ఉక్రెయిన్​పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడి

న్యూఢిల్లీ/మాస్కో: యుద్ధ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రష్యా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. తమ దేశంలోని నిప్రో నగరంపై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్​(ఐసీబీఎం) తో బుధవారం దాడి చేసిందని వెల్లడించింది. తమ దేశంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడి జరిపిందని మండిపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాకు విడుదల చేసింది. నిప్రో నగరంలో భారీ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి. 

రష్యన్ సిటీ అస్త్రఖాన్ ​నుంచి ఈ ఐసీబీఎంను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అస్త్రఖాన్ నుంచి నిప్రోకు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపింది. అయితే, ఈ ఆరోపణలపై రష్యా స్పందించలేదు. ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతకుముందు, రష్యాపైకి తమ లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించుకోవచ్చంటూ ఉక్రెయిన్ కు అమెరికా అనుమతిచ్చింది. దీనిపై రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. అమెరికా అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను తమ దేశంపైకి ప్రయోగిస్తే అణుదాడికీ వెరవబోమని ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. దీనికి అనుగుణంగా అణ్వాయుధ పాలసీ కి సవరణలు చేశారు. అయినప్పటికీ ఉక్రెయిన్ ఆరు దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించిందని సైనిక అధికారులు తెలిపారు. దీంతో ఆ మరుసటి రోజే పుతిన్ ఉక్రెయిన్ సిటీ నిప్రోపై ఐసీబీఎం ప్రయోగించినట్లు సమాచారం.

26 రూబెజ్​ మిసైల్​..

రష్యా ప్రయోగించిన ఐసీబీఎం పేరు 26 రూబెజ్​  అని తెలుస్తోంది. ఈ మిసైల్​లో మల్టిపుల్  ఇండిపెండెంట్లి టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ (ఎంఐఆర్ వీ) టెక్నాలజీని ఉపయోగించింది. ఒకే మిసైల్​లో ఒకటికంటే ఎక్కువ వార్ హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యమే ఎంఐఆర్​వీ.. దీంతో నిప్రోలో ని కీలక మౌలిక వసతులపై దాడి చేసింది. ఐసీబీఎంలు 5,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవు. అణు, రసాయన, జీవ  ఆయుధాలను ఇవి మోసుకెళ్లగలవు.

ఏంటీ ఐసీబీఎం, ఎంఐఆర్​వీ?

ఖండాంతర క్షిపణులను 1960లలో అభివృద్ధి చేశారు. అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్ పోటాపోటీగా వీటిని డెవలప్ చేసుకున్నాయి. 1970లో అమెరికా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఐసీబీఎంలను తయారుచేసింది. సోవియట్  యూనియన్  కూడా 1970 చివరి నాటికి ఎంఐఆర్​వీ టెక్నాలజీతో ఐసీబీఎం, ఎస్ఎల్​బీఎంను అభివృద్ధి చేసింది. దీంతో ఇరుదేశాల  మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇంటర్ మీడియట్  రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ జరిగింది. 

ఎంఐఆర్​వీ టెక్నాలజీతో రూపొందించడం వల్ల ఈ మిసైల్స్ తొలుత ఆకాశంలోకి దాదాపు 4 వేల కి.మీ.పైకి వెళ్లి తిరిగి భూమిపై టార్గెట్ దిశగా వేగంగా దూసుకెళ్తాయి. భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించాక మిసైల్​ వేగం గరిష్ఠానికి చేరుతుంది. దీని వల్ల ఐసీబీఎంలను గుర్తించడం, ఎదుర్కోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. రూబెజ్ ఐసీబీఎంను రష్యా 2011లో తయారుచేసింది. 2012లో జరిపిన పరీక్షలో 5,800 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది.