కాంగ్రెస్​తో అన్ని వర్గాలకు రక్షణ

  • ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేదే బీఆర్ఎస్..

  • మత రాజకీయాల బీజేపీని నమ్మొద్దు: మహేశ్​కుమార్​గౌడ్​

  • బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్​లోనే గుర్తింపు

  • పీసీసీ, డీసీసీల్లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తం

  • పీసీసీ చీఫ్​ పదవి ఊహించలే

  • నిజామాబాద్ స్వాగతసభలో వ్యాఖ్య

నిజామాబాద్, వెలుగు: ఎలాంటి పొలిటికల్ బ్యాక్​గ్రౌండ్​లేని తాను పీసీసీ మాజీ ప్రెసిడెంట్ డి.శ్రీనివాస్ ప్రోద్బలంతో స్టూడెంట్ లీడర్​గా రాజకీయాలలో చేరి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి చేరానని బొమ్మ మహేశ్​కుమార్ గౌడ్ అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, కష్టసుఖాలు, పరాభవాలు ఎదుర్కొనన్నానని తెలిపారు. ఇప్పుడన్నీ వడ్డీతో సహా లభిస్తున్నట్లుగా ఉందన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ అవుతానని కలలో కూడా ఊహించలేదని, కష్టపడే కార్యకర్తలకు అందునా బడుగు, బలహీనవర్గాలను అందలం ఎక్కించే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్నారు. 

శుక్రవారం పీసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారి ఇందూరు వచ్చిన మహేశ్​కుమార్ గౌడ్​ను జిల్లా పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఆగర్భశ్రీమంతుడైన నెహ్రూ ప్రజల కోసం 14 ఏండ్లు జైలుకు వెళ్లారని, ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. త్యాగాల కుటుంబ నేపథ్యంగల కాంగ్రెస్​లో సభ్యత్వం కలిగి ఉండడం తనకు గర్వకారణమని, ఈ భావన పార్టీలోని ప్రతి కార్యకర్తలో ఉంటుందన్నారు. 

పదవులకు అంతా అర్హులే

పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో తన జీవితం ధన్యమైందని మహేశ్​గౌడ్​అన్నారు. అయితే మధు యాష్కీ గౌడ్, అంజనీ కుమార్ తదితరులు ఈ పదవిని ఆశించారని తెలిపారు. పదవులు పొందే అర్హతగల లీడర్లు పార్టీలో చాలా మంది ఉన్నారని ఇది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనన్నారు. హైకమాండ్ నిర్ణయం ఒక్కసారి ప్రకటితమయ్యాక గౌరవించే సంస్కృతి లీడర్లందరిలో ఉంటుందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని వారి కష్టం, నష్టం, రక్తంతో పదేండ్ల తరువాత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు కార్యకర్తలను అందలం ఎక్కించే టైం వచ్చిందన్నారు. స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టులతో పాటు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్​లో సర్పంచ్ మొదలు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా కార్యకర్తలను గెలిపించుకుంటామన్నారు. పీసీసీ, డీసీసీ పోస్టులలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రయారిటీ ఇస్తామన్నారు.

సీఎం రేవంత్​తో కెమిస్ట్రీ బాగుంది

 పీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్​గా తాను అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేశామని తమ మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడం వల్ల ఎక్కడ మెప్పించాలో, ఎక్కడ ఒప్పించాలో గ్రహించి ప్రజలకు ఐక్యతా సంకేతాలు పంపామని మహేశ్​గౌడ్ అన్నారు. ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మరో పదేండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందన్నారు. అధికారం ఉండొచ్చు, పోవచ్చు, మళ్లీ మళ్లీ రావచ్చు.. కానీ పార్టీ మాత్రం ఎప్పటికీ శాశ్వతమన్నారు. 2028 ఎన్నికలలో మరోసారి కాంగ్రెస్​ను అధికారంలోకి తేవడమే కాకుండా రాహుల్​గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి రాష్ట్రం వాటా అందిస్తామన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన మల్లిఖార్జున్​ఖర్గేను ఏఐసీసీ ప్రెసిడెంట్​గా బీసీ వర్గానికి చెందిన తనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించి హైకమాండ్ గౌరవించిందన్నారు. మంత్రులతో కలిసి నిజామాబాద్​ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. 

కార్యకర్తలే పట్టుగొమ్మలు: దీపాదాస్ మున్షీ

కాంగ్రెస్​కు కార్యకర్తలే పట్టుగొమ్మలని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్​చార్జ్ దీపాదాస్​ మున్షి అన్నారు. భుజాన జెండాలు మోసి పార్టీని అధికారంలోకి తెచ్చారని కొనియాడారు. రానున్న లోకల్​ బాడీ ఎలక్షన్​లో పార్టీని గెలిపించి సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీర్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు పొరంబోకు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ రాలేదన్నారు. ముఖం చాటేసే వారికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ..​పీసీస చీఫ్ మహేశ్​గౌడ్​ సొంత జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్​ ప్రచార కమిటీ చైర్మన్​ మధుగౌడ్​ యాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పేరును జిల్లా మెడికల్ కాలేజీకి పెట్టాలని కోరారు. జిల్లా పార్టీ ఆఫీస్​కు భవనం నిర్మించాలని ఇందుకు తన వంతుగా రూ.5 లక్షల విరాళం ఇస్తానన్నారు.

అప్పుల కుప్ప చేసి ఫామ్​హౌస్​లో పడుకుండు

గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి దివాళా తీయించిందని మహేశ్​గౌడ్​ విమర్శించారు. అంతా నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్​కు పరిమితమయ్యారన్నారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేసే బీఆర్ఎస్​ పనిఖతమైందన్నారు. రాహుల్​గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్​ది కాదన్నారు. కులమతాలకు రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదని మతం మాటున బీజేపీ చేసే రాజకీయాలు వినాశకరమన్నారు. శ్రీరాముడు బీజేపీ కంటే వేల ఏండ్లు ముందు పుట్టారని.. ప్రజల జీవితాలతో ఆడుకునే బీజేపీని, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే బీఆర్ఎస్​ను ఎప్పటికీ నమ్మొద్దన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణంతో కూడిన రాజకీయాలు అందించే బాధ్యత ప్రతిపౌరుడిపై ఉందన్నారు.