ప్రభుత్వ హాస్టల్‌లోని వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థులు కరెంట్ షాక్ తో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ హాస్టల్ వద్ద నిరసన చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సర్దార్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రభుత్వ గిరిజన హాస్టల్‌కు చెందిన ఇంటర్మీడియేట్ విద్యార్థులు బుధవారం వాటర్ ట్యాంక్‌ను క్లీన్ చేశారు. అయితే ఆ ట్యాంకులోకి నీటిని తోడే మోటారు విద్యుత్ వైర్ డ్యామేజ్ అవ్వడంతో వారికి తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విద్యార్థులు మరణించారు. మృతులను వికాస్ నినామా, ఆకాష్ నినామాగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ ప్రభుత్వ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు.
ALSO READ | మహిళను 59 ముక్కలుగా నరికిన యువకుడు సూసైడ్
వాటర్ ట్యాంక్ శుభ్రం చేయమని విద్యార్థులకు ఎవరు చెప్పారని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సర్దార్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గ్రేవాల్ కూడా ఆ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్ సింగ్ భూరియాతో ఆయన వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత భూరియా ఆరోపించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు హాస్టల్ వద్ద పరిస్థితిని అదుపు చేశారు. విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.