు బేగంపేట రూట్​లోని టర్నింగ్​వద్ద ఐలాండ్​ ఏర్పాటుతోపాటు సిగ్నలింగ్​ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉమ్టా ప్రతిపాదించింది. అలాగే ఇక్కడి ఫుట్​పాత్​లపై ఉన్న వ్యాపారులను సత్యం థియేటర్​పైపు మార్చనున్నారు.

అలాగే మిగతా అన్నివైపులా ఉన్న ఫుట్​పాత్​ వ్యాపారులను తరలించాలని ప్లాన్​చేస్తున్నారు. కాలుష్యరహిత, పర్యావరణ హిత రవాణా సదుపాయాలను పెంచడానికి ఎలక్ట్రిక్​ వాహనాలు, సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని చూస్తున్నారు. అమీర్​పేటతో పాటు ప్రధానమైన మెట్రో స్టేషన్లను ఎంపిక చేసి వాటి చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఫుట్​పాత్​లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటిపై కొన్నిచోట్ల సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేస్తారు.

ఢిల్లీ లాంటి నగరంలో ఎంపిక చేసిన మెట్రోస్టేషన్లలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్​లో కూడా కూడళ్లు, జంక్షన్ల అభివృద్ధి చేయడం వల్ల నాన్​ మోటరైజ్డ్​ వాహనాల వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇక్కడి ఫుత్​పాత్​లను కూడా విస్తరించడం వల్ల ట్రాఫిక్​ సమస్యలను నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. మీటర్​పేట జంక్షన్​ ఇంప్రూవ్​ మెంట్​ సక్సెస్​ అయితే మరిన్ని కీలక జంక్షన్​లను కూడా అభివృద్ధి చేసేందుకు ఉమ్టా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.