గ్రేటర్​ వరంగల్లో ఫేక్ మాల్.!..బ్రాండెడ్ పేర్లు, స్టిక్కర్లతో దగా

  • టీ పౌడర్ నుంచి ఇంజిన్ ఆయిల్స్, ఎలక్ట్రికల్ సామగ్రి.. ప్రతిదానికీ నకిలీ
  • బ్రాండెడ్ పేర్లు, స్టిక్కర్లతో దగా చేస్తున్న అక్రమార్కులు
  • దందా టార్గెట్​సామాన్య, మధ్యతరగతి కుటుంబాలే..
  • కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలంటున్న జనాలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ ను 'నకిలీ' మాఫియా టార్గెట్ చేసింది.! ఇదివరకు టీ పౌడర్, అల్లం పేస్ట్, బూస్ట్ తదితర ఆహార పదార్థాల కల్తీ వెలుగు చూడగా, ఇప్పుడు ప్రతి వస్తువుకూ డూప్లికేట్​తయారై వరంగల్ మార్కెట్లో చెలామణి అవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ లు, ఇతర సామగ్రి పట్టుబడింది. ఈ నకిలీల వల్ల ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలే నష్టపోతుండగా, అధికారులు నగరంలోని నకిలీలపై నజర్​పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కలవరపెడుతున్న నకిలీలు..

మార్కెట్ లోకి ఏ కొత్త ప్రొడక్ట్ వచ్చినా వెంటనే దానికి డూప్లికేట్ తయారవుతోంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో బ్రాండెడ్ వస్తువులకు సంబంధించిన స్టిక్కర్లు, లేబుల్స్, ప్యాకెట్ కవర్స్ తయారు చేస్తున్న కొన్ని ముఠాలు వాటిని మార్కెటింగ్ ఏరియాలకు చేరవేస్తున్నాయి. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి నకిలీ ప్రొడక్ట్స్​ను వరంగల్ కు తీసుకొస్తున్న వారు వాటిని ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లిలాంటి గ్రామీణ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఒరిజినల్ ప్రొడక్ట్స్ పై పెద్దగా అవగాహన లేకపోవడం, అసలువేవో, నకిలీవేవో తెలుసుకునే  అవకాశం లేకపోవడం వల్ల నకిలీ ముఠాలు గ్రామీణ ప్రాంతాలను టార్గెట్​ చేస్తున్నాయి.

 పేదలపై తీవ్ర ప్రభావం..

వరంగల్ నగరంలోని శివానగర్, పిన్నావారిస్ట్రీట్, అలంకార్, వరంగల్ చౌరస్తా తదితర ఏరియాలే కేంద్రంగా నకిలీల దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వరంగల్ శివానగర్ లో బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ లు అమ్ముతున్న ఓ షాప్ పై రైడ్స్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాదాపు రూ.29 లక్షల విలువైన నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

షాప్ నిర్వహిస్తున్న వ్యాపారి దాదాపు మూడేండ్ల నుంచి ఈ దందా సాగిస్తుండగా, భవన నిర్మాణ పనులకు ఎంతోమందికి సామగ్రిని సప్లై చేశాడు. సామగ్రి తీసుకున్న వారిలో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలే ఉండగా, నాణ్యత లేని కారణంగా వాళ్లంతా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

నగరంలో దాదాపు ఏడాదిన్నర కిందట కల్తీ ఇంజిన్ ఆయిల్ దందా చేస్తున్న ముఠా గుట్టు బయట పడగా, పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత కొద్దిరోజుల బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న నకిలీ ఆటో పార్ట్స్ విక్రయిస్తున్న గ్యాంగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా పేద, మధ్య తరగతి కుటుంబాలే బాధితులుగా నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. 

డూప్లికేట్ వే ఎక్కువ..

నకిలీలతో దందా చేస్తున్న దుండగులు ఫేక్ ప్రొడక్ట్స్ ను తక్కువ ధరతో తీసుకొచ్చి, మార్కెట్ లో ఒరిజినల్ వస్తువుల రేటుకే అమ్ముతున్నారు. దాదాపు 50 శాతం వరకు లాభాలు వస్తుండటంతో వ్యాపారులు డూప్లికేట్ వస్తువులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. బ్రాండెడ్​కంపెనీల పేర్లు, స్టిక్కర్లతో మార్కెట్లో అసలు కంటే నకిలీవే ఎక్కువగా ఉంటున్నాయి. అక్రమార్జన కోసం జనాలను మోసం చేస్తున్న దుండగులపై పీడీ యాక్టులు పెట్టాలని నగర ప్రజలు డిమాండ్​చేస్తున్నారు.