ట్రిపుల్​ తలాక్​ డేంజర్.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​ దాఖలు

న్యూఢిల్లీ: ముస్లిం మతస్తులు ఆచరించే ట్రిపుల్​తలాక్ సంప్రదాయం ప్రమాదకరమని కేంద్రం పేర్కొన్నది. ఇది వివాహ వ్యవస్థకు మరణశాసనం లాంటిదని తెలిపింది.  ట్రిపుల్​ తలాక్​కు వ్యతిరేకంగా 2019 లో తీసుకొచ్చిన చట్టాన్ని కేంద్రం సమర్థించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా సోమవారం కోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది. ఈ ఆచారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లో చెప్పినప్పటికీ.. 

ముస్లిం మహిళల విడాకుల సంఖ్యను తగ్గించడంలో ఆ సమాజం చర్యలు తీసుకోలేదని తెలిపింది. దీంతో తాము చట్టం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నది. ట్రిపుల్​ తలాక్​ చట్టం ముస్లిం మహిళల హక్కులను పరిరక్షిస్తున్నదని పేర్కొంది. వివాహిత ముస్లిం మహిళలకు లింగ న్యాయం, లింగ సమానత్వాన్ని నిర్ధారించడంలో ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.