ఉగాది పంచాంగం : రాజాది నవనాయక ఫలితాలు ఇలా ఉన్నాయి

రాజు కుజుడు : ఈ సంవత్సరములో కుజుడు రాజు అగుట వలన శత్రుత్వము అధికముగా ఉంటుంది. రాజకీయ నాయకుల మధ్య పరస్పర విరోధముగా, అంతర్గత విరోధముగా మాట్లాడుకొనుట వలన ఉద్రేకముగా ఉంటుంది. వ్యాధులు అధికమగును. అంతా ఉచితము వలన పనిచేయువారు దొరకరు. దొంగతనములు ఎక్కువగా జరుగును. ఆకస్మిక అగ్నిప్రమాదములు ఉండగలవు. సర్ప భయము అధికముగా ఉంటుంది. ఎరుపు భూములు ధరలు బాగా పెరుగును. నలుపు భూములలో పంటలు అధికముగా పండగలవు. 2 వీసముల వర్షములు చాలా తక్కువగా ఉండును. 

అందరిలో మాటపట్టింపుల వలన తగాదాలు, కక్షలు పెరుగును. విష జ్వరముల వలన ప్రజాజీవనములో అనేక విధములుగా బాధలు పడవలసి వస్తున్నది. ధరలను అదుపు చేయుట చాలా కష్టముగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేయండి. శాంతి ఉంటుంది.

మంత్రి శని : శని మంత్రి అగుట వలన భూమి, ఆకాశములో అనుకూలత లేక వర్షములు కురియవు. కొన్ని ప్రాంతములలో తెలియని ఆకస్మిక తుపానుల ద్వారా వర్షములు పడితే సాధారణ రోజుల్లో మబ్బులు పడతాయి కాని వర్షములు పడవు. పంటలు ముహూర్త బలంతో సాధారణ పంటలు. వ్యవసాయ ఖర్చులకు చాలదు. చాలా ఇబ్బందులకు దగ్గరగా ఉంటారు. యుద్ధ భయములా ఏదో తెలియని అనారోగ్యములు గోవులకు వ్యాధులు పెరుగును. నలుపు భూములలో నలుపు ధాన్యములు పంటలు బాగా పండుటకు అవకాశములు ఉన్నవి. ఈ భూమండలమంతా శని యందు ఫలితములు కలిగి ఉంటారు. శనిదేవుని ధాన్యం వలన శనికి తైలాభిషేకం, నలుపు, ఎరుపు నువ్వుల దానం వలన కొంత ఉపశాంతి ఉంటుంది.

సేనాధిపతి శని : సేనాధిపతి శని అయినందువలన సరిహద్దులలో యుద్ధ వాతావరణము ఉంటుంది. ప్రజాజీవనములో అనేక విధములుగా భయము కలిగి ఉంటారు. కారణము సైన్యము మందకొడిగా ఉంటుంది. పోలీసు శాఖలో పట్టుదల తగ్గును. పరిపాలకులు అధర్మముగా ఉంటారు. న్యాయసమ్మతమైన పరిపాలన ఉండదు. ప్రజలు పాపకర్మలు ఎక్కువగా చేయగలరు. జీవనము అంతా అస్తవ్యస్తముగా ఉంటుంది. ఏ రోజు ఏమి జరుగుతుందో అర్థంకాదు. శని మహర్దశ వారు శని అంతర్దశ జరుగుచున్నవారు నవగ్రహ ఆరాధన, శని ఆరాధన వలన ఏరోజుకారోజు తెలియకుండా కొంత ఉపశాంతి ఉంటుంది.

అర్ఘ్యాధిపతి శని : అర్ఘ్యాధిపతి శని అయినందువలన వర్షపాతము చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధులు తెలియని విధంగా ఉంటాయి. దొంగల భయము అధికముగా ఉంటుంది. ధరలు పడిపోగలవు. మరల అధికము అవ్వగలవు. అమ్మేటప్పుడు ధరలు ఉండవు. కొనేటప్పుడు ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకలి కేకలు వినిపించగలవు. ఉచితములు ఆగిపోవుటకు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. ఇక ఉచితముగా ఏమి తీసుకోరాదు అనేది ప్రజలలో తిరుగుచూ మాట్లాడుకొనగలరు.

ధాన్యాధిపతి శని : ధాన్యాధిపతి చంద్రుడు అయినందువలన వరి తృణ ధాన్యముల పంటలు సామాన్యముగా పండును. గోవులు పాలు బాగా ఇవ్వగలవు. కాని శని ప్రభావముచేత వ్యాధులు ఉండగలవు. శని పూజల వలన అదుపులో ఉంటాయి. ధాన్యం ధరలు పెరుగును. ప్రాంతాలవారీగా గ్రహ ఆధిపత్యము ప్రకారము సుభిక్షంగా ఉంటుంది. 

సస్యాధిపతి కుజుడు : సస్యాధిపతి కుజుడు అయినందు వలన ఎరుపు ధాన్యములు, శనగలు, కందులు, మిర్చి ఎరుపు భూములలో పంటలు బాగా పండగలవు. ధరలు అధికమవ్వగలవు. రియల్ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయము బాగుంటుంది. కాని కరువు కాటకములు కలిగి ఉండుటలో ఏమీ అర్థం కాదు. ఆశాజనకంగా రోజులు గడిచిపోగలవు.

రసాధిపతి గురువు : రసాధిపతి గురువు అయినందువలన సుగంధ ద్రవ్యములు, అగరు, చందన, కర్పూరం పూజకు సంబంధించిన అనేక నూతన ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటుంది. కుంకుమ పువ్వు ఇంకా అనేక విధముల రస సంబంధమైన ద్రవ్యములు అందుబాటులో ఉండవు. వృక్షజాతులు, కంద ఫలములు, ఆకస్మిక వర్షముల వలన కొంతవరకు నష్టములు రాగలవు. ప్రజలు ఆరోగ్యముపైన శ్రద్ధ పెట్టగలరు.

నీరసాధిపతి కుజుడు : నీరసాధిపతి కుజుడు అయినందువలన ఎరుపు వస్తువులు, వస్త్రములు, ఎరుపు ధాన్యములు, పగడములు, కస్తూరి,  ఎర్ర చందనం, అగరు, స్వర్ణములో ఎరుపు కోరుకొనగలరు. దానిమ్మ పంట బాగుంటుంది. ధరలు పెరిగి అధిక లాభములు రాగలవు.

మేఘాధిపతి శని : మేఘాధిపతి శని అయినందువలన ఆకస్మిక వర్షములు కురియును. ధరలు మందముగా ఉండును. ఆకస్మికముగా వ్యాపారులు ధరలు పెంచగలరు. నలుపు ధాన్యములు సమృద్ధిగా పండగలవు. వర్షము వచ్చినట్లుగా అనుకొనగలరు. కాని మేఘములు తేలిపోయి వర్షములు పడవు. మీరు ఎదురుచూసిన వర్షములు పడవు. ఆకస్మికముగా వర్షము ఊహించని రీతిగా వచ్చి, చెదురుమదురు జల్లులు, అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడగలరు. కష్టనష్టములు భరించవలసి వచ్చును. ఎవరు నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు చేసుకొనగలిగితే వారికి గృహశాంతి ఉంటుంది.

పశుపాలకుడు యముడు : యముడు పశుపాలకుడు అయినందువలన పశువుల ధరలు తగ్గును. పాలు తక్కువగా ఇవ్వగలవు. దాణా మేత ఖర్చు ఎక్కువగా ఉండగలదు. పశువులకు అరిష్టములు ఉన్నవి. అనారోగ్యముగా అనిపిస్తే జాగ్రత్తలు తీసుకొనగలరు. పశువుల విషయంలో నిర్లక్ష్యముగా ఉండరాదు. శ్రీకృష్ణుని ఫొటో గోశాలయందు పెట్టి పూజలు చేసుకొనుట వలన కృష్ణుని అనుగ్రహం కలిగి ఆవు పాలు ఎక్కువగా ఇవ్వగలవు. గోపాలకృష్ణుని అనుగ్రహంతో పాడి పరిశ్రమకు మేలు జరుగును.

ఈ సంవత్సరం అనారోగ్యము శస్త్రచికిత్సలు అగ్నిభయమలు అనేక విధములుగా ప్రమాదములు. పురోహిత ఉపనాయకుల 21లో రాజాధినాయకులు శుభులు 4, పాపులు 5. పురోహిత నాయకులు శుభులు 10, పాపులు 11 మంది శుభ ఫలితాలు ఇచ్చేవారు14 గురు, అశుభములు కలిగించేవారు 16 గురు. రవి మేషరాశిలో ప్రవేశము పంచమి శనివారం మృగశిర నక్షత్రము ది. 13.4.2024 శోభన యోగం రా.తె. 4.16 ని.లకు మేష సంక్రమణ కాలము అగుట వలన అగ్ని ప్రమాదములలో ఆస్తి నష్టము ఎక్కువగా ఉంటుంది. రవి ఆరుద్ర ప్రవేశము ది. 21.6.2024 రాత్రి గం. 11.52 ని.లకు రవి ఆరుద్ర నక్షత్రములో ప్రవేశము. జ్యేష్టమాస శుక్ల పూర్ణిమ శుభము. శుక్లయోగం అతివృష్టి, పంటలు దిగుబడి రావు. మంద ఫలితములు.

వాస్తుకర్తరీ నిర్ణయము

స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రమాస బహుళ ఏకాదశి శనివారంది. 4.5.2024 నుండి డొల్లు కర్తరి ప్రారంభము. ది. 11.5.2024 ఉదయం గం. 7.03 ని.లకు నిజకర్తరి ప్రారంభం. ది. 28.5.2024 వైశాఖ మాస బహుళ పంచమి మంగళవారం ప. గం. 2.39 ని.లకు త్యాగము. వాస్తు సంబంధమైన నూతన గృహ నిర్మాణం, వాస్తు పూజలు, గృహప్రవేశములు, దేవాలయ ప్రారంభము, విగ్రహ ప్రతిష్టలు చేయరాదు. భూమి తవ్వుట, బావి కొరకు తవ్వుట, పూరిల్లు, పెంకుటిల్లు, కప్పు వేయుట చేయరాదు. వ్యవసాయ పనులు, చెట్లు కొట్టరాదు. కర్తరి ఏ సమయంలోనైన అగ్నిపుట్టవచ్చును. కర్తరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్.సి.సి. శ్లాబ్లు, గోడలు కట్టుకొనేందుకు పట్టింపులేదు.