ఎన్టీఆర్ నేర్పిన సంస్కారంతో పనిచేస్తున్నాం : తుమ్మల నాగేశ్వరరావు

  • దేశ రాజకీయాల్లో ఆయన విప్లవాత్మక మార్పులు తెచ్చారు
  • వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కోటగిరి, వెలుగు: తాము ఏ పార్టీలో, ఏ పదవిలో ఉన్నా ఇప్పటికీ స్వర్గీయ ఎన్టీఆర్​ నేర్పిన సంస్కారంతో పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని మీర్జాపూర్ కాలనీలో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సోమవారం మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు రుద్రూర్ నుంచి కోటగిరి వరకు భారీ ర్యాలీతో మంత్రి తుమ్మలకు స్వాగతం పలికారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డున చాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ లీడర్ల జోక్యాన్ని ప్రశ్నిస్తూ, తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారన్నారు. పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం, విద్యుత్ ​సంస్కరణలు, పటేల్, పట్వారీ వ్యవస్థల రద్దు, మండల పరిషత్తుల ఏర్పాటు లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. 

తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. తన లాంటి ఎందరికో ఎన్టీఆర్​ రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన మంత్రివర్గంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. 

ALSO READ : మెడికల్​ కాలేజీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి : భవేశ్​​ మిశ్రా

కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్​పర్సన్​ పద్మావతి, ఎంపీపీ మల్లేపల్లి సునీత, ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యులు దుప్పలపూడి శ్రీధర్, వేములపల్లి ఆనంద్, దొప్పలపూడి శ్రీధర్, కొల్లూరు కిశోర్ బాబు, కొల్లూరు రమేశ్, మల్లేపల్లి శ్రీనివాస్, ఉదయ్, సాయి శ్రీనివాస్, జానకీరామ్, హన్మంత్​రావు తదితరులు పాల్గొన్నారు.