బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్

నిజామాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. నూతనంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్‎ను ఇవాళ (అక్టోబర్ 4) నిజామాబాద్‎లో కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారని.. మతం, కులం, శ్రీరాముడు, హనుమంతుడు పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. పెద్ద పెద్ద కంపెనీలను వాళ్ల మిత్రులు అదానీ, అంబానీకి కట్టబెట్టారన్నారు. ఇక, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పులు పాలు చేసి ఫామ్ హౌస్‎కు  పరిమితం అయ్యారని విమర్శించారు.

ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి వరకు మధు యాష్కీ గౌడ్, నేను ఆహ్లాదకరమైన పోటీపడ్డామని.. ఆఖరి వరకు పోటీ ఉన్న చివరకు కలిసి పోయే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందన్నారు. మధు యాష్కీ గౌడ్ నాకు పెద్దన్న లాంటి వారని అన్నారు. ఊహ తెలియని సమయంలో ఇందిరా గాంధీగారితో  ఫొటో దిగానని, యూత్ కాంగ్రెస్‎లో రాజీవ్ గాంధీతో కలిసి పని చేశానని ఈ సందర్భంగా గుర్తు  చేసుకున్నారు. 

సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సాన్నిహిత్యం ఉందన్నారు.  దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని ప్రశంసించారు. రాజకీయ విభేదాలు ఉన్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీఎస్ నా రాజకీయ గురువేనని స్పష్టం చేశారు. నేను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, మాది వ్యవసాయ కుటుంబమని తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతం నుంచి నిజామాబాద్‎కు వచ్చానని పేర్కొన్నారు. రాజకీయాల్లో పని చేసుకంటూ పోతే అవకాశం వస్తుందని.. దానికి నేనే నిదర్శమని అన్నారు. 

38 ఏళ్లలో పదవుల కంటే కష్టాలు, నష్టాలే ఎక్కువ చవి చూశానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నాకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. కార్యకర్తల్లో ఎక్కడో కొంత నైరాష్యం ఉందని.. రాబోయే రోజుల్లో కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని కేడర్‏లో భరోసా నింపారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారి జీవితాలో వెలుగులు నింపుతామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కష్టపడే కార్యకర్తలను గుర్తింపు ఇస్తామన్నారు.