స్కూలు బిల్డింగ్ లో పశువుల కొట్టం.. ఏజెన్సీ స్కూళ్ల పరిస్థితి అధ్వానం

  •     ఏజెన్సీ స్కూళ్ల పరిస్థితి అధ్వానం
  •     పాఠశాలల్లోనే పశువుల కొట్టాలు
  •     విరిగిన బ్లాక్ బోర్డులు, పనికిరాని టాయిలెట్లు 

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం గ్రామాల్లోని గిరిజనుల పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.  గోల్కొండ ట్రైబల్ ప్రాథమిక స్కూల్ వెనకాల తరగతికి ఆనుకొని పిచ్చి మొక్కలు మొలిచాయి. సుష్మీర్ స్కూల్ ను అయితే ఏకంగా పశువుల కొట్టంగా మార్చుకున్నారు. కొరెతగూడ స్కూల్ లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయి. బూరూగూడ స్కూల్ లో టాయిలెట్ల నిర్మాణం మధ్యలోనే వదిలేశారు. మిగతా స్కూళ్లలో బ్లాక్ బోర్డులు పగిలిపోయాయి. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలు చదువుకుంటున్నారు. ఆదివాసీ గిరిజన పిల్లలు చదువుకునే స్కూళ్లలో కనీస వసతులు లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది.

మారుమూల ప్రాంతం కావడం, ఐటీడీఏ అధికారుల పట్టింపులేకపోవడం గిరిపుత్రులకు శాపంగా మారుతోంది. పూర్తిగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ పాఠశాలల్లో విద్యాశాఖ పెత్తనం నడుస్తోందన్న వాదన వినిపిస్తోంది.  మండలంలో రెండు స్కూల్ కాంప్లెక్స్ ల్లో సుమారు ముప్పై వరకు  టీడబ్ల్యూ పీ ఎస్ లు ఉండగా మెజారిటీ స్కూళ్లు కనీస వసతులు లేక మొక్కుబడిగా నడుస్తున్నాయి. అన్ని స్కూళ్లకి గ్రాంట్ వచ్చినా, అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు వచ్చినా కనీస మార్పు లేకపోవడం గమనార్హం. 

ఇదీ పరిస్థితి.. 

గోల్కొండ స్కూల్ లో 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రెగ్యులర్ టీచర్ లేక సీఆర్టీ పని చేస్తున్నారు. వీరికి టాయిలెట్స్‌ లేవు.  బూరుగుడా స్కూల్ లో సీఆర్ టీ శంకర్ ప్రసాద్ ఉండగా 11 మంది పిల్లలు ఉన్నారు. మద్దిగూడ స్కూల్ లో రెగ్యులర్ ఉపాధ్యాయుడు హన్మంత రావ్ ఉన్నారు.  ఇక్కడ12 మంది స్టూడెంట్స్ ఉండగా, వాళ్లకు ఎలాంటి  సౌకర్యాలు లేవు.    బారే గూడ పాఠశాలలో 11 మంది ఉండగా సీ ఆర్ టి ఉన్నారు. ఇక్కడ టాయిలెట్స్ కి తాళాలు వేసి ఉండగా  ఆ ప్రాంతం మొత్తం గడ్డి మొలిచింది.  కొరెత గూడ లో 30 మంది స్టూడెంట్స్ ఉండగా సౌకర్యాలు లేవు. టాయిలెట్స్ పూర్తిగా పనికి రాకుండా పోయాయి.  

వాన వస్తే ఇందులో బురద నిండుతోంది. సుస్మీర్  స్కూల్ లో28 మంది పిల్లలు ఉండగా సీ ఆర్ టీ నాందేవ్ పని చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు ఒక భవనం వాడుతున్నారు. అదనంగా కట్టిన ఇంకో భవనం స్థానికులు పశువుల కొట్టంగా వాడుతున్నారు. ఈ స్కూల్ లో కనీసం వంట కోసం గ్యాస్ లేదు. మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి వండుకుని తీసుకువచ్చి పిల్లలకు వడ్డిస్తున్నారు.   గత విద్యాసంవత్సరం కి సంబంధించి  స్కూల్ గ్రాంట్ ద్వారా ప్రతీ స్కూల్ కి నిధులు రాగా వాటిని మార్చి నెలలో  డ్రా చేసినట్లు తెలుస్తోంది.

ఈ నిధులతో మండల విద్యాశాఖ అధికారుల ద్వారా టేబుల్, రెండు కుర్చీలు, ఆట వస్తువులు కొని సప్లయ్ చేశారని, దానికి సంబంధించి బిల్లులు, లెక్కలు తమ వద్ద లేవని సీఆర్టీలు చెబుతుండటం గమనార్హం.  స్కూల్ గ్రాంట్ కి సంబంధించి ఉన్న అకౌంట్ వివరాలు అందుబాటులో లేవు. దీనిపై జిల్లా అధికారులు, ఐటీడీఏ పీఓ దృష్టిపెట్టి స్కూళ్లలో వసతులు బాగు చేయించాలని కోరుతున్నారు.