ఇంటర్వ్యూ : 56 ఏండ్ల వయసు..  వేల కిలోమీటర్లు

ఆయన వయసు ఐదు పదుల కంటే ఎక్కువే. కానీ.. రోజూ 50 కిలోమీటర్లకు తగ్గకుండా సైక్లింగ్ చేస్తాడు. మూడేండ్లలో 500 కిలోమీటర్లకు పైగా సైకిల్‌‌‌‌ ప్రయాణం చేసి.. యువకులకు సైతం రోల్ మోడల్‌‌‌‌గా నిలిచాడు ఎస్. ఆర్. శేఖర్‌‌‌‌‌‌‌‌. ‘56 ఏండ్ల వయసులో హెల్దీగా ఉన్నానంటే... కారణం సైక్లింగే’ అంటున్న శేఖర్​ గురించి.

సైకిల్‌‌‌‌ తొక్కడంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న సైక్లింగ్‌‌‌‌ శేఖర్‌‌‌‌‌‌‌‌ది కరీంనగర్. పట్టణంలో ఏజే పెడల్స్ పేరుతో సైకిల్స్‌‌‌‌ బిజినెస్ చేస్తున్నాడు. సైక్లింగ్ చేయడం 2021లో మొదలుపెట్టి.. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ మీద అవగాహన కలిగిస్తున్నాడు. అంతేకాదు.. సైక్లింగ్‌‌‌‌కు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు. ఈ మధ్యే డిసెంబర్17న తన 500వ 50 కిలోమీటర్ల రైడ్‌‌‌‌ని సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా సైక్లింగ్‌‌‌‌ జర్నీ గురించి ఆయన మాటల్లోనే.. 

సైక్లింగ్‌‌‌‌ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి? 

మా తాత సైకిల్ తొక్కేవాడు. మా నాన్న కూడా సైకిల్ మీదే ఉద్యోగానికి వెళ్లేవాడు. వాళ్లిద్దరూ చాలా హెల్దీగా ఉండేవాళ్లు. అందుకే నేను కూడా సైక్లింగ్‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నా. మా అమ్మది పెద్దపల్లి. నాన్నది హుజూరాబాద్‌‌‌‌. మా నాన్న టీచర్ కావడం వల్ల ఉద్యోగ రీత్యా మానుకొండూరులో ఉండేవాళ్లం. దాంతో.. నా స్కూలింగ్ మొత్తం అక్కడే జరిగింది. నేను ఇంటర్మీడియెట్​ చదివేటప్పుడు వరంగల్‌‌‌‌కు షిఫ్ట్‌‌‌‌ అయ్యాం. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాం.

మా నాన్న ఎక్కువ కాలం మానుకొండూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేశాడు. ప్రతి రోజూ సైకిల్‌‌‌‌ మీదే ఉద్యోగానికి వెళ్లి, వచ్చేవాడు. అంతేకాదు.. నన్ను, మా అమ్మను ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సైకిల్‌‌‌‌ మీదే తీసుకెళ్లేవాడు. అప్పట్లో అందరూ సైకిళ్ల మీదే ఎక్కువ ప్రయాణాలు చేసేవాళ్లు. అందుకే వాళ్లకు అనారోగ్య సమస్యలు రాలేదు. ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ.. ఇప్పటివాళ్లు రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. అందుకే.. నేను కూడా పూర్వీకుల్లాగే సైకిల్‌‌‌‌ తొక్కాలని డిసైడ్‌‌‌‌ అయ్యా. 

ఇదివరకు బయటికెళ్లాల్సిన ప్రతిసారి.. సైకిల్ తొక్కేవాళ్లు. లేదంటే నడుస్తూ వెళ్లేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఆ అవరమే లేకుండా పోయింది. అంతెందుకు ఇదివరకు ఇంట్లో టాయిలెట్లు లేని టైంలో ఆరుబయటికి వెళ్లాలన్నా చాలాదూరం నడిచేవాళ్లు. పొలం దగ్గరకు వెళ్లాలన్నా.. శారీరకంగా శ్రమించాల్సి వచ్చేది. కాబట్టి మార్నింగ్ వాక్‌‌‌‌ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. ఇప్పుడు ఇంట్లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఫుడ్ కావాలన్నా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే యాప్స్‌‌‌‌ ఉన్నాయి. ఒకప్పుడు మానుకొండూరులో ఒకే ఒక డాక్టర్ ఉండేవాడు. అతని దగ్గరికి వెళ్లే పేషెంట్లు కూడా చాలా తక్కువగానే ఉండేవాళ్లు. కానీ.. ఇప్పుడు మానుకొండూరులో50 నుంచి 60 మంది  డాక్టర్లు ఉన్నారు. కారణం.. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేక ప్రజల ఆరోగ్యం పాడవడమే. కాబట్టి ప్రతి మనిషి ఏదో రకంగా ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. వాకింగ్‌‌‌‌, జాగింగ్‌‌‌‌, రన్నింగ్‌‌‌‌, ఎక్సర్​సైజ్‌‌‌‌.. ఏదైనా పర్లేదు. విద్య, ఆరోగ్యం.. ఈ రెండింటినీ మన దగ్గర్నించి ఎవరూ దొంగిలించలేరు. కాబట్టి వాటిని ఎంత పెంచుకుంటే అంత మంచిది. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ.. ఇప్పుడు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ కోసం ఎవరూ పెద్దగా పనిచేయడం లేదు. అలాంటివాళ్లకు అవగాహన కల్పించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా.
 
ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ కోసం సైక్లింగ్​నే ఎందుకు ఎంచుకున్నారు? 

నా ఫ్రెండ్స్‌‌‌‌లో చాలామంది బ్యాడ్మింటన్ ఆడతారు. వాళ్లలో చాలామందికి లిగ్మెంట్‌‌‌‌ సమస్యలు వస్తున్నాయి. వాళ్లకే కాదు.. రన్నింగ్‌‌‌‌, జాగింగ్‌‌‌‌, స్పీడ్‌‌‌‌ వాక్‌‌‌‌ చేసేవాళ్లకు కూడా కాలు అదుపు తప్పినప్పుడో, అడుగు సరిగా పడనప్పుడో లిగ్మెంట్‌‌‌‌ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ.. సైకిల్‌‌‌‌ తొక్కడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. పైగా కాళ్లు మరింత స్ట్రాంగ్‌‌‌‌ అవుతాయి. మోకాలి నొప్పులు  కూడా తగ్గుతాయి. నేను సైకిల్​ తొక్కక ముందు రెండు ఫ్లోర్లు కూడా ఎక్కలేకపోయేవాడిని. కానీ.. సైకిల్​ తొక్కడం మొదలుపెట్టాక ఇప్పుడు ఐదు ఫ్లోర్లైనా ఈజీగా ఎక్కుతా, దిగుతా. 

సైక్లింగ్ చేయకముందు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? 

నేను సైక్లింగ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టడానికి ముందు డయాబెటిస్‌‌‌‌, హైపర్‌‌‌‌‌‌‌‌ టెన్షన్‌‌‌‌ ఉండేవి. నేను చేసే వ్యాపారం వల్ల అవి వచ్చి ఉంటాయి. కానీ.. ఇప్పుడు ఆ రెండు సమస్యల నుంచి బయటపడ్డా. ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా వాడడంలేదు.1986లో నా ఎడమకాలు ఫ్రాక్చర్​‌‌‌‌ అయ్యింది. కాలు లోపల రాడ్ వేశారు. ఆ రాడ్​ ఇప్పటికీ అలాగే ఉంది. దాని వల్ల రన్నింగ్ చేయడం కాస్త కష్టం. నేను సైక్లింగ్‌‌‌‌ని ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణమే. దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా వాకింగ్‌‌‌‌, రన్నింగ్‌‌‌‌ చేయాలంటే కంపెనీ కావాలి. కానీ.. సైక్లింగ్‌‌‌‌ చేయాలంటే మనతో ఎవరూ లేకపోయినా పర్వాలేదు. సైకిల్ ఉంటే చాలు. ప్రస్తుతం నేను రెండు నుంచి రెండున్న గంటల్లో 50 కిలోమీటర్లు కంప్లీట్‌‌‌‌ చేస్తున్నా. సైక్లింగ్‌‌‌‌ అనేది ఇప్పుడు నా లైఫ్‌‌‌‌స్టయిల్‌‌‌‌లో భాగమైంది. సైక్లింగ్​తోనే నా డైలీ రొటీన్ మొదలవుతుంది. 

మిమ్మల్ని చూసి ఇన్​స్పైర్​ అయ్యి ఎవరైనా సైక్లింగ్‌‌‌‌లోకి వచ్చారా? 

నన్ను చూసి చాలామంది సైక్లింగ్‌‌‌‌ చేయడం మొదలుపెట్టారు. అంతెందుకు ఇంట్రెస్ట్‌‌‌‌ ఉన్నవాళ్లలో 60 నుంచి 70 మందికి నేనే సైకిల్స్​ కూడా కొనిచ్చా. ఇంకా చాలామంది సొంత డబ్బులతో సైకిళ్లు కొనుక్కుని సైక్లింగ్‌‌‌‌ మొదలుపెట్టారు. అందరూ కచ్చితంగా ఏదో ఒక విధంగా ఫిట్​గా ఉండేందుకు ప్రయత్నించాలి. అందరూ ఫిట్‌‌‌‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌‌‌‌ అవుతుంది. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ వల్లే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్‌‌‌‌ వల్ల వచ్చే సమస్యల నుంచి తప్పించుకోగలుతాం. 

ఏదన్నా స్పెషల్​ డైట్ మెయింటెయిన్‌‌‌‌ చేస్తున్నారా? 

చిన్నప్పటినుంచి ఏం తింటున్నానో ఇప్పుడు కూడా అదే తింటున్నా. డైట్‌‌‌‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్యాహ్నం ఒక్కసారే రైస్ తింటా. ఉదయం టిఫిన్ చేస్తా. రాత్రి రొట్టె, చపాతీ లాంటివి తింటుంటా. వెజిటబుల్స్‌‌‌‌ ఎక్కువగా తీసుకుంటా. వాటితో పాటు ఫ్రూట్స్‌‌‌‌ లేదా ఫ్రూట్స్‌‌‌‌ జ్యూస్ ఉంటుంది. డైట్‌‌‌‌ విషయంలో పెద్దగా రిస్ట్రిక్షన్లు పెట్టుకోలేదు. 

రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుతారు? 

ప్రతిరోజు ఉదయం 3.45 నిమిషాలకు నిద్ర లేస్తా. 4.30 గంటలకు సైక్లింగ్ మొదలుపెడతా. రోజూ క్రమం తప్పకుండా 50 కిలోమీటర్లు సైక్లింగ్‌‌‌‌ చేస్తా. ఆదివారాలు, సెలవురోజుల్లో వీలుని బట్టి 100 నుంచి 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతా. కొన్నిసార్లు 300 నుంచి 400 కిలోమీటర్లు కూడా సైక్లింగ్‌‌‌‌ చేస్తుంటా. ఇప్పటివరకు 55,800 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్‌‌‌‌ చేశా. 150కి పైగా 100 కిలోమీటర్ల రైడ్లు, 500కు పైగా 50 కిలోమీటర్ల రైడ్లు పూర్తి చేశా. రెండు లక్షల కిలోమీటర్లు పూర్తి చేయాలనేది నా గోల్‌‌‌‌. నాకంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లలో కూడా సైక్లింగ్‌‌‌‌ చేసేవాళ్లు ఉన్నారు. వాళ్లే నాకు ఇన్​స్పిరేషన్​.