ఇంట్లో ఒక వంటకం గురించి చెప్పాలంటే దాన్ని వండిన అమ్మ కంటే ఎవరూ బాగా చెప్పలేరు. అలాగే ఒక వస్తువు గురించి కూడా దాన్ని తయారుచేసిన వాళ్లే అర్ధమయ్యేలా చెప్పగలరు.ఈ స్ట్రాటజీ ఎండీహెచ్ కంపెనీ సక్సెస్‌కు కారణమైంది. ఈ కంపెనీ చేసిన అడ్వర్టైజ్మెంట్లో ఆ ప్రొడక్ట్ గురించి దాని ఫౌండర్ వివరించి చెప్తాడు. ఆ ప్రకటన ఎంతలా ఫేమస్ అయ్యిందంటే.. ఆయన ఎక్కడైనా బయటికి వెళ్తే ఆయన పేరుతో కంటే ‘‘ఎండీహెచ్ వాలే అంకుల్” అనే ఎక్కువమంది పిలిచేవాళ్లు! ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఎన్నో మార్కెటింగ్ స్ట్రాటజీలు, క్వాలిటీ ప్రొడక్ట్స్‌తో దేశంలో టాప్ బ్రాండ్స్‌లో ఎండీహెచ్‌ని టాప్‌లో నిలిపాడు మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి.
ప్రపంచంలో ఏ కంపెనీ అయినా.. కొన్నేండ్లు మార్కెట్‌లో నిలబడి ఉండగలిగిందంటే దానికి ముఖ్య కారణం ప్రొడక్ట్ క్వాలిటీ, మార్కెటింగ్. సరిగ్గా ఈ రెండింటి మీదే ఫోకస్ పెట్టి దేశంలోని టాప్ కంపెనీల లిస్ట్‌లో చేరింది ఎండీహెచ్(మహాషియాన్ డి హట్టి ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ. ఈ కంపెనీని పెట్టింది, డెవలప్ చేసింది మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి. అయితే ఆ కంపెనీ నడిపేందుకు కావాల్సిన నాలెడ్జ్ వాళ్ల నాన్న నుంచే వచ్చింది.
అతని తండ్రి మహాశయ్ చున్నీలాల్, తల్లి మాతా చనన్ దేవి ఒకప్పటి పంజాబ్(ప్రస్తుతం పాకిస్తాన్)లోని సియాల్‌కోట్‌లో ‘మహాషియాన్ డి హట్టి’ పేరుతో ఒక మసాలా దుకాణం నడిపేవాళ్లు. సియాల్‌కోట్‌లో బాగా స్థిరపడిన కుటుంబాల్లో వీళ్లది ఒకటి. అక్కడ వాళ్ల బలగం కూడా ఎక్కువే. ఆ నెట్‌వర్క్ వల్లే వాళ్ల టౌన్‌లో మసాలాలు అమ్మటంలో టాప్‌గా ఎదిగారు. అలాంటి కుటుంబంలో 1923 మార్చి 27న అందరూ ప్రేమగా ‘‘ఎండీహెచ్ వాలే అంకుల్”అని పిలుచుకునే ధరమ్‌పాల్ పుట్టాడు.
చదువుకు ఫుల్‌స్టాప్
చున్నీలాల్, చనన్ దేవి దంపతులు ధరమ్పాల్ని బాగా చదివించాలి అనుకున్నారు. కానీ.. అతనికి అంతగా చదువు అబ్బలేదు. దాంతో పదేండ్ల వయసులో ఉన్నప్పుడే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. చిన్న వయసులోనే ధరమ్‌పాల్ వ్యాపారంలోకి దిగి, నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మొదట్లో బట్టల వ్యాపారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
అది కలిసి రాకపోవడంతో హార్డ్‌వేర్ బిజినెస్ మొదలుపెట్టాడు. అందులోనూ సక్సెస్ రాలేదు. పట్టు వదలకుండా బియ్యం వ్యాపారంలోకి దిగాడు. చాలా కష్టపడ్డాడు. అయినా.. నష్టాలే ఎదురయ్యాయి. ఇక చేసేదేమీ లేక తండ్రి సాయం అడిగాడు.కొడుకుని ఆదుకోవాలని చున్నీలాల్ అతనికి అద్దాలు అమ్మడం, సబ్బులు తయారు చేయడం లాంటివి నేర్పించి, బిజినెస్ పెట్టించాడు. అందులోనూ ధరమ్‌పాల్‌కు రూపాయి మిగల్లేదు. విసిగిపోయిన ధరమ్‌పాల్ కుటుంబ వారసత్వంగా వస్తున్న మసాలా వ్యాపారంలోనే సెటిలవ్వాలి అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి చూడడం వల్ల మసాలా బిజినెస్ ఎలా నడపాలనేది ధరమ్‌పాల్‌కు బాగా తెలుసు.
అందుకే ఆ వ్యాపారంలో సక్సెస్ కావడానికి అతనికి ఎక్కువ టైం పట్టలేదు. ధరమ్ మసాలా వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేండ్లలోనే బిజినెస్‌ని చుట్టు పక్కల పట్టణాలకు విస్తరించాడు. లాహోర్, ముల్తాన్, షేక్‌పురా, ననకానా సాహిబ్, లియాల్‌పూర్ లాంటి ప్రాంతాల్లో మసాలా దినుసులను అమ్మడం మొదలుపెట్టాడు. ధరమ్‌పాల్ సక్సెస్ అయ్యాననే సంతోషంలో ఉన్న టైంలోనే... 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ విభజన జరగడంతో కోలుకోలేని దెబ్బ తగిలినట్టు అయ్యింది.
టాంగా నడిపాడు
సియాల్‌కోట్‌లో అతని వ్యాపారం బాగానే ఉన్నా.. స్వాతంత్ర్యం వచ్చాక ఇండియాకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉన్నఫళంగా అన్నీ వదిలేసి కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌లోని శరణార్థుల శిబిరానికి చేరుకున్నాడు. అప్పటికే అతని తోబుట్టువు ఒక గవర్నమెంట్ ఉద్యోగిని పెండ్లి చేసుకుని ఢిల్లీలో సెటిల్ అయ్యింది. అందుకే అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి వెళ్లి స్థిరపడ్డారు.
ధరమ్‌పాల్‌కు అతని బావ శరణార్థి స్టేటస్ ఇప్పించాడు. దానివల్ల అతనికి గవర్నమెంట్ నుంచి కొన్ని బెనిఫిట్స్ అందాయి. అప్పటికే ధరమ్‌పాల్ దగ్గర1,500 రూపాయల వరకు ఉన్నాయి. వాటిలో నుంచి 650 రూపాయలు పెట్టి టాంగా(గుర్రపు బండి) కొన్నాడు. అప్పట్లో రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌కి ఎక్కువగా ఇలాంటి బండ్ల మీదే ఆధారపడేవాళ్లు. ఢిల్లీ రైల్వే స్టేషన్, కుతుబ్ రోడ్, కరోల్ బాగ్ ప్రాంతాల్లో టాంగా నడిపేవాడు ధరమ్‌పాల్. ఒకవైపు ట్రావెలింగ్‌కు రెండు అణాలు మాత్రమే తీసుకునేవాడు. అలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. కానీ.. ఎప్పటికైనా మళ్లీ బిజినెస్ చేయాలనే ఆలోచన మాత్రం బలంగా ఉండేది.
షుగర్ బిజినెస్
రోజంతా కష్టపడి టాంగా నడిపిన డబ్బులో కొంత కుటుంబ అవసరాలకు ఇచ్చి, మరికొంత డబ్బు పొదుపు చేసేవాడు. అలా పొదుపు చేసిన డబ్బుతో వ్యాపారం చేయాలి అనుకున్నాడు. కానీ.. ఉమ్మడి కుటుంబం కావడంతో ఖర్చు ఎక్కువయ్యేది. దానికి తోడు సియాల్‌కోట్ నుండి వచ్చిన చాలామంది బంధువులు అతని ఇంటిని వరదలా ముంచెత్తేవాళ్లు. దాంతో సంపాదించిన డబ్బు ఇంటి అవసరాలకు కూడా సరిపోయేది కాదు. అలాగని.. ఖర్చు కోసం బంధువులను దూరం చేసుకోవడం ధరమ్‌పాల్‌కు ఇష్టంలేదు.
అలా చేయడం నైతికంగా తప్పు అనుకున్నాడు. అందుకే ఇంకా ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో చెరకు, చక్కెర అమ్మడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు వాళ్లు ఉంటున్న ఏరియాలో వాటికి డిమాండ్ తగ్గడంతో దుకాణం సర్దేయాల్సి వచ్చింది. జీవితంలో ఎన్నో వైఫల్యాలు చూసిన ఆయనను ఈ నష్టం పెద్దగా బాధపెట్టలేదు. అయితే మసాలా బిజినెస్ తప్ప మరేది పెట్టినా నష్టాలు తప్పవని అర్థమైంది. అందుకే 1948లో మళ్లీ తన కుటుంబ వ్యాపారమైన మసాలాలు అమ్మడం మొదలుపెట్టాలి అనుకున్నాడు. ఎలాగోలా కొంత డబ్బు సమకూర్చుకుని, కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక చిన్న గదిని కొన్నాడు. అందులో దుకాణం పెట్టాడు. అప్పుడు కూడా ధరమ్‌పాల్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. బిజినెస్‌లో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కొనేవాళ్లే లేరు!
దేశం1948 ప్రాంతంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇండియాలో 80 శాతం మంది పేదరికంలో ఉన్నారు. చాలామందికి రెండు పూటలా తిండి దొరకడమే కష్టమైంది. అలాంటి టైంలో ఎక్కువ ధర ఉండే మసాలాలు ఎవరు కొంటారు? అదీకాక వంటకాల్లో మసాలాలను యాడ్–ఆన్ ఫ్లేవర్‌గా వాడతారు. అంతేకానీ.. అవి లేకుండా వంట కాదు అనేందుకు లేదు. ఇంకా చూస్తే మరీ పేదవాళ్లకైతే అది లగ్జరీ ప్రొడక్ట్ లాంటిది. అందుకే మసాలాల అమ్మకాలు చాలావరకు తగ్గిపోయాయి. క్వాలిటీ తగ్గించి, తక్కువ ధరకు అమ్మడానికి ధరమ్‌పాల్ ఒప్పుకోకపోవడం రెండో సవాల్.
తక్కువ ధరకు అమ్మితే మధ్య తరగతి వాళ్లైనా కొనేవాళ్లు. కానీ.. ధరమ్‌పాల్ క్వాలిటీలో రాజీ పడటానికి ఇష్టపడలేదు. ఈ రెండు సమస్యలకు తోడు ఆయనకు మరో సమస్య ఎదురైంది. మార్కెట్‌లో కొనేవాళ్లు తక్కువగా ఉండడంతో మసాలాల ధరలు తగ్గడం మొదలైంది. ధరమ్‌పాల్ కొన్నప్పుడు ఉన్న ధర అమ్మేటప్పటికి తగ్గేది. దాంతో ఫ్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువగా వచ్చింది. ఇలా పలు కారణాల వల్ల దుకాణం చివరకు నష్టాల అంచుకు చేరింది. అయినా బిజినెస్ క్లోజ్ చేయకుండా నడిపాడు.
సక్సెస్‌కు కేరాఫ్
బిజినెస్ పెంచేందుకు తన ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు ధరమ్ పాల్. దాంతోపాటు అప్పటి ప్రముఖ హిందీ వార్తాపత్రిక ‘ప్రతాప్’లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అలా అమ్మకాలు కాస్త పెరిగాయి. కొన్నాళ్లకు ఇండియాలో పరిస్థితులు కూడా చక్కబడ్డాయి. కేవలం ఢిల్లీ వాసులు మాత్రమే కాకుండా సియాల్‌కోట్, ముల్తాన్, పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల నుంచి వలస వచ్చినవాళ్లు ధరమ్‌పాల్ షాపులోనే మసాలాలు కొనేవారు.
కొన్నాళ్లలోనే ఢిల్లీలోని ఖరీ బోలి, గఫార్ మార్కెట్, చాందినీ చౌక్ ప్రాంతాలు ధరమ్‌పాల్ మసాలాల టేస్ట్ చూశాయి. తర్వాత చాందినీ చౌక్ ప్రాంతంలో రెండో స్టోర్‌ని చాలా పెద్దగా ఏర్పాటు చేశాడు. కొద్ది రోజుల్లోనే బిజినెస్ పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఒక్కడే బిజినెస్‌ను చూసుకోలేనంత. కొంతమంది సిబ్బందిని పెట్టుకుని మరిన్ని స్టోర్లు తెరిచాడు. తన ఫ్రెండ్స్‌ని పార్ట్‌నర్స్‌గా చేర్చుకున్నాడు. సప్లయర్స్ ద్వారా చాలా ప్రాంతాల్లో అమ్మకాలు చేశాడు.
ద్రోహం చేయడంతో
ఏ మనిషైనా రోజులో 24 గంటలు పనిచేయలేడు. బిజినెస్ కోసం రోజుకి 12 నుండి 15 గంటల టైం కేటాయించేవాడు ధరమ్‌పాల్. అందుకే.. కొన్నిసార్లు కాంట్రాక్టర్లు, పార్ట్‌నర్స్ మీద ఆధారపడేవాడు. కానీ.. అతని చిన్ననాటి ఫ్రెండ్, బిజినెస్ పార్ట్‌నర్ ఒకతను పసుపును కల్తీ చేసి అమ్మాడు. అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టారు. ఇదంతా సహించలేక.. ఒంటరిగా బిజినెస్ చేయాలి అనుకున్నాడు. ఒకే చోట ప్యాకింగ్ చేసి అన్ని దుకాణాలకు పంపేందుకు1959లో ఢిల్లీలోని కీర్తి నగర్‌లో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాడు. అప్పటినుంచి ధరమ్‌పాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బిజినెస్ బాగా పెరగడంతో1965లో ఎండీహెచ్ పేరుతో కంపెనీ మొదలుపెట్టాడు.
యాడ్స్‌తో ప్రతి ఇంటికీ
దేశంలోని చాలా రాష్ట్రాలకు సప్లయ్ చెయిన్ బిల్డ్ చేశాడు. సేల్స్ పెంచాలనే ఉద్దేశంతో టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు. అయితే.. అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ కోసం తీసుకున్న లీడ్ యాక్టర్ టైంకి రాలేకపోయాడు. దాంతో ఆయన స్థానంలో ధరమ్‌పాల్ నటించాడు. సాధారణంగా భారతీయుల ఇండ్లలో వయసుపైడిన వాళ్లు సలహాలు ఇస్తుంటారు. అందరూ వాటిని పాటిస్తుంటారు.
అందుకే పెద్దవాడు కావడంతో ఆ యాడ్‌లో ధరమ్పాల్ని చూసినప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యారు. యాడ్ ఫుల్ సక్సెస్ అయ్యింది. ధరమ్‌పాల్ ముఖం అందరికీ పరిచయమైంది. టీవీ యాడ్స్ వల్ల లాభాలు బాగా పెరిగాయి. బ్రాండ్ వ్యాల్యూ 10,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఒక అంచనా. ఇప్పుడు మొత్తం టర్నోవర్ 2,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే. కంపెనీ 62 రకాల మసాలా దినుసులను మార్కెట్‌లో అమ్ముతోంది. నాలుగు లక్షలకు పైగా రిటైలర్ల నెట్‌వర్క్ ఉంది.
ఢిల్లీ, ఘజియాబాద్, గుర్గావ్, నాగౌర్, సోజత్, అమృత్‌సర్, లూథియానాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా లాంటి ప్రాంతాల్లో కూడా ప్రొడక్షన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలోని మసాలాల మార్కెట్‌లో ఎండీహెచ్ రెండో అతిపెద్ద కంపెనీ. మొత్తం మార్కెట్‌లో దాదాపు12 శాతం ఆక్రమించింది. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పసుపు, బిర్యానీ, చికెన్ మసాలాలు ఎక్కువగా అమ్ముతున్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ లాంటి అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆగ్నేయాసియాలోని జపాన్, యూఏఈ, చైనా, మలేసియా, వియత్నాంతోపాటు ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌కు కూడా మసాలాలు పంపుతున్నారు.
ధర్మం మరిచిపోలేదు
ఎన్ని విజయాలు సాధించినా ధరమ్‌పాల్ ధర్మ మార్గంలోనే నడిచాడు. ఎన్నో స్కూల్స్, హాస్పిటల్స్ స్థాపించాడు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లిళ్లకు సాయం చేశాడు. ‘మహాశయ్ చున్నీలాల్ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్’ పేరుతో 20కి పైగా స్కూల్స్ నడుస్తున్నాయి. న్యూఢిల్లీలోని సుభాష్ నగర్‌లో ఉన్న ఆర్యసమాజ్‌లో కంటి ఆసుపత్రిని స్థాపించాడు. తన తల్లి, మాతా చనన్ దేవి జ్ఞాపకార్థం.. న్యూఢిల్లీలోని జనక్‌పురిలో 20 పడకల హాస్పిటల్ ఏర్పాటుచేశాడు. ఈ హాస్పిటల్‌లో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, హార్ట్ వింగ్, న్యూరో సైన్సెస్, ఐవీఎఫ్ వంటి సౌకర్యాలతో 300 పడకలు ఉన్నాయి ఇప్పుడు. పేద ప్రజలకు ఈ ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్‌మెంట్ చేస్తారు. .