కొందరు కాస్త సమయం దొరికినా చాలు నిద్రపోతారు. అయితే ఎక్కువ సమయం నిద్రపోవడం మంచిది కాదని పరిశోధనల్లో తేలింది. ఎక్కువగా నిద్రపోయేవాళ్లు భవిష్యత్లో మధుమేహం, స్థూలకాయం, తలనొప్పి, వెన్నునొప్పి, గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారని వైద్యులు చెబుతున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ నిజాలు వెల్లడయ్యాయి.
'చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే, అధికంగా నిద్రపోయేవాళ్లు కూడా ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు. మామూలుగా అయితే ప్రతి వ్యక్తికి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అయితే, కొంతమంది అంతకుమించిన టైం నిద్రపోతారు. తొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవటం వల్ల శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి.
అంతేకాకుండా పది గంటల కంటే ఎక్కువగా నిద్రించేవాళ్లు ఎప్పుడూ నీరసంగా, ఉత్సాహం కోల్పోయినట్లుగా ఉంటారు" అని పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా నిత్యం తొమ్మిది గంటల కన్నా ఎక్కువగా నిద్రపోవడం.. మద్యం, సిగరెట్ తాగడం కన్నా రెండింతలు ప్రమాదమని చెప్పారు.