- రైతుకు దక్కేది రూ. 4 నుంచి ఐదు రూపాయలే..
- లోకల్‌గా దిగుబడి పెరగడంతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు
- నష్టాలపాలవుతున్న రైతులు
వరంగల్/మహబూబ్‌నగర్, వెలుగు : ఆరు నెలల కింద కిలో రూ. 140 వరకు పలికి రైతులకు కాసులు, ప్రజలకు చుక్కలు చూపిన టమాట.. ప్రస్తుతం అదే రైతులను నష్టాలపాలు చేస్తూ, ప్రజలకు మాత్రం సంతోషాన్ని పంచుతోంది. టమాట రేట్లు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రస్తుతం కిలో టమాట రూ. 10 లోపే దొరుకుతోంది. పది కిలోలు కొంటే మరో రూ. 2 తగ్గించి ఎనిమిది రూపాయలకే ఇస్తున్నారు. రాష్ట్రంలో టమాట దిగుబడి పెరగడం వల్లే రేట్లు భారీగా తగ్గిపోయాయని, భవిష్యత్‌తో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
జూన్, జులైలో కిలో టమాట రూ.140
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో టమాట రేట్లు భారీ స్థాయిలో పెరిగాయి. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాట దిగుబడి తక్కువ ఉండడానికి తోడు, తుఫాన్ల కారణంగా సాగు తగ్గింది. దీంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పంటను దిగుబడి చేసుకోవడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. దిగుబడి ఎక్కువగా లేకపోవడంతో కిలో టమాటను రూ.140 వరకు అమ్మారు. జూన్ రెండో వారంలో కిలో రూ.40 వరకు అమ్మగా.. మూడో వారానికి రూ.90 చేరింది. నాలుగో వారంలో రూ.100 చొప్పున ఉండగా.. జులై మొదలయ్యేనాటికి కేజీ రూ.140కి చేరింది. దీంతో టమాట కొనేందుకు వెళ్లిన ప్రజలకు చుక్కలు కనిపించగా, రైతులకు మాత్రం లాభాలు వచ్చిపడ్డాయి.
క్రమేపీ తగ్గుతూ...
ఈ సారి రాష్ట్రంలో వర్షాలు భారీస్థాయిలో పడడంతో రైతులు విరివిగా టమాట సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాల్లోనే టన్నుల కొద్దీ టమాట మార్కెట్లకు వస్తుండడంతో రేటు క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఆగస్టు చివరి వారం వరకు కిలో టమాట రూ.60 నుంచి రూ.90 మధ్య పలుకగా సెప్టెంబర్ నుంచి భారీ స్థాయిలో తగ్గింది. నవంబర్‌లో రూ.50 కి చేరిన రేటు ఈ నెల మొదటి వారంలో రూ. 20కి పడిపోయింది. తాజాగా సోమవారం కిలో రూ.5 నుంచి రూ.10 మధ్యే పలికింది.
రైతుకు దక్కేది నాలుగు రూపాయలే...
వరంగల్ లక్ష్మీపురం, హనుమకొండ బాలసముద్రం వంటి కూరగాయల మార్కెట్లలో ప్రస్తుతం కిలో టమాట రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. 10 కిలోల టమాట పెట్టే మొత్తం కొంటే రూ.08 చొప్పునే ఇస్తున్నారు. ఈ సీజన్‌లో రూ.30 నుంచి రూ.40 మధ్య రేటు ఉంటుందని ఆశిస్తే హోల్‌సేల్‌గా రూ. 4 పడుతుండడంతో గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి టమాటను మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు మాత్రం 25 కిలోల పెట్టెకు రూ.150లోపే చెల్లిస్తున్నారు. ఆటో చార్జీలు సైతం రైతులే భరించాల్సి వస్తుండడంతో కిలోకు రూ. 3 నుంచి రూ. 4 దక్కుతున్నాయి. దీంతో రైతులు కూలి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మన రైతులను కాదని పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి
ఈ సీజన్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, యాదాద్రి, సూర్యాపేటతో పాటు వరంగల్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమాట సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో మార్కెట్లకు పంట తరలివస్తోంది. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు లోకల్ రైతులను కాదని ఏపీలోని కర్నూలు, నంద్యాల, మదనపల్లె, అనంతపురం, కర్నాటకలోని బెంగళూరు నుంచి పెద్దమొత్తంలో టమాటను దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడ క్వింటాల్ టమాట రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు కొని, ఇక్కడ రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు అమ్ముతున్నారు. దీంతో లోకల్ రైతులు కూడా అదే రేటుకు అమ్మాల్సి వస్తోంది.
ALSO READ : మన ఆడోళ్లు బంగారం.. దేశ మహిళల వద్ద 25 వేల టన్నుల పసిడి
రూ.5 కే కిలో అమ్ముతున్నాం
నేను పాలమూరు మార్కెట్లో పదేండ్ల నుంచి టమాట వ్యాపారం చేస్తున్న. ప్రస్తుతం ఈ కర్నూల్, షాద్‌నగర్, శంషాబాద్ ప్రాంతాల నుంచి టమాట వస్తోంది. చలికాలం కావడంతో దిగుబడులు పెరిగాయి. దీంతో ధర పడిపోయింది. 25 కిలోల టమాట బాక్స్‌ను రైతుల నుంచి రూ.80కే కొంటుండడంతో వారికి రూ. 3.50 పడుతోంది. ఓపెన్ మార్కెట్‌లో కిలో నుంచి కిలోన్నర టమాటను రూ.10కి అమ్ముతున్నాం. సాయంత్రం అయితే రూ.5కే ఇస్తున్నాం.
– అబ్దుల్లా, కూరగాయల వ్యాపారి, మహబూబ్‌నగర్
వచ్చిన పైసలు ఆటో కిరాయిలకే పోయినయ్
టమాట పంటకు ధరలు మంచిగ ఉన్నాయని సాగు చేసిన. తీరా చూస్తే.. మేం అనుకున్న ధరలకు.. మార్కెట్లో ఇచ్చే రేటుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. 25 కిలోల టమాట పెట్టెకు రూ.140 చొప్పున కట్టిచ్చిన్రు. కనీసం కిలోకు రూ.4 నుంచి రూ. 5 కూడా పడలేదు. దీంతో వచ్చిన పైసలు ఆటో కిరాయిలకే పోయినయ్. ఇన్నిరోజుల పడిన కష్టం ఉట్టిదే అయింది.
– గొర్రెకుంట కుమార్, దేవన్నపేట, వరంగల్
ఆటో పైసలు కూడా రావడం లేదు
మాకున్న ఎకరా పొలంలో టమాట వేసిన. మేమే టమాటను తెంపి మార్కెట్‌కు తెస్తున్నాం. అమ్మబోతే ధర వస్తలేదు. వ్యాపారులకు అమ్మే బదులు నేనే టమాట అమ్ముతూ కిలో రూ.8కి ఇస్తున్నా. సాయంత్రం ఇంటికి పోయే టైం అయితే టమాటలు కరాబ్ అవుతాయని వాటిని రోడ్డుపైనే పారబోస్తున్నాం. ఊరి నుంచి పంటను తెచ్చి అమ్మినందుకు ఆటో చార్జీలు కూడా వస్తలేవు. – అంజమ్మ, మహిళా రైతు, టంకర, మహబూబ్‌నగర్