గురుకులంలో పాము కాటు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

  •     మెట్ పల్లి మండలం పెద్దాపూర్ 
  •      గురుకుల హాస్టల్​లో ఘటన
  •     నిజామాబాద్  హాస్పిటల్ కు తరలింపు
  •     ప్రిన్సిపాల్​, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని బంధువుల ఫైర్​ 

మెట్ పల్లి, వెలుగు:  జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ గురుకుల స్కూల్​ హాస్టల్​లో పడుకున్న ఇద్దరు విద్యార్థులను పాము కాటు వేయగా పరిస్థితి విషమంగా ఉంది. అయితే , ఇదే రూములో పడుకున్న మరో విద్యార్థి అదే సమయంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధిత విద్యార్థుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మెట్ పల్లికి చెందిన హర్షవర్ధన్ (14), ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడేపు గణేశ్​(14) పెద్దాపూర్ గురుకుల స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి హాస్టల్ ​రూంలో పడుకోగా అర్ధరాత్రి 3 గంటల టైంలో హర్షవర్ధన్​, గణేశ్ ​చేతులపై ఏదో కాటేసినట్టు గుర్తించారు.

ఏదో పురుగు కావచ్చని అనుకుని అలాగే పడుకున్నారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి విద్యార్థులు కేర్ టేకర్ కు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూసి నీళ్లు తాగిపించినా, ఏదైనా తినిపించినా తినలేదు. దీంతో వారిని ఉదయం ఆరు గంటలకు మెట్ పల్లి సివిల్ హాస్పిటల్ తీసుకువెళ్లారు. విద్యార్థుల చేతులపై ఉన్న గాట్లు చూసి పాము కాటు వేసిందని డాక్టర్లు నిర్ధారించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో గుర్తిం చి నిజామాబాద్ హాస్పిటల్​కు తరలించారు. కాగా, ఈ విషయంలో ప్రిన్సిపాల్, కేర్ టేకర్ విద్యార్థులకు కనీస ట్రీట్​మెంట్​ఇప్పించకుండా, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు .  

అదే రూంలో మరో విద్యార్థి మృతి

ఇదే గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతూ పాము కాటు వేసిన రూములోనే పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. మెట్ పల్లిలోని ఆరపేటకు చెందిన రాజారపు మహేశ్, లావణ్య దంపతుల చిన్న కొడుకు ఘనాదిత్య (13)ను శుక్రవారం తెల్లవారుజామున స్టడీ అవర్, వ్యాయామం కోసం వార్డెన్, కేర్ టెకర్ నిద్ర లేపగా లేవలేదు. ఘనాదిత్యను పిలుస్తుండగా కాళ్లు, చేతులు వంకర కావడాన్ని గమనించి ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కు సమాచారమిచ్చారు.

ఆయన స్టూడెంట్‌ తండ్రికి చెప్పగా వెంటనే వచ్చి బైక్​పై మెట్ పల్లి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ అప్పటికే చనిపోయాడని చెప్పాడు. పిల్లాడి ఆరోగ్యం గురించి ప్రిన్సిపాల్, వార్డెన్ పట్టించుకోకపోవడం వల్లే ఘనాదిత్య చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయాక సమాచారం ఇచ్చారని, కనీసం హాస్పిటల్ తీసుకెళ్లేందుకు వాహనాన్ని సమకూర్చలేదని బైకుపై మృతదేహాన్ని తీసుకొని దవాఖానకు వెళ్ళాల్సి వచ్చిందని తండ్రి కంటతడి పెట్టాడు. పోలీసులు హాస్టల్​కు చేరుకుని విచారణ చేపట్టారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. కాగా, మహేశ్​ దంపతులకు పెండ్లయిన ఏడాదికే పుట్టిన కొడుకు అనారోగ్యంతో చనిపోగా, ఐదేండ్లకు పుట్టిన మరో కొడుకు కూడా కన్నుమూశాడు. మూడో కొడుకు  అయిన ఘనాదిత్య కూడా కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రులకు అంతులేని ఆవేదనే మిగిలింది.