సూర్యాపేటలో కూల్చివేతలు ఉండవు 

  • తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి  

సూర్యాపేట, వెలుగు :  జిల్లా కేంద్రంలో ఎలాంటి కూల్చివేతలు ఉండవని, ప్రజలెవరూ భయపడాల్సిన అసవరం లేదని టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, జిల్లాలో పేదల ఇండ్లు కూల్చివేత జరగదని స్పష్టం చేశారు. సూర్యాపేటకు హైడ్రాతో సంబంధం లేదని, హైడ్రా కేవలం ఓఆర్ఆర్ లోపల మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. సూర్యాపేటలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవన్నారు.

బీఆర్ ఎస్ నాయకులు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులైనవారికి ఇందిరమ్మ ఇండ్లు, తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తుందని తెలిపారు.