కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా ..ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది.ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళలను ఆస్పత్రికి తరలించారు. 

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల శివారులో వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటో ట్రాలీ ప్రమాదవశాత్తున బోల్తా పడి ఓదెలకు చెందిన ఆరుగురు మహిళ కూలీలు గాయాలకు గురయ్యారు.మడక వైపు ఉన్న బోడకుంట అనిల్ అనే రైతు పొలంలో కలుపు తీయడానికి పది మంది మహిళ కూలీలు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి ఆటో ట్రాలీలో వస్తుండగా ఓదెల శివారులో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బ్రేక్ వేయడంతో ఒక్కసారి ట్రాలీ బోల్తా కొట్టింది. 

ట్రాలీలో ఉన్న పదిమంది కూలీల్లో బోడకుంట వనిత, బుద్దె శ్రీలత, లగిశెట్టి శ్రీనివాస్, బోడకుంట సమ్మక్క, బోడకుంట అనూష, గటికె సరోజనలకు గాయాలు కాగ, ఇందులో బుద్దె శ్రీలత, బోడకుంట వనిత, లగిశెట్టి శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి.గాయాలైన క్షతగాత్రులను గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.