- 19 మంది మిల్లర్లపై పోలీస్ కేసులు, ఒక్కరి అరెస్ట్
- ఆర్వోఆర్ యాక్ట్ కింద రికవరీకి చర్యలు
- రూ.87 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు ఆఫీసర్ల నిర్ధారణ
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ వడ్లను పక్కదారి పట్టించిన 19 మంది మిల్లర్లపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు మిల్లర్లు పరారయ్యారు. ఒకరు దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగు రోజుల కింద వర్ని మండలానికి చెందిన వంశీ రైస్ మిల్ఓనర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జిల్లాలో రూ.87 కోట్ల విలువైన వడ్లను మిల్లర్లు గాయబ్ చేసినట్లు ఆఫీసర్లు లెక్కలు తేల్చారు. ఆర్వోఆర్ యాక్ట్ కింద రికవరీ చర్యలు తీసుకుంటున్నారు.
కన్ఫర్మేషన్ తర్వాత..
రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ సేకరణపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. సర్కార్ ఆదేశాలతో ఆఫీసర్లు మిల్లుల్లో స్టాక్ వివరాలను సేకరించారు. అసలు మిల్లర్ల వద్ద వడ్లు ఉన్నాయా? లేవా? అని విచారణ చేశారు. 2021–22 ఖరీఫ్, యాసంగి సీజన్లకు సంబంధించి రూ.35.65 కోట్ల విలువైన వడ్లను దారి మళ్లించడంతో గతనెల 25న ఏడుగురు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు.
2022–23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 95.13 శాతం టార్గెట్ కంప్లీటైంది. మిగతా 20 వేల టన్నుల వడ్లపై నోటీసులిచ్చారు. 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి 57 శాతం సీఎంఆర్ఎఫ్సీఐకి చేరలేదు. 4.32 లక్షల మెట్రిక్ టన్నుల బాపతు వడ్లకుగాను 18.69 లక్షల టన్నులకు సమానమైన రైస్ మాత్రమే వచ్చినట్లు తేలింది. బ్యాలెన్స్సరుకు గోదాముల్లో కనిపించనందున పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు.
వడ్ల విలువకు సమానమైన డబ్బు రూ.52 కోట్లను గవర్నమెంట్‌కు చెల్లించాలని కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. గడువు దాటినా స్పందించకపోవడంతో ఈనెల 1న మరో 12 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. ఆర్వోఆర్ యాక్ట్‌ను ప్రయోగించి రికవరీ చర్యలు చేపట్టాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
బోధన్ డివిజన్‌లోనే 12 కేసులు
జిల్లా మొత్తంగా సీఎంఆర్ వడ్లను మాయం చేసిన 19 మంది మిల్లర్లపై కేసులు నమోదు కాగా, అందులో బోధన్, బాన్సువాడ సెగ్మెంట్ పరిధిలోనే 12 మంది మిల్లర్లుండడం గమనార్హం. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు బడా లీడర్ల అండతో వడ్లను మార్కెట్లో అమ్ముకున్నారు. ఆ చిట్టా ఇప్పుడు తేలింది. కేసుల నుంచి బయటపడేందుకు 15 మంది మిల్లర్లు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎంఆర్ఇవ్వకపోడానికి కారణాలు చూపి, గడువు పెంచుకునేందుకు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు.