చాలా మంది మంగళవారం, శుక్రవారం డబ్బు ఎవరికీ ఇవ్వరు. ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని, లక్ష్మీ దేవి మన ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని చెబుతుంటారు. అయితే నిజంగానే అలా చేస్తే డబ్బు సమస్యలు వస్తాయా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి. ఏ రోజులో డబ్బు ఇస్తే మంచిది అనేది తెలుసుకుందాం...
ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు. అవి లేకపోతే ఏ పని చేయలేం. డబ్బుని లక్ష్మీదేవితో సమానం అంటారు. అందుకే చేతిలో నుంచి డబ్బులు కింద పడితే వాటిని తీసుకుని కళ్ళకు అద్దుకుంటారు. అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్టు భావిస్తారు. మంగళ, శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపమని మహిళలు నమ్ముతారు. అందువల్లే ఆ రోజు ఎవ్వరికి డబ్బు ఇవ్వరు. అలా ఇస్తే ఆడపిల్లను శుక్రవారం పంపినట్టేనని భావిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కూడా మంగళ, శుక్రవారాలు అత్తవారింటికి పంపరు.
మంగళవారం డబ్బు ఇవ్వకూడదా
మంగళవారానికి కుజగ్రహం అధిపతి. మంగళ అంటే శుభం అని అర్థం. మనుషుల మీద కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకు కారకుడుగా నమ్ముతారు. అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. అలాగే ఆరోజు ఇల్లు బూజు దులపడం, గోళ్ళు కత్తిరించడం, క్షవరం వంటి పనులు చేయరు. మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు. ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారణమవుతుందని అంటారు.
శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదు...
శుక్రవారం కూడా ఎవరూ డబ్బులు ఇవ్వరు. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం. సాధారణంగా లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని చెప్తారు. లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె. అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా పూర్వం పిలిచే వాళ్ళు. శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించినట్టుగా భావిస్తారు. అలా చేస్తే కష్టాలు వెంటాడతాయని, ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవడం లేదని అనుకుంటారు.
ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో సిరిసంపదలకు ఎటువంటి లోటు ఉండదని లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు. అందుకే ఆడపిల్లలని శుక్రవారం పూట అత్తింటికి పంపించరు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తింటికి వెళ్లిపోతుందని నమ్ముతారు. శుక్రవారం ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు ఉతకరు
కొంతమంది అనవసర ఖర్చులు ఆపడానికి ఈ రెండు రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారని ఆశతో అలా చేస్తారని అంటున్నారు. అత్యవసర సమయాల్లో, ఆపద సమయంలో ఇటువంటివి నమ్మితే అది అనార్థాలకు దారి తీస్తుంది. అందుకే ఇటువంటి పనులు చేయకూడదు. కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. అలా చేస్తే ఆర్థికసమస్యలు తలెత్తుతాయి.