అయోధ్యలో హోటళ్లు ఫుల్.. న్యూ ఇయర్ సందర్భంగా పోటెత్తిన టూరిస్టులు

అయోధ్య (యూపీ): అయోధ్యలో హోటళ్లన్ని ఫుల్ అయ్యాయి. కొత్త సంవత్సరం వస్తుండటంతో భక్తులు, పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. నూతన సంవత్సరం, అలాగే బాలరాముడు కొలువుదీరి ఏడాది పూర్తి కావొస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో నిర్వహణ లోపాలు తలెత్తకుండా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌‌‌‌‌‌‌  విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. దర్శన వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే జనవరి 15 వరకు అయోధ్య, ఫైజా బాద్‎లోని హోటల్ గదులన్ని బుక్ అయ్యాయి. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదులు అందుబాటులో ఉన్నాయి. దీన్నే అవకాశంగాతీసుకున్న కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత స్థలాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు అయోధ్య పోలీసులు చెప్పారు.