అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం వాటిల్లింది. వెల్డండ మండలంలో 7.82 సెంటీమీటర్లు, కల్వకుర్తిలో 5.50 సెంటీమీటర్లు, ఊర్కొండ మండలంలో 3.92 సెంటిమీటర్లు

తాడూరు మండలంలో 1.65సెంటిమీటర్ల వర్షం కురిసింది. వంగూరు, చారకొండ, నాగర్​ కర్నూల్​ టౌన్, బిజినేపల్లి, తెల్కపల్లి మండల కేంద్రాల్లో జల్లులు కురిసాయి. గురువారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులు, గాలులతో మొదలైన చినుకులు భారీ వర్షంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మార్కెట్​ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా చూసుకొనేందుకు రైతులు తిప్పలు పడ్డారు. టార్పాలిన్​ కవర్లు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కల్వకుర్తి మార్కెట్​ యార్డులో ఆరబోసిన వడ్లు వాననీటిలో కొట్టుకుపోయాయి. 

నేలరాలిన మామిడికాయలు.. 

గాలివానకు మామిడికాయలు రాలి రైతులు నష్టపోయారు. మామిడితోటలు ఎక్కువగా ఉన్న  కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వాన రైతులను ఆందోళనకు గురిచేసింది. గాలివానకు కల్వకుర్తి పట్టణం, వెల్దండ మండలంలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 10గంటల తర్వాత విద్యుత్​ సరఫరా పునరుద్ధరించారు.