కేంద్రమంత్రిని  కలిసిన ట్రిపుల్ ఆర్  నిర్వాసితులు

చౌటుప్పల్ వెలుగు : ట్రిపుల్ ఆర్ కింద భూములు కోల్పోతున్న చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ లకు చెందిన భూ నిర్వాసితులు బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..   నార్త్ సైడ్ ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ ను  28 కిలోమీటర్లకు పరిమితం చేశారని, దీంతో చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ మున్సిపాలిటీలు మూడు ముక్కలుగా విడిపోతున్నాయని తెలిపారు.

అలైన్ మెంట్ ను 40 కిలోమీటర్లకు మార్చితే మున్సిపాలిటీలు విడిపోకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. మున్సిపాలిటీల్లో భూముల బహిరంగ మార్కెట్ వాల్యూ సుమారు రూ. 5 కోట్లు ఉండగా ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ. 20 నుంచి రూ. 30 లక్షలు ఇస్తామంటుందని వాపోయారు. అలైన్ మెంట్ ను 40 కిలోమీటర్ల మేర మార్పులు చేసి రైతులను కాపాడాలని బండి సంజయ్ ను కోరారు.

కేంద్రమంత్రిని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, భూ నిర్వాసితులు చింతల దామోదర్ రెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, మారుపాక లింగం గౌడ్, గోపగోని లక్ష్మణ్, చింతల సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జాల శ్రీశైలం, జాల జంగయ్య, జాల వెంకటేశ్ యాదవ్, జా నరసింహ, గుండెబోయిన గాలయ్య, ప్రకాశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.