సెప్టెంబర్​లో సర్పంచ్ ఎన్నికలు .!

  • ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురూ
  • అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
  • గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో ఆరు నెలలు 
  • ఆరు నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు  
  • కులగణనకు 5 నెలలు పడుతుందని వెల్లడి
  • అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి
  • బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్టు అంజేయాలని బీసీ కమిషన్​కు ఆదేశం 
  • జిల్లా, మండల పరిషత్​లకు 6 నెలల టైమ్.. వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని యోచన 

హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతున్నది. సెప్టెంబర్, అక్టోబర్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించి.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లను కొంతకాలం వాయిదా వేయాలని భావిస్తున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సెక్రటేరియెట్​లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, కులగణనకు ఉన్న ఆటంకాలపై ఆయన ఆరా తీశారు. ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి కొత్త ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని సీఎంకు అధికారులు తెలిపారు.

ఇప్పటికే రెండు రాష్ట్రాల‌కు ఓటర్ల జాబితాను ఈసీ పంపింద‌ని, తెలంగాణ సహా మ‌రో ఆరు రాష్ట్రాల‌కు వచ్చే వారంలో జాబితాలు పంపిస్తుంద‌ని చెప్పారు. మరోవైపు కులగణనకు సుమారు 5 నెలల టైమ్ పడుతుందని, దానికోసం దాదాపు లక్ష మంది ఉద్యోగులు అవసరమని వివరించారు. లక్ష మందికి ఇప్పటికిప్పుడు ట్రైనింగ్ ఇచ్చి, ప్రశ్నావళి చేతికి అందించి పంపినా ఐదు నెలల కంటే తక్కువ సమయంలో కులగణన సాధ్యం కాదని వెల్లడించారు. ఈ నెలతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఆరు నెలలు అవుతుందని, ఆరు నెలలు దాటితే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇప్పటికిప్పుడు కులగణన చేయడం సాధ్యం కాదని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్.. అంత టైమ్ లేనందున బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు. సెంట్రల్ ఫండ్స్ ఆగిపోకుండా సెప్టెంబర్​లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకే ఆయన మొగ్గు చూపినట్టు తెలిసింది. మరోవైపు జిల్లా, మండల పరిషత్​ల టర్మ్​కూడా ఈ నెల మొదటి వారంలో పూర్తయింది. అయితే 6 నెలల వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగించే అవకాశం ఉంది. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుందామని సీఎం రేవంత్ సూచించినట్టు సమాచారం. 

వివిధ రాష్ట్రాల్లో స్టడీ చేసిన బీసీ కమిషన్

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని భావించిన ప్రభుత్వం.. ఇందుకోసం కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం జీవో ఇచ్చి రూ.150 కోట్లు కూడా కేటాయించింది. సర్కార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన బీసీ కమిషన్.. కులగణనపై బీసీ సంఘాలు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. ఇప్పటికే కులగణన చేసిన బిహార్, ఏపీ, కర్నాటక రాష్ర్టాల్లో పర్యటించి.. ఆయా రాష్ట్రాలు అవలంబించిన పద్ధతులపై అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో ఆ నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని బీసీ కమిషన్​చైర్మన్​వకుళాభరణం కృష్ణ మోహన్​ను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

క్యాస్ట్ లెక్కలతో రిజర్వేషన్ల పెంపు?

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం తగ్గించింది. కానీ కులగణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి, రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్​ సర్కార్ భావించింది. అయితే కులగణన చేపట్టేందుకు టైమ్ లేకపోవడంతో ఈసీ నుంచి ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత, వాటి సాయంతో ఇంటింటికీ వెళ్లి క్యాస్ట్ వివరాలు తీసుకుని బీసీ కమిషన్ కు అందజేయాలని యోచిస్తున్నది. వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని సర్కార్ ఆలోచన చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇలాగే క్యాస్ట్​ వివరాలు సేకరించారని బీసీ కమిషన్ ​అధ్యయనంలో తేలినట్టు పేర్కొంటున్నారు. తాజాగా సీఎంతో జరిగిన రివ్యూలోనూ ఈ విషయంపై చర్చ జరిగిందని, ఇందుకు ఆయన​కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. కాగా, రిజర్వేషన్లు 50శాతం మించితే గతంలో మాదిరి కోర్టుల్లో కేసులు పడే అవకాశముంది.  అలాంటి కేసులను ఎలా అధిగమించాలనే విషయమై అడ్వకేట్ జనరల్​తో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినట్టు తెలిసింది.

అట్లయితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతయ్..గ్రామ పంచాయతీల కాలపరిమితి 

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. స్పెషలాఫీసర్ల పాలనకు ఈ నెలతో ఆరు నెలలు పూర్తికానుంది. పాలకవర్గాలు లేకుండా ఆరు నెలలు దాటితే కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి. ఇలాంటి తరుణంలో కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచి, ఎన్నికలు నిర్వహించాలంటే మరో ఆరు నెలలకు పైగా టైమ్ పడుతుంది. ప్రత్యేకాధికారుల పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి టైమ్​లో మరో ఆరు నెలల గడువు పొడిగిస్తే ఫండ్స్​రాక, అభివృద్ధి జరగక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది.