పొగాకుకు మస్తు రేటు..క్వింటాల్​కు రూ.13,500, బోనస్​ మరో రూ.300

  •     కిందటేడుతో పోలిస్తే రూ.5 వేల రేట్​ జంప్
  •     బైబ్యాక్​ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని ఫలితంగా రైతుకు మేలు 
  •     కొనుగోలు పోటీలో ఆరు కంపెనీలు​

నిజామాబాద్​, వెలుగు :  జిల్లాలో ఈ ఏడాది పొగాకు సాగు చేసిన రైతుల పంట పండింది.  ఎప్పుడూ రూ. 8,500 దాటని క్వింటాల్​ రేట్​ ఈసారి రికార్డు స్థాయిలో రూ.13,500కి  పెరిగింది.  బోనస్​ రూపంలో అదనంగా మరో రూ.300 ముట్టజెప్పి మరీ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. గతంలో మాదిరి రైతులు కొనుగోలుదారులతో బైబ్యాక్​ అగ్రిమెంట్​ చేసుకోకుండా ధైర్యంగా పంట సాగు చేయడం కలిసొచ్చింది.  పొగాకును కొనడానికి కంపెనీలు పోటీపడడం మరింత మేలు చేస్తోంది. 

ఒక్కసారిగా మారిన సీన్​

జిల్లాలోని బోధన్​ డివిజన్​ నల్లరేగడి మెరక భూమిలో రైతులు పొగాకు సాగు చేస్తారు. మంజీరా నది తీర ప్రాంతంలోని కల్దుర్కి, రాంపూర్​, హంగర్గా, కొప్పర్గా, ఖండ్​గావ్​, చిన్నమావంది, కందకుర్తి, నీల, బోర్గాం పోతంగల్​లోని కొంత భాగంలో ఏటా సుమారు 6 వేల ఎకరాలలో పొగాకు పంట వేస్తారు. జూన్​ నెలలో నారుపోసి ఆగస్టులో నాటుతారు. తొమ్మిది నెలల కాలానికి చేతికందే పొగాకు పసుపు తర్వాత లాభదాయకమైన వాణిజ్య పంట.  గత ఏడాది వరకు వీఎస్​టీ (వజీర్​ సుల్తాన్​ టొబాకో ) కంపెనీ మాత్రమే రైతులతో బైబ్యాక్​ ఒప్పందం చేసుకునేది. 

అంటే పంట దిగుబడి వచ్చాక కొనుగోలు చేసే ధరను ముందే నిర్ణయించేవారు.  పంటకు అవసరమైన పురుగుల  మందును అప్పుగా అందించేవారు.  దిగుబడి మొత్తాన్ని ఒప్పందం చేసుకున్న కంపెనీకే  రైతు విక్రయించాల్సి ఉంటుంది.  ఇలా  గత ఏడాది క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొగాకు రూ.8,500 రేట్​తో అమ్ముడుపోయింది.  ఈసారి బైబ్యాక్​ అగ్రిమెంట్​ చేసుకోడానికి కంపెనీలు ముందుకు రాకపోయినా అమ్మకాల గురించి ఎలాంటి భయం పెట్టుకోకుండా రైతులు పంట సాగు చేయడం ఇప్పుడు కాసులు కురిపిస్తోంది. 

వీఎస్​టీ, పీటీపీ, ఆర్​కేటీ, ఐటీసీ, అలయెన్స్​, జఫారుల్లాఖాన్​ కంపెనీలు పోటాపోటీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. పంటసాగైన విలేజ్​లలో సుమారు 50 దాకా పర్చేజ్​  సెంటర్లు నడుపుతున్నారు.  క్వింటాల్​కు రూ.13,500 రేట్,​ బోనస్​ పేరుతో రూ.300 కలిపి మొత్తం రూ.13,800 చెల్లిస్తున్నారు. సొమ్మును ఆన్​లైన్​లో ట్రాన్స్​ఫర్​ చేస్తున్నారు. 

పంట రూ.వంద కోట్లు

కలిసొచ్చిన కాలం సామెతను నిజం చేస్తూ  ఈసారి ఎకరానికి అత్యధికంగా సగటున15 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వస్తోంది. ఇంతకు ముందు ఇది పది నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే ఉండేది. ఒకవేళ దిగుబడిని ఇప్పుడూ 12 క్వింటాళ్లతో లెక్కించినా 6 వేల ఎకరాలలో సాగు చేసిన పంట దిగుబడి 72 వేల క్వింటాళ్లు. దాని విలువ రూ.వంద కోట్ల వరకు ఉంటుంది. అంటే పొగాకు పంట తాలూకు నగదు అక్షరాల రూ.వంద కోట్లు జిల్లాలో చేతులు మారతోందన్న మాట.  

ఊహించని రేట్​

ఎప్పుడూ ఊహించని రేట్​ ఈసారి పొగాకుకు లభిస్తోంది. ​ ఐదెకరాలలో పంట సాగు చేసిన. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.5 వేల ధర జంప్​ అయింది. చాలా సంతోషంగా ఉంది.  కంపెనీలతో ఒప్పందం లేనందున ఎలా ఉంటుందో  అనే ఆలోచన అప్పుడప్పుడు అనిపించినా ఇంత బాగా రేటు వస్తుందని ఊహించలేదు.

చిన్నసాయిలు, కొప్పర్గా రైతు