కటాక్షపూర్ బ్రిడ్జికి..  మోక్షమెప్పుడో..

  • పెద్ద చెరువు మత్తడి పోస్తే ఎన్​హెచ్​–163 పై నిలిచిపోతున్న రాకపోకలు
  • వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు
  • బ్రిడ్జి నిర్మిస్తామని గత సీఎం కేసీఆర్ హామీ
  • ఏండ్లు గడుస్తున్నా ముందుకు కదలని పనులు


హనుమకొండ, వెలుగు: నేషనల్ హైవే-163పై హనుమకొండ, ములుగు జిల్లాలకు వారధిగా ఉన్న కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి పొంగితే చాలు.. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి దుంకిన ప్రతిసారి ఇదే పరిస్థితి. ఇక్కడ హై లెవల్ బ్రిడ్జి నిర్మిస్తామని గత ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికొదిలేసింది.

స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా మత్తడిని పరిశీలించి, తొందర్లోనే ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే తిప్పలు తప్పడం లేదు. 

రూ.16 కోట్లతో ప్రతిపాదన..

వర్షాకాలం వచ్చిందంటే కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి నీళ్లతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇదిలాఉండగా, హనుమకొండ జిల్లా ఆరెపల్లి నుంచి ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వరకు నేషనల్ హైవే-163 (హైదరాబాద్​-భూపాలపట్నం హైవే)ని ఫోర్ లైన్ గా విస్తరిస్తున్నారు. దాదాపు రూ.317 కోట్లతో ఈ పనులు చేపట్టగా, అవి కూడా చివరి దశకు వచ్చాయి. ఇదే మార్గంలో ఉన్న కటాక్షపూర్ పెద్ద చెరువు వద్ద అదే బడ్జెట్ లో దాదాపు రూ.16.3 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిని ప్రతిపాదించారు.

దానికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధం చేశారు. కానీ, ఏండ్లు గడుస్తున్నా ఆ పనులు ప్రారంభం కాకపోవడంతో  సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదిలాఉంటే రెండేండ్ల కిందట 2022 జులై 17న భారీ వర్షాల నేపథ్యంలో అప్పటి సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల పర్యటనకు వరంగల్ వచ్చిన సందర్భంగా, ఇదే మార్గంలో భద్రాచలం పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కటాక్షపూర్ పెద్ద చెరువును చూసి నాటి ఉద్యమకాలాన్ని గుర్తు చేసుకున్నారు.

తొందర్లనే ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని కూడా చెప్పారు. కానీ, ఆ తర్వాత అప్పటి ఎమ్మెల్యే కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ సమస్య అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని కటాక్షపూర్ పెద్ద చెరువు వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.