చెన్నై: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం కేబినెట్‌ను రీషఫిల్ చేసింది. సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందారు. ఆయనతో పాటు మరో నలుగురు లీడర్లు వి.సెంథిల్ బాలాజీ, ఎస్ఎం నాజర్, ఆర్ రాజేంద్రన్, గోవి చెజియాన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్భన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి వీరితో ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో స్టాలిన్, డీఎంకే ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆ వెంటనే కొత్త మంత్రులకు సీఎం స్టాలిన్ శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధికి క్రీడాశాఖతో పాటు ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బాధ్యతలు అప్పగించారు. సెంథిల్ బాలాజీకి ఆయన గతంలో నిర్వహించిన విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలనే కేటాయించారు. గోవి చెజియాన్కు ఉన్నత విద్యాశాఖ, ఆర్ రాజేంద్రన్‌కు పర్యాటక, నాజర్‌కు మైనారిటీ, ప్రవాస తమిళుల సంక్షేమ శాఖలు కేటాయించారు. కాగా, ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ‘యువరాజు’కు సీఎం స్టాలిన్ ఇచ్చిన ప్రమోషన్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పతనానికి ఇండికేషన్ అని అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పేరుతో కుంటుంబ పాలన
సాగిస్తున్నారని బీజేపీ విమర్శలు చేసింది.
యువనేత నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా..
నవంబర్ 27, 1977న జన్మించిన ఉదయనిధి 2019 జులైలో డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. లీడర్షిప్, ఐడియాలజీ వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ద్రవిడ స్ఫూర్తిని నింపడంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో యువతను ఆకట్టుకునేందుకు, పార్టీ సభ్యత్వాన్ని పెంచేందుకు చేపట్టిన యూత్వింగ్ కాన్ఫరెన్స్‌లు, రాష్ట్రవ్యాప్త మోటార్ సైకిల్ ర్యాలీ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాగా ఉపయోగపడ్డాయి. ఎనర్జిటిక్, సక్సెస్ ఫుల్ లీడర్‌గా ఇమేజ్ ను తీసుకొచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొత్తదనంతో కూడిన ఉదయనిధి ప్రసంగాలు, నినాదాలు పార్టీ విజయానికి ఎంతో ఉపకరించాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015లో మదురై ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత అది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిపై ఉదయనిధి ‘ఒక్క ఇటుక’ అనే నినాదంతో పాటు ‘‘29 పైసా మోదీ” నినాదం డీఎంకేకు భారీ విజయాన్ని అందించాయి. తమిళనాడు నుంచి పన్నుగా చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం తిరిగి 29పైసలు మాత్రమే ఇస్తుందన్న ఉదయనిధి ప్రచారం ప్రజలకు బాగా కనెక్ట్ అయింది.