హసీనాపై మరో రెండు మర్డర్ కేసులు

  • నిరసనకారుల హత్యలపై ఫిర్యాదుల ఆధారంగా నమోదు
  • షేక్ హసీనా, ఆమె పార్టీ నేతలపై 15కు చేరిన హత్య కేసులు 

ఢాకా:  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన పలువురు నేతలపై మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. దేశంలో ఫ్రీడమ్ ఫైటర్ల వారసులకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఇద్దరు చనిపోవడానికి అప్పటి హసీనా సర్కారే కారణమంటూ ఈ కేసులు పెట్టారు. బంగ్లాదేశ్ లో వెల్లువెత్తిన నిరసనల కారణంగా ఆగస్టు 5న రాజీనామా చేసిన హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఢాకాలోని మీర్ పూర్, బంగ్లా నగర్ ఏరియాలో జరిగిన నిరసనల్లో ఇద్దరు చనిపోవడంపై తాజాగా హసీనాతోపాటు మాజీ మంత్రులపై రెండు హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో హసీనా, ఆమె పార్టీ నేతలపై నమోదైన కేసుల సంఖ్య మొత్తం 15కు చేరింది. 

తాజాగా నమోదైన కేసుల్లో.. మీర్ పూర్ లో చనిపోయిన లిటన్ హసన్ లాలూ సోదరుడు హసీనాతోపాటు అప్పటి హోం మంత్రి, ఐజీ, తదితరులు సహా 148 మందిపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తన సోదరుడిపై హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి చంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, బంగ్లా నగర్ ఏరియాలో తారిక్ హుసేన్ అనే నిరసనకారుడిని కొందరు కాల్చి చంపగా.. అతడి హత్యకు హసీనా, అప్పటి రోడ్డు రవాణా మంత్రి, హోం మంత్రి, విదేశాంగ మంత్రి సహా 13 మంది కారణమంటూ మరో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.