నేడు సంచార జాతుల విముక్తి దినోత్సవం

దేశంలో  కులగణన, రాష్ట్రాల్లో  బీసీగణన  నినాదాల  ఆచరణ  ఎంతవరకు సాధ్యమోగానీ 78 ఏండ్ల స్వాత్రంత్ర్య భారతీయ సమాజంలో ఇంకా విముక్తి లభించని జాతులు ఎన్నో ఉన్నాయి.  అస్పృశ్యతకు లోనవుతున్న సంచార జాతుల సమూహాలు ఇప్పటికీ పరదేశీలుగా బతుకులీడుస్తున్నాయి.  తమకు స్వేచ్ఛ కావాలని,  విముక్తి  ప్రసాదించాలని ప్రతి ఏటా ఆగస్టు 31న సంచార జాతులు విముక్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

1947లో  అనంతశయనం అయ్యంగార్ కమిటీ విచారించి 1950లో తన నివేదిక కూడా సమర్పించింది. పోలీస్ రికార్డుల ప్రకారం వీరు 47,32,000 మందిగా ఉన్నారు.  వారి భార్య/భర్త /పిల్లలు  /తల్లి/తండ్రి/బంధువర్గాలను కలుపుకుంటే  దాదాపు 2 కోట్ల జనాభా.  500 కులాలు జాతులంటే ఆనాటి దేశ జనాభాలో 15 శాతం మందిని మొత్తం నేరస్థులుగా చూపడం ఈ జాతుల దురదృష్టకరమని అయ్యంగార్ తన రిపోర్ట్​లో పేర్కొన్నారు. అంతేకాదు 1871 నుంచి 1924 వరకు ఉన్న చట్టాన్ని రద్దు చేయాలని,  నేరమయ జీవితం ప్రాతిపదికగా నిర్ధారించాలిగానీ కులాలు, జాతులు, గుంపులు, కుటుంబాలు వారీగా నిర్ధారించరాదని సూచించారు. 

 దాదాపు 100 సంవత్సరాలు వీరికి చాలా అన్యాయం జరిగింది.  కాబట్టి, వారి స్థిర నివాసానికి, పునరావాసానికి, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50+50 శాతం బడ్జెట్ 10సంవత్సరాల వరకు  కేటాయించి అభివృద్ధిపరచాలని సూచించింది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టు 31 కేంద్రం ఆ జాతులను విముక్తి జాతులుగా ప్రకటిస్తూ డీ నోటిఫైడ్​గా పరిగణిస్తున్నది.  సంచార, అర్ధసంచార జాతులకు విద్య, ఉద్యోగ నియమాకాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. ఆ తర్వాత వచ్చిన కమిటీలూ సూచించాయి. కానీ, అధికారంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం ఈ జాతుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. 

వంద కమిటీలు.. నివేదికలు

సంచార జాతులపై అనేక అధ్యయనాలు, కమిషన్లు వేసి సానుకూల నివేదికలు వచ్చినా ఏ ప్రభుత్వం వీరికి న్యాయం చేయలేదు. ఎందుకంటే వీరికి స్థిర నివాసాలు లేవు. ముఖ్యంగా ఓటు బ్యాంకు లేదు. అందుకే ఏ రాజకీయ పార్టీ అంతగా పట్టించుకోవడం లేదన్నది నగ్నసత్యం.    పార్లమెంట్​లో  కూడా ఎందుకో గానీ సంచార జాతులమీద ఇంతవరకు చర్చించలేదు. 1936లో జవహర్ లాల్ నెహ్రూ నెల్లూరు బహిరంగ సభలో ఈ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అనే పదాలు అన్ని గ్రంథాల నుంచి, పుస్తకాల నుంచి తొలగించాలని, ఈ చట్టం పౌరస్వేచ్ఛను నిషేధించి, సంఘటితం కాకుండా చేసిందని ప్రసంగించారు. 

 అనంతరం పట్టాభి సీతారామయ్య,  వెన్నెలకంటి రాఘవయ్య వంటి మేధావులు పోరాడారు. నోటిఫైడ్ అయిన కులాలను డినోటిఫైడ్ గా పరిగణిస్తూ వారితో పాటు సంచార,  అర్ధ సంచార జాతులను కూడా  కలిపి డీఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీలో ఉన్న సర్టిఫికెట్​ను ఇచ్చి విద్యలో అవకాశం కల్పిస్తూ  ట్రైబల్  వెల్ఫేర్ నుంచి బడ్జెట్ కేటాయించారు.  కొంతకాలం తరువాత  ఎస్టీలు తమ బడ్జెట్ ను  డీఎన్టీలకు, ఎన్టీలకు, ఎస్ఎస్టీలకు ఎలా కేటాయిస్తారు అని రాజ్యాంగంలో  ఎస్సీ, ఎస్టీల గురించి ఉంది. కానీ, డీఎన్టీల గురించి లేదని ఆందోళనలు చేయడం ప్రారంభించారు.

కాల్కేకర్ కమిషన్
 

కేంద్ర ప్రభుత్వం 1953లో బీసీ కులాల అధ్యయనానికి కాకా కాలేల్కర్ కమిషన్ వేసింది. ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ లోని కులాలను క్రిమినల్ ట్రైబ్స్ అనిగాని,  క్రిమినల్, యాక్ట్ క్రిమినల్ అనిగాని పిలవరాదని సూచనలు చేసింది. ఈ కమిషన్ రిపోర్ట్ బుట్టదాఖలయింది.1965లో బీఎన్ లోకూర్  కమిటీ ఎస్సీ, ఎస్టీ కులాల పునఃసమీక్ష చేసింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో డీఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ జాబితాలో కలపడం వలన ఆయా తరగతులకు కేటాయించిన సంక్షేమ పథకాలను వీరు అందుకోలేకపోతున్నారని,  వీరిని ఆయా జాబితాల నుంచి తీసి ప్రత్యేక జాబితాగా పరిగణించి రిజర్వేషన్ కల్పించాలని సూచనలు చేశారు. సంచార జాతులకు పదిశాతం రిజర్వేషన్లను బీజేపీ ప్రకటించింది. ఎనిమిదేండ్లైనా ఆ రిజర్వేషన్ల ఊసెత్తకపోవడం విచారకరం. 

Also Read :- కొట్టుకుపోయిన అప్రోచ్ వంతెన.. నిలిచిన రాకపోకలు

ఎంబీసీ పేరుతో హైడ్రామా

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీసీల్లోని అణగారిన వర్గాలను గుర్తిస్తామని హామీఇచ్చిన కేసీఆర్ సర్కారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ వర్గాలను నిర్వచించలేకపోయింది. ఎవరు ఎంబీసీలు, ఎవరు సంచార జాతుల్లో స్పష్టంగా చెప్పలేకపోయింది. కేంద్రం గుర్తింపులో ఉన్న సంచార జాతులను తెలంగాణలో ఫెడరేషన్ల పేరుతో కేంద్రానికి తప్పుడు సమాచారం అందించింది. ‘పరదేశీలుగా’ పరిచయం చేసుకుని ఇతర సంచార జాతులైన పూసల, పూసబెరల, గంగిరెద్దుల, జంగం, కాటిపాపల, మేధరి, పంభాల, పెద్దమ్మలవాళ్లు, ముత్యాలమ్మల వాళ్లు, మందుల, కూనపులి, పట్రా, రాజన్నల, గోత్రాల, వీరముష్టి కులాలతో పాటు మరిన్ని గుర్తింపు ఉన్న కులాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి.  బీసీ కమిషన్​లో  వీరికి స్థానం కల్పించాలి.

- వెంకట్ గుంటిపల్లి
ఎంబీసీ, సంచార జాతుల జాతీయ కన్వీనర్