ఇద్దరు సీసీఎస్‌ సీఐల సస్పెన్షన్‌

  • మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు కేసులో సీఐ ప్రేమ్‌కుమార్‌..
  • మద్యం మత్తులో డ్యూటీకి వస్తున్న మరో సీఐ రమేశ్‌పై వేటు

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సీసీఎస్‌ సీఐలపై సస్పెన్షన్‌ వేటు పడింది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో డిసెంబర్‌ 23న జరిగిన యాక్సిడెంట్‌ కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌ను తప్పించేందుకు సీఐ ప్రేమ్‌కుమార్‌ ప్రయత్నం చేశారు. అప్పుడు బోధన్‌ సీఐగా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్‌లో తన పలుకుబడి ఉపయోగించి రాహిల్‌పై కేసు కాకుండా పైరవీ చేశారు.

తర్వాత విషయం బయటపడడంతో ప్రేమ్‌కుమార్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్టేషన్‌ బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయనకు సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆయనను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఐజీ రంగనాథ్‌ ఆర్డర్స్‌ జారీ చేశారు. అలాగే మద్యం మత్తులో డ్యూటీకి వస్తూ, పలువురిని బెదిరిస్తున్నాడన్న ఆరోపణలతో సీసీఎస్‌ సీఐ రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.