డీమ్డ్ పేరిట యూజీసీ ఇష్టారాజ్యం..కాలేజీలకు వర్సిటీలుగా పర్మిషన్లు

  • రాష్ట్రాలకు కూడాసమాచారం ఇవ్వడం లేదు
  • ఫీజుల నిర్ణయం, సీట్లపై ఆ వర్సిటీలదే అధికారం
  • రాష్ట్రాల ఎన్ఓసీ నిబంధనలు మార్చేసిన యూజీసీ 
  • రాష్ట్రంలో ఇప్పటికే పది డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్​లు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అనుమతులతో సంబంధం లేకుండానే డీమ్డ్ వర్సిటీలకు యూజీసీ అనుమతులు ఇచ్చేస్తున్నది. ఇది ప్రస్తుతమున్న ప్రైవేటు కాలేజీలు, సర్కారు కాలేజీలపై ప్రభావం చూపుతున్నది. భవిష్యత్​లో ఆయా డీమ్డ్ వర్సిటీల్లో ఏమైనా ఘటనలు జరిగితే ఎవరిది బాధ్యత అంటూ సర్కారు పెద్దలతో పాటు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.తెలంగాణలో ప్రస్తుతం ఆరు డీమ్డ్ వర్సిటీలున్నాయి. వీటిలో ఐఐఐటీహెచ్, నిమ్స్ ప్రభుత్వానివి కాగా, మిగిలిన అరోరా, మల్లారెడ్డి, చైతన్య, ఇక్ఫాయ్ ప్రైవేటువి. వీటితో పాటు గీతం, కేఎల్ వర్సిటీ, విజ్ఞాన్, సింబయాసిస్, టాటా(రెండు), బిర్లా, చైతన్యతో పాటు మల్లారెడ్డికి ఆఫ్ క్యాంపస్​లున్నాయి. అయితే, గతంలో రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీలకు అనుమతులు ఇస్తే.. యూజీసీ రాష్ట్రాల నుంచి ఎన్​ఓసీ అడిగేది. కానీ, గతేడాది ఇచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్ లో ఈ నిబంధనను ఎత్తేసింది. దీంతో, రాష్ట్రాలకు డీమ్డ్ వర్సిటీల ఏర్పాటుతో సంబంధం లేకుండా పోయింది. ఆయా వర్సిటీల్లో ఫీజులు, రిజర్వేషన్లు, సీట్లు ఇలా.. అనేక అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. 

ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు అవకాశం ఇచ్చినట్టు అయింది. అయితే, తాజాగా మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి, ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీకి డీమ్డ్ హోదా ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పలు డీమ్డ్ వర్సిటీలు.. ఆఫ్ క్యాంపస్​లనూ ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాటిల్లో ఇష్టానుసారంగా సీట్లు పెంచుకుంటుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డీమ్డ్ వర్సిటీలు ఏర్పాటు చేసుకునే అవకాశం రావడంతో.. సుమారు పది పెద్ద ఇంజినీరింగ్ కాలేజీలూ అటువైపు పోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే, రాష్ట్రంలోని మిగిలిన కాలేజీలపై తీవ్ర ప్రభావం పడనున్నది.

యూజీసీ పెద్దలకు కలిసినా..

రాష్ట్రంలో డీమ్డ్ వర్సిటీలు, ఆఫ్ క్యాంపస్ ల ఏర్పాటులో తమ పాత్ర లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గానే రియాక్ట్ అయింది. దీనిపై స్పష్టత కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్.. 20 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్​ను కలిశారు. డీమ్డ్ వర్సిటీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఏర్పడుతున్న పరిస్థితులను వివరించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రాల నుంచి ఎన్ఓసీ తప్పకుండా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏఐఎస్​హెచ్ఈ సర్వే డేటా ఎవరు ఇవ్వాలి? వర్సిటీల్లో ఏమైనా ఘటనలు జరిగితే ఎవరు వాటిపై చర్యలు తీసుకోవాలి.. అనే ప్రశ్నలు లేవనెత్తినట్టు తెలిసింది. అయినా, వారిని నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో, తాజాగా యూజీసీ చైర్మన్​ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు.  రాష్ట్రాల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని దాంట్లో పేర్కొన్నారు. యూజీసీ నుంచి సానుకూల స్పందన రాకుంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా కలవాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.