మా ఆఫీసర్లు క్రిమినల్స్‌ సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారు: కెనడా ప్రధాని ట్రూడో

ఒట్టావా: ఖలిస్తానీ టెర్రరిస్ట్‌ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌‌ హత్య కేసుకు సంబంధించి కీలకమైన వివరాలు బయటకు రావడంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అసహనం వ్యక్తం చేశారు. నిజ్జర్‌‌ హత్య కేసులో ప్రధాని మోదీతో పాటు విదేశాంగ శాఖ మంత్రులు భాగమైనట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించడంపై ఫైర్ అయ్యారు. బ్రాంప్టన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు తమ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు క్రిమినల్స్‌ అని మండిపడ్డారు. ‘‘దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్‌ అత్యంత కీలక సమాచారాన్ని మీడియాకు లీక్‌ చేశారు. దాని ఆధారంగా తప్పుడు కథనాలు రావడం నేను చూశాను.

అందుకే వీదేశీ జోక్యంపై జాతీయ దర్యాప్తు జరపాలి. దీంతో మీడియా సంస్థలకు అత్యంత రహస్యమైన, తప్పుడు సమాచారాన్ని లీక్‌ అవ్వకుండా నిరోధించగలం”అని పేర్కొన్నారు. నిజ్జర్‌‌ హత్య కేసులో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌‌, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌‌ అజిత్‌ ధోవల్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రమేయం ఉందని కెనడాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు ప్రచురించింది. వీరి పేర్లను కెనడాలోని టాప్‌ సెక్యూరిటీ అధికారులు తమకు చెప్పారని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వార్తలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాము ఎవ్వరి పేర్లను చెప్పలేదని ట్రూడో ఇంటెలిజెన్స్‌ అడ్వైజర్‌‌ గత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

పాప్‌ సింగర్‌‌ షోలో ట్రూడో డ్యాన్స్.. 

అమెరికన్‌ పాప్‌ సింగర్‌‌ టేలర్‌‌ స్విఫ్ట్‌ కాన్సర్ట్ లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో డ్యాన్స్‌ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రూడో డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కెనడాలోని మాంట్రియల్‌లో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అదే సమయంలో ట్రూడో ఈ కాన్సర్ట్‌లో పాల్గొని డ్యాన్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.