బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా .. కార్మిక సంఘాల లీడర్లు ఆందోళన

  • కరీంగర్‌‌‌‌, పెద్దపల్లి, -మంచిర్యాల కలెక్టరేట్లను ముట్టడించిన కార్మిక సంఘాల లీడర్లు
  • గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌‌‌‌

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌/కరీంనగర్‌‌‌‌ టౌన్‌‌‌‌/పెద్దపల్లి/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బొగ్గు బ్లాక్‌‌‌‌ల వేలాన్ని నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంచిర్యాల, కరీనంగర్‌‌‌‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లను ముట్టడించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సింగరేణికి కొత్త బ్లాక్‌‌‌‌లు కేటాయించకపోతే కంపెనీ మనుగడ కష్టం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015లో ఎంఎండీఆర్‌‌‌‌ చట్టాన్ని మార్చి బొగ్గు గనులను కోల్‌‌‌‌ ఇండియా, సింగరేణికి కాకుండా ప్రైవేట్‌‌‌‌ వారికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.

ఈ బిల్లుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు సైతం మద్దతు పలికారని, అందుకే కేంద్రం తెలంగాణలోని బొగ్గు గనులను నామినేషన్‌‌‌‌ విధానంలో కేటాయించకుండా వేలం వేస్తోందని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ కేంద్ర ప్రభుత్వంతో కలిసి సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌‌‌‌లను తమ అనుకూల సంస్థకు చెందేలా చేయడంతో పాటు, సింగరేణి వేలంలో పాల్గొనకుండా అడ్డుకుందని ఆరోపించారు. కోయగూడెం ఓసీపీ-3, సత్తుపల్లి ఓసీపీలను బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన అరబిందో, అవంతిక అనే ప్రైవేట్‌‌‌‌ కంపెనీలు దక్కించుకున్నాయని, ఆ సంస్థలు ఇప్పటివరకు గనుల తవ్వకాన్ని ప్రారంభించలేదన్నారు.

ఆ రెండు గనుల వేలం రద్దు చేయడంతో పాటు తెలంగాణలోని మిగిలిన బ్లాక్‌‌‌‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని తమ యూనియన్‌‌‌‌ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్‌‌‌‌ రాసిందన్నారు. తెలంగాణకు తలమానికమైన బొగ్గు బ్లాక్‌‌‌‌లను వేలం వేయడం అంటే తెలంగాణ తల నరికేసి మొండాన్ని మిగల్చడమేనన్నారు. ప్రధాని మోదీ రామగుండంలో పర్యటించిన టైంలో సింగరేణిని వేలం వేయబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. బొగ్గుల బ్లాక్‌‌‌‌ల రద్దు కోసం తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు పోరాటం చేయాలని సూచించారు.

బొగ్గు గనులను నామినేషన్‌‌‌‌ విధానంలో సింగరేణికే కేటాయించాలని, ఇందుకు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి చొరవ చూపాలని డిమాండ్​ చేశారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సీపీఐ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో 12 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఆయా జిల్లాల అడిషనల్‌‌‌‌ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. మంచిర్యాలలో సింగరేణి కాలరీస్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ (ఏఐటీయూసీ) స్టేట్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్‌‌‌‌, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌‌‌‌, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌‌‌‌ సెక్రటరీ వీరభద్రయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్‌‌‌‌ అలీ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచ్‌‌‌‌ సెక్రటరీలు ఎస్‌‌‌‌కే. బాజీసైదా

 సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి , సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గీట్ల ముకుందరెడ్డి, సీపీఐఎంఎల్‌‌‌‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు కల్యాడపు ఆగయ్య, భద్రాద్రి కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్​ వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఎంప్లాయీస్ యూనియన్‌‌‌‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, ఇఫ్టూ నేతలు యాకూబ్​షావళి, రాంసింగ్​ పాల్గొన్నారు. 

సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట దీక్ష

సింగరేణి సర్వే చేసిన శ్రావణపల్లి కోల్‌‌‌‌బ్లాక్‌‌‌‌ను ఆ సంస్థకే కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ సింగరేణి ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట శుక్రవారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం లీడర్లు మాట్లాడుతూ బొగ్గు బ్లాకులను నామినేషన్​ పద్ధతిలో సింగరేణికి ఇవ్వకపోతే బీజేపీ ప్రభుత్వం కార్మికుల ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. వేలం నుంచి శ్రావణపల్లి బ్లాక్‌‌‌‌ను తొలగించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. దీక్షల్లో అంతోటి నాగేశ్వరరావు, సింగరేణి రిటైర్డ్​జీఎం పర్సనల్‌‌‌‌ ఆనందరావు, నాయకులు బందెల విజేందర్, మధుసూదనరావు, సురేశ్, చక్రపాణి, శ్రీనివాస్ పాల్గొన్నారు.