సమగ్ర కుటుంబ సర్వేను జయప్రదం చేయాలి: ఎమ్మెల్యే మందుల సామేల్

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో నవంబర్ 6 నుంచి నిర్వహించే సమగ్ర ‌‌‌‌కుటుంబ సర్వేలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ​పిలుపునిచ్చారు. సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 

దేశంలో కాంగ్రెస్ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. సర్వే కోసం వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, పీసీసీ డెలిగేట్ లక్ష్మారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.