టూల్స్ గాడ్జెట్స్‌ : మ్యాగ్నెటిక్ క్లీనర్

మ్యాగ్నెటిక్ క్లీనర్

చాలామంది ఇండ్లలో అద్దాల కిటికీలు కనిపిస్తుంటాయి. కొందరు బాత్​రూమ్​లకు కూడా గ్లాస్ డోర్స్ పెట్టించుకుంటారు. అద్దాల ఫ్యాషన్ బాగానే ఉంటుంది.. కానీ, వాటిని క్లీన్ చేయాలంటేనే కాస్త కష్టం. గ్లాస్​ ముందు, వెనక రెండు వైపులా క్లీన్ చేయాలంటే రెండుసార్లు తుడవాల్సి వస్తుంది. అయితే, ఈ వైపర్​ ఉంటే అద్దాలు క్లీన్ చేయడం చాలా తేలిక. ఎందుకంటే ఇది రెండు వైపులా ఒకేసారి క్లీన్ చేసేస్తుంది. ఎలాగంటే.. దీనికి మాగ్నెటిక్​ ఫీచర్​ ఉంటుంది.

డబుల్ సైడ్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూసేందుకు ట్రయాంగిల్​ షేప్​లో ఐరన్​ బాక్స్​లా కనిపిస్తున్న ఈ క్లీనర్​ రెండు భాగాలుగా అతుక్కుని ఉంటుంది. రెండింటినీ విడదీశాక, వాటిలో వైప్స్ పెట్టి, జెల్​ వేసి ఒకదానితో ఒకటి రుద్దాలి. తరువాత ఒక దారాన్ని రెండు విడిభాగాలకు అటాచ్ చేసి కట్టాలి. లోపల ఒకటి, బయట ఒకటి ఉంచాలి. అవి రెండూ అయస్కాంతంలా అతుక్కోగానే.. ఒకవైపు నుంచి  అద్దాన్ని తుడవడం మొదలుపెట్టాలి. దాంతో రెండో వైపు ఆటోమెటిక్​గా క్లీన్​ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల టైం సేవ్​ అవుతుంది. పని అయ్యాక వైప్స్ తీసేసి, కొత్తవి పెట్టాలి. 

ధర : రూ.395 /–

ఒవెన్ స్టీమ్ ...

ఈమధ్య ఇళ్లలో ఒవెన్ల వాడకం పెరిగింది. మరి ఒవెన్​ను ఎలా శుభ్రం చేస్తున్నారు? లోపల పేరుకున్న మరకలు శుభ్రం అవుతున్నాయా? లోపల వాసన ఏమైనా వస్తుందా? ఇలాంటివన్నీ చెక్​ చేసుకోవాలి. అలాగని ప్రతి వస్తువుకు కొంత టైం కేటాయించి క్లీన్ చేయాలంటే అందరికీ కుదరదు. అందుకే స్మార్ట్​గా క్లీన్​ చేసుకునేందుకు యాంగ్రీ మామా అందుబాటులో ఉంది. యాంగ్రీ మామా అంటే.. కోపంగా ఉన్న అమ్మ అని అర్థం. ఈ వస్తువు కూడా చూడ్డానికి అలాంటి ఎక్స్​ప్రెషన్​తో ఉంటుంది. యాంగ్రీ మామా బొమ్మ తల ఓపెన్ చేస్తే దాని లోపల క్లీన్ చేసేందుకు నీళ్లు, నిమ్మరసం, వెనిగర్ వంటివి వేయొచ్చు.

ఇలా లిక్విడ్ నింపాక మూత పెట్టేసి దాన్ని ఒవెన్​లో పెట్టి, ఏడు నిమిషాలు అందులో ఉంచాలి. అప్పుడు బొమ్మ తలపై ఉన్న రంధ్రాల నుంచి స్టీమ్ బయటకు వస్తుంది. ఆ తర్వాత క్లాత్​తో తుడవాలి. అంతే.. ఒవెన్​ శుభ్రం అయిపోతుంది. యాంగ్రీ మామా బొమ్మను క్లీన్​ చేయడం కూడా ఈజీనే. కాకపోతే లిక్విడ్​గా పైన చెప్పినవే వాడాలి. కెమికల్స్ అస్సలు వాడకూడదు. దీన్ని తయారుచేసిన బ్రాండ్ స్పార్డర్.

ధర : రూ. 198/–

మల్టీ ఫంక్షనల్ బాటిల్ బ్రష్​

పిల్లలకు పాలు పట్టించే బేబీ ఫీడింగ్ బాటిల్స్ నుంచి స్కూలు, కాలేజీ, ఆఫీస్​లకు తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ వరకు.. శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వీటిని క్లీన్ చేయాలంటే.. కాస్త ఓపిక ఉండాలి. ఎందుకంటే బాటిల్ సైజ్ చిన్నగా ఉండొచ్చు.. వాటి మూతలు వెరైటీగా ఉండొచ్చు.. లోపల ఏదైనా పేరుకుపోవచ్చు. మరి ఇలాంటి సమస్యలన్నీ దాటి వాటిని క్లీన్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే మల్టీఫంక్షనల్ క్లీనింగ్ బ్రష్​ వాడడం బెటర్. ఇందులో మూడు భాగాలుంటాయి. ఒక్కో పార్ట్​ ఒక్కోలా ఉపయోగపడుతుంది.

జుప్టిక్స్ బ్రాండ్​కు చెందిన ప్లాస్టిక్ స్పాంజ్ బ్రష్​ ఇది. దీంతో బాటిల్​తో పాటు రకరకాల కంటెయినర్స్​ క్లీన్ చేయడానికి కూడా వాడొచ్చు. బాటిల్​ మూతి దగ్గర పేరుకున్న మలినాలను తొలగించడానికి సిలికాన్ కప్​ కవర్ క్లీనింగ్ బ్రష్​ దీనికి అటాచ్​ అయి ఉంటుంది. బ్రష్​ వాడాలంటే దాన్నుంచి విడదీయాలి. అలాగే బాటిల్ మూత క్లీన్ చేయాలంటే బ్రిస్టల్ బ్రష్ వాడొచ్చు. దాంతో మూలల్లో చేరిన మలినాలు కూడా పోతాయి. మొత్తంగా ఈ బ్రష్​ బేబీ బాటిల్స్​ మాత్రమే కాదు.. టీ , కాఫీ, నూనె వంటి మరకలను కూడా తొలగించడంలో సాయపడుతుంది. 

ధర : రూ.199/–

ఫ్యాన్​ ఫ్రెండ్లీ డస్టర్

ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని ఫ్యాన్‌లు కూడా ఉంటాయి. ఏసీ, కూలర్​లు ఇంట్లో ఉన్నా.. ఫ్యాన్లు వాడడం మామూలే. కానీ, వాటిని క్లీన్ చేయాలంటేనే ఇబ్బంది. అవి అందనంత ఎత్తులో ఉండడం వల్ల క్లీనింగ్​ కాస్త కష్టం. అందుకే ఇలాంటి స్మార్ట్​ డస్టర్​ ఉంటే పని ఈజీ అయిపోతుంది. వైవీవైవీ అనే బ్రాండ్​ ప్రొడక్ట్​ ఇది. దీన్ని మైక్రో ఫైబర్ ఫెదర్ డస్టర్ అంటారు. మృదువుగా ఉండే ఈ మెటీరియల్ చూడ్డానికి నిటారుగా కనిపిస్తున్నా..

ఫ్యాన్ రెక్కలు తుడిచేందుకు వంచేయొచ్చు. దీన్ని వేరే వస్తువులను శుభ్రం చేసేందుకు కూడా వాడొచ్చు. ఫ్యాన్ తుడిచేందుకు డస్టర్​ హ్యాండిల్​ను పైకి లాగాలి. అంటే అచ్చం గొడుగులా దీన్ని ఆపరేట్ చేయొచ్చన్నమాట. హ్యాండిల్​ని రొటేట్ చేస్తూ వాడొచ్చు. పని పూర్తయ్యాక, వేడి లేదా గోరు వెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆరాక హ్యాంగర్​కు తగిలించేయొచ్చు. 

ధర : రూ. 176/–