మోదీ వాగ్దానాలు, వైఫల్యాలు : ఉజ్జిని రత్నాకర్ రావు

 గత పది సంవత్సరాలుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన పాలనా విధానాలను పరిశీలించినట్లయితే.. వారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు, వాటి అమలుకు పొంతనలేదు. వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ' ఏక్ భారత్,  శ్రేష్ఠ భారత్ ' అనే నినాదంతో 'సబ్ కా సాత్  సబ్ కా వికాస్' అని ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఆకర్షించింది. రాజకీయాల్లో 'అచ్చేదిన్ ఆనే వాలే హై ' అనేది బీజేపీ నినాదం. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అందరికీ సత్వర న్యాయం చేస్తామని, 100 స్మార్ట్ సిటీలు రూపొందిస్తామని, నిత్యావసరాల ధరలను నియంత్రిస్తామని, రైతులకు 2022 నాటికి రెట్టింపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అసమానతలు, పేదరికం నిర్మూలిస్తామని హామీల వర్షం కురిపించింది. 

శక్తిమంతమైన భాగస్వామ్య ప్రజాస్వామ్యం,  జీవన నాణ్యత, సమ్మిళిత  సుస్థిర అభివృద్ధి, బహిరంగ పారదర్శక ప్రభుత్వం,  ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఆర్థిక వ్యవస్థ,  ప్రజానుకూల పాలనను వాగ్దానం చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేసింది. కార్పొరేట్ పెట్టుబడిదారుల సహకారంతో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 31 శాతం ఓట్లతో 282 స్థానాలు బీజేపీ,  ఎన్డీఏ కూటమికి 336 ఎంపీల పూర్తి మెజార్టీతో  మోదీ ప్రధానిగా 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు.

 కార్పొరేట్ అనుకూల విధానాలు

మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్పొరేట్ అనుకూల చర్యలు చేపట్టారు. ఒకవైపు పెట్టుబడులపై ఉన్న కఠిన నిబంధనలను సరళీకరించారు. మరోవైపు మితవాద,  నిరంకుశ -మతతత్వ పాలనను ముందుకు తెచ్చారు. మరోవైపు అనేక స్కామ్​లతో  బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాల తీరు అవినీతిమయమైంది. ఏది ఏమైనా అదానీ, అంబానీలకు మంచి రోజులు రాగా  శ్రామికవర్గ ప్రజలకు కష్టకాలమే వచ్చిందనేది వాస్తవం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిశీలించినట్లయితే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ అమలు కాకపోగా, ఐదు లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉంచుతామన్న హామీ ఆటకెక్కింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో  బీజేపీ సొంతంగా  37.7 శాతం ఓట్లతో 303 సీట్లు,  ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి 353  ఎంపీ స్థానాల్లో  గెలుపొందింది. 

సమాఖ్య స్ఫూర్తి కరువైంది

మోదీ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూనే మరువైపు హిందూ రాష్ట్ర ఎజెండాలోని అంశాలను అమలు చేయడానికి ప్రయత్నం మొదలు పెట్టింది. మోదీ ప్రభుత్వం అమలు చేసిన రాజకీయ విధానాలతో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హామీల ఉల్లంఘన, ఫెడరల్ స్వభావాన్ని విస్మరించటం జరిగింది.  గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బీజేపీయేతర రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. న్యాయంగా రాష్ట్రాలకు రావలసిన గ్రాంట్లు విడుదల చేయకుండా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అస్తవ్యస్తం చేస్తున్నదనే విమర్శలు చూస్తున్నాం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.  ఢిల్లీలో లెఫ్టినెంట్​ గవర్నర్​ను కీలుబొమ్మగా ఉపయోగించి అక్కడ రాష్ట్ర పాలన వ్యవహారాలలో జోక్యం  చేసుకుంటూ, కర్ర పెత్తనం చేస్తోంది. ఇటీవల కేరళ, కర్నాటక, తమిళనాడు,  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్ల ద్వారా  అమలు చేయకుండా పెండింగులో పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లిన  పరిస్థితులు కల్పించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో అమలు చేసుకోవలసిన దుస్థితి కల్పించింది. 

అభివృద్ధి సూచికలో వెనుకబాటు

భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసకు తీసుకుపోతున్నామని చెప్తున్నా.. ఇటీవల అమెరికా ప్రభుత్వ సాయంతో పనిచేసే ' ఫ్రీడం హౌస్' ప్రకటించిన సర్వేలో భారతదేశంపై ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. అవినీతి సూచిలో 2014లో 70 స్థానంలో నిలిచిన భారత్, 2021లో  85వ స్థానం పొందింది. మానవ స్వేచ్ఛ సూచిలో 2015లో 75వ స్థానంలో ఉండగా 2022 నాటికి 111వ స్థానానికి పడిపోయింది. ఆహార భద్రతా సూచిలో  71వ స్థానంలో ఉంది. సంతోష సూచిలో భారత్ 136వ స్థానంలో ఉంది. మేధోసంపత్తి సూచిలో 55 దేశాలలో భారత్ 43వ స్థానంలో ఉంది.  జెండర్ గ్యాప్ సూచిలో భారత్ 135 వ స్థానంలో ఉంది.  పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్ 150వ స్థానంలో ఉంది.  

రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు 

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని,  రైతు పంటలకు ఎంఎస్పీ విధానాన్ని, డా. స్వామినాథన్ ప్రతిపాదనలను  అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం..  కార్పొరేట్లకు అనుకూల చట్టాలను తీసుకొచ్చింది. వ్యవసాయ చట్టాలను రద్దుచేసి పంటలకు ఎంఎస్పీ విధానాన్ని అమలు చేయాలని ఉద్యమిస్తున్న రైతు సంఘాలపై  ఉక్కుపాదం మోపింది. రైతు సంఘాల ఉద్యమాలను అణచివేస్తూ లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ  వేలాది మంది  రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 

15 కోట్ల మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి పొందుతున్న  ఉపాధి హామీ పథకానికి 2019లో  రూ.85 వేల కోట్ల నుంచి  క్రమంగా 2024 వచ్చేసరికి రూ.60 వేలకు నిధులను తగ్గిస్తూ వారి జాబు కార్డులను తొలగిస్తున్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు 2013లో తీసుకువచ్చిన 'జాతీయ ఆహార భద్రతా చట్టం ' దాని ద్వారా పేదలందరికీ నిత్యావసరాలైన బియ్యం, గోధుమలు, జొన్న, సజ్జ,రాగులు తదితర సరఫరా చేయాల్సి ఉండగా నిత్యావసరాలపై సబ్సిడీలు కోత విధించింది. దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 47.5 కోట్ల శ్రామిక వర్గం, కార్మికులు పోరాడి సాధించుకున్న  కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు మాత్రం ఈ పది సంవత్సరాల కాలంలో రూ.14 లక్షల కోట్లను పైగా రాయితీలను ప్రకటించారు.

ప్రజావ్యతిరేక పాలన

ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక సమస్యలను వదిలిపెట్టి ఇతర అంశాల చుట్టూ తన రాజకీయ, ఆర్థిక విధానాలను మోదీ సర్కారు అవలంబిస్తోంది.  రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేసింది. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేసి, దాన్ని విభజించి జమ్మూ కాశ్మీర్, లడక్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. కాశ్మీర్ ప్రజలకు భారతదేశం రాజ్యాంగపరంగా కల్పించిన స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసింది.  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ),  జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్ ) తీసుకొచ్చి  సంకుచిత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

- ఉజ్జిని రత్నాకర్ రావు,సీపీఐ సీనియర్​ నేత