రాహుల్‎పై ఈగ వాలినా ఊరుకోం.. బీజేపీ నేతలకు మహేష్ గౌడ్ వార్నింగ్

కరీంనగర్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీపై ఈగ వాలినా ఊరకోమని బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సే మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ (సెప్టెంబర్ 18) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‎లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డి దారిన ఎంపీ అయినా వ్యక్తి కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం దారుణమని చురకలంటించారు. బీజేపీ నేతల తీరుతో దేశంలో రాజకీయాలు దిగజారుతున్నాయని.. ఆ పార్టీ నాయకులు దేవుడి పేరిట, మతం పేరిట ఓట్లు అడిగి దేశాన్ని చీల్చుతున్నారని ధ్వజమెత్తారు. 

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడైనా రాహుల్ గాంధీపై ఇలాంటి కామెంట్స్ చేసిన బీజేపీ నేతలపై ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్రపతి యాక్షన్ తీసుకోవాలని కోరారు. గుండు సూది తయారు కానీ ఈ దేశాన్ని.. రాకెట్లు తయారు చేసే స్థాయికి తీసుకెళ్లింది కాంగ్రెస్ త్యాగధనుల చలవేనని విషయం బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ దేశ భవిష్యత్ అని.. ఆయనను ఒక్క మాట అన్న ఊరుకునేదే లేదని బీజేపీ నేతలను హెచ్చరించారు.